నేడు భారత్ బంద్ | Bharat Bandh on Sept 2: Strike by 10 trade unions to hit banking | Sakshi
Sakshi News home page

నేడు భారత్ బంద్

Published Fri, Sep 2 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

నేడు భారత్ బంద్

నేడు భారత్ బంద్

బ్యాంకింగ్, రవాణా, టెలికం సేవలకు తీవ్ర అంతరాయం
సమ్మెలో పాల్గొంటున్న 10 కేంద్ర కార్మిక సంఘాలు
12 డిమాండ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా బంద్: కార్మిక సంఘాలు
కనీస వేతనం రూ. 18 వేలు, పెన్షన్ రూ. 3 వేలు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికం వంటి కీలక సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం ఉదాసీనత, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) మినహా అన్ని ప్రధాన సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.  సమ్మెలో 18 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని అంచనా.

తమ డిమాండ్ల పరిశీలనకు కేంద్రం హామీ, రెండేళ్ల బోనస్, కనీస వేతనం రూ.350కి పెంపు చర్యలు సరిపోవ ంటూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లు పరిష్కరించాలన్నాయి. ‘12 అంశాలతో కూడిన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష కార్మిక వ్యతిరేక చట్ట సవరణల్ని నిరసిస్తూ సంఘటిత, అసంఘటిత రంగ  కార్మికులు రోడ్లపై నిరసన తెలుపుతారు’ అని కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి తివారీ చెప్పారు. కార్మికులతో ఘర్షణ పడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని, వారి సహకారం, మద్దతు కావాలని కార్మిక  మంత్రి  దత్తాత్రేయ అన్నారు. మొత్తం 12 డిమాండ్లలో ఎనిమిది కార్మిక శాఖకు సంబంధించినవి కాగా వాటిలో ఏడింటిని అంగీకరించామని చెప్పారు.

కనీస వేతనం రూ. 18 వేలు సహేతుకమే:
సమ్మెతో ఓడరేవులు, పౌరవిమానయానం, రవాణా, టెలికం, బ్యాంకింగ్ రంగాలు స్తంభిస్తాయని టీయూసీసీ ప్రకటించింది. ఆస్పత్రులు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది బంద్‌లో పాల్గొంటారని, రోజువారీ విధులకు భంగం కలగకుండా నిరసన తెలుపుతారంది.  కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని తివారీ చెప్పారు. తాము ఎక్కువ అడగడం లేదని, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని కోరుతున్నామన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు సరైనదేనంటూ సమర్ధించుకున్నారు. నేటి సమ్మెలో రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం లేదు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ వేతనం రూ. 18 వేల నుంచి దాదాపు రూ. 26 వేలకు పెంచాలన్న వారి డిమాండ్  పరిశీలనకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు.

 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు: ఏఐటీయూసీ
సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించిన పారిశ్రామిక ప్రాంతాలు, పలు విభాగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) తెలిపింది. ఢిల్లీలోని ఓక్లా, కీర్తినగర్, మయపురి ఏరియా, వజీర్‌పూర్, మంగోల్‌పూరి, పత్‌పర్‌గంజ్ సహా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించింది. బ్యాంకులు, బీమా, యూనివర్సిటీ, తపాలా, టెలికం, రక్షణ, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక సహా 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు చేస్తామని ఏఐటీయూసీ పేర్కొంది. ఆగస్టు 31న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాట్లాడారని, కార్మికులకు సరైన వేతనం, సాంఘిక భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆగస్టు 31న మంత్రి దత్తాత్రేయ చెప్పారని  తెలిపింది.

 రేడియాలజిస్టుల సమ్మె..
తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

స్తంభించనున్న బ్యాంకింగ్ రంగం
ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు సంఘాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడంతో నేటి సమ్మెతో ఆ రంగం కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు బ్యాంకులు ఆ విషయాన్ని వెల్లడించాయి. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోషియేషన్(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోషియేషన్(ఏఐబీఓఏ), ఆలిండియా ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఎఐబీఓసీ), ఇండియన్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్స్ కాంగ్రెస్‌లు బంద్‌కు నోటీసులిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement