'అందుకే మోదీ నోట్ల రద్దు నిర్ణయం'
హైదరాబాద్ : దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీ, నక్సలిజం, ఉగ్రవాదం వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..నల్లధనం అరికట్టేందుకు మొదటి కేబినేట్‌లోనే సిట్ ఏర్పాటు చేశారన్నారు.
పన్నులు కట్టకుండా ఎగవేస్తున్న ధనం క్రమబద్దీకరణ కోసమే పెద్ద నోట్ల రద్దు చేశారని ఆయన చెప్పారు. బినామీ ఆస్తులను అరికట్టేందుకు బినామీ చట్టం తెచ్చారన్నారు. ప్రతిపక్షాల బంద్‌ను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే పరిగణిస్తున్నామని చెప్పారు. కంపెనీలు, స్టాక్‌మార్కెట్ షేర్లు బినామీ పేర్లతో ఉన్నాయని, వీటన్నింటినీ వెలికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందన్నారు. నక్సలైట్ల వద్ద రూ.60 వేల కోట్లు ఉన్నాయని, నోట్ల రద్దుతో అవన్నీ చిత్తుకాగితాలు అవుతాయన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిపి బంద్‌కు పిలుపునిచ్చినా ప్రజలు దాన్ని విఫలం చేశారన్నారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని కూడా వెనక్కితేవడం కోసం కేంద్రం చర్యలు చేపడుతుందని ఇంద్రసేనారెడ్డి చెప్పారు.