సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ బస్ డిపో వద్ద అఖిలపక్ష నేతల ఆందోళన. చిత్రంలో విమలక్క, సంధ్య, తమ్మినేని, అజీజ్‌పాషా, రేవంత్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన భారత్ బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమం అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసింది. ఆదివారం రాత్రి నుంచే జోరుగా వర్షం కురుస్తుండటంతో సోమవారం ఉదయం ఆందోళనకారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందిపడ్డారు. పోలీసులు ఉదయం నుంచే అఖిలపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడంతోపాటు ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఉద యం నుంచే కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్రంలోని బస్‌డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఉదయం 10 గం. తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాం తాల్లో బస్సుల రాకపోకలు యథావిధిగా సాగా యి. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తెరచినా విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు అక్కడకు చేరుకుని మూసివేయించారు.
ఉదయం 10 గంటల తర్వాత వాణిజ్య దుకాణాలు యథావిధిగా నడిచాయి. మాల్స్, మార్కెట్లు కూడా పలుచోట్ల ఉదయం నుంచే కార్యకలాపాల్లో నిమగ్నంకాగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆం దోళనకారులు మూసివేయించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశాయి. ఈ బంద్‌లో పాల్గొన్న ముఖ్య నేతలనూ పోలీసులు అరెస్టు చేసి.. కొంతసేపటి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
బంద్‌లో భాగంగా ప్రతిపక్షాల రాస్తారోకోతో ఖమ్మం బైపాస్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు
ఎక్కడికక్కడ నిర్బంధం...
బంద్ సందర్భంగా పలువురు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలను సోమవారం ఉదయాన్నే గృహ నిర్బంధం చేశారు. ఉప్పల్ బస్‌డిపో ఎదుట జరిగిన ఆందోళనలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత అజీజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. హయత్‌నగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడా వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు జూల కంటి రంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, మధుయాష్కీ గౌడ్, మల్‌రెడ్డి రాంరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్ తదిత రులు ర్యాలీ నిర్వహించారు.
వీరిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కోదండరాం దుస్తులు చినిగిపోయాయి. శంషాబాద్ వద్ద సీపీఐ నేత నారాయణ, పుల్లూరు టోల్‌గేట్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, మేడ్చల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ముంబై హైవేపై మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, బంజా రాహిల్స్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, తుక్కుగూడ వద్ద ఏఐసీసీ కార్య దర్శి వంశీచందర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొనగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరా బాద్– విజయవాడ, హైదరాబాద్– శ్రీశైలం, హైద రాబాద్–బెంగళూర్ వెళ్లే జాతీయ రహదారులు రాస్తారోకోలతో స్తంభించిపోయాయి. హైదరాబా ద్‌లో ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు యథావిధిగా నడిచాయి.
పలు ప్రాంతాల్లో బంద్ ఇలా...
►సిద్దిపేట జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. పలుచోట్ల ప్రతిపక్షాల కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.
►నల్లగొండ బస్‌స్టాండ్ ఎదుట బైఠాయించిన అఖి లపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్య క్షుడు చెరకు సుధాకర్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి నల్లగొండ పరిధి లోని మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, దేవరకొండ, నకిరేకల్ ప్రాం తాల్లో ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారా యణపేటలో మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. మిగతా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉదయం 10 నుంచే బస్సులు నడిచాయి. పలు షాపులు, హోటళ్లు, వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి.
►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగింది. సోమవారం తెల్లవారుజాము నుంచే అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. జోరు వర్షంలో సైతం ఖమ్మం ఆర్టీసీ బస్‌డిపో, బస్టాండ్, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం బస్‌డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో మధ్యాహ్నం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 610 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొన్ని బస్సులను నడిపారు.
►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నా యకులను పోలీసులు అరెస్టు చేశారు. యాచా రం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, ఆది భట్ల ప్రాంతాల్లో పోలీసులు వారిని అదుపులో కి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగా రెడ్డిని ఉదయమే గృహ నిర్బంధం చేశారు.
►ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాం తంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లో దుకాణాలు కొంత ఆలస్యంగా తెరిచారు. కాం గ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేస్తూ వ్యాపార సముదాయాలను మూసేయిం చారు. మధ్యాహ్నం తరువాత దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు తెరుచుకున్నాయి.
ఆ చట్టాలు రద్దు చేయాలి..
‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశాన్ని పెట్టుబడిదారు లకు తాకట్టు పెట్టి తెగన మ్మేందుకు సిద్ధమయ్యారు. రైతు చట్టాలను నిరసిస్తూ నాడు మంత్రి కేటీఆర్ కూడా బంద్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ఢిల్లీ పిలుపుతో కేసీఆర్ అక్కడ విందులో పాల్గొన్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చే వరకు, నోటిఫికేషన్ ఇచ్చే వరకు కేసీఆర్ ఫ్లెక్సీలకు లిక్కర్‌తో అభిషేకం చేయాలి. ప్రతి బార్ షాపు ముందు కేసీఆర్ బొమ్మ పెట్టాలి’.
– టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
మోదీ సర్కార్‌పై వ్యతిరేకతతో...
దేశంలో ఆరు రాష్ట్రాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్పు కుంటున్న తెలంగాణ సర్కా ర్ మద్దతు ఇవ్వడం లేదు. ఈ బంద్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాదు.. మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలే ప్రకటిం చింది.
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఆ అధికారం లేదు...
నిరసన హక్కును నియంత్రించే అధికారం తప్ప.. నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. నిరసన ప్రజల హక్కు, దాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోర్టు లు తీర్పిచ్చినా సర్కార్ పట్టించుకో వడంలేదు. నిరసనకారులను అరెస్ట్ చేస్తుండటా న్ని చూస్తే కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కుమ్మకైనట్లు అర్థమవుతోంది. – టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
ఆ చట్టాలు రైతులకు ఉరితాళ్లు
కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు అదానీ, అంబానీకి బానిసలుగా మార్చేవి మాత్రమే. మోదీకో హటావో.. దేశ్‌కో బచావో అన్నది ఇప్పుడు అత్యవసరం.
– సీపీఐ జాతీయ నేత నారాయణ
Comments
Please login to add a commentAdd a comment