హోరెత్తిన 'జై కిసాన్' | Bharat Bandh Success: Central Govt Talks With Farmer Associations | Sakshi
Sakshi News home page

హోరెత్తిన 'జై కిసాన్'

Published Wed, Dec 9 2020 4:15 AM | Last Updated on Wed, Dec 9 2020 5:55 AM

Bharat Bandh Success: Central Govt Talks With Farmer Associations - Sakshi

ఢిల్లీ–హరియాణా సరిహద్దులో జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో బైఠాయించిన రైతులు

న్యూఢిల్లీ/చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. రైతులు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా నాలుగు గంటల పాటు(మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) బంద్‌ నిర్వహించాలన్న రైతు సంఘాల పిలుపునకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌.. తదితర రాష్ట్రాల్లో బంద్‌ 100% విజయవంతమైంది. ఒడిశా, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్‌ల్లోనూ బంద్‌ ప్రభావం అధికంగా కనిపించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా వ్యాపారస్తులు దుకాణాలను మూసి వేశారు. రైల్వే ట్రాక్స్‌ను, కీలక రహదారులను, చౌరస్తాలను నిరసనకారులు దిగ్బంధించారు.
సింఘు వద్ద రైతుల కోసం సిద్ధమవుతున్న ఆహారం 

బంద్‌ విజయవంతమైందని, బంద్‌కు ప్రజలనుంచి లభించిన మద్దతు చూసిన తరువాతైనా తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించాలని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. బంద్‌ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అనూహ్యంగా నేరుగా రంగంలోకి దిగారు. ఆయన మంగళవారం రాత్రి రైతు సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ‘మరో మార్గం లేదు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఒప్పుకుంటారా? లేదా అన్నదే షా ముందు మేం పెట్టే ఏకైక డిమాండ్‌’ అని షా తో చర్చలకు వెళ్లేముందు రైతు నేత రుద్రు సింగ్‌ తేల్చి చెప్పారు.  ‘సూపర్‌ బంద్‌’తో కేంద్ర ప్రభుత్వ కళ్లు, చెవులు తెరుచుకున్నాయని రైతు సంఘం నేతలు వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద వారు మీడియాతో మాట్లాడారు. నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ, హరియాణా ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని, రామ్‌లీలా మైదానంలో నిరసనలను కొనసాగించేందుకు అభ్యంతరం లేదన్నారు.

ఓపెన్‌ జైలు వంటి బురాడీ గ్రౌండ్‌కు మాత్రం వెళ్లబోమని స్పష్టంచేశారు. కశ్మిర్‌ నుంచి కన్యాకుమారి వరకు బంద్‌ జరిగిందని హరియాణా భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రైతుల బంద్‌ పిలుపునకు కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, వామపక్షాలు, ఆప్, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మద్దతివ్వడమే కాకుండా, ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొన్నాయి. ముఖ్యమైన కార్మిక సంఘాలు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటూనే, విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. 25 రాష్ట్రాల్లోని దాదాపు 10 వేల ప్రాంతాల్లో బంద్‌ కొనసాగిందని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు.  సింఘు, టిక్రి తదితర ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాలు ‘జై కిసాన్‌’, ‘కిసాన్‌ ఏక్తా జిందాబాద్‌’ అనే నినాదాలతో హోరెత్తాయి. టిక్రిలో జరిగిన సభలో సుమారు 2 వేల మంది  పాల్గొన్నారు. ఉద్యమం నుంచి దృష్టి మళ్లించేందుకే తమను కొందరు ‘ఖలిస్తానీ’, ‘పాకిస్తానీ’ అంటున్నారని, ఇక్కడ అంతా రైతులమేనని, హిందూ, ముస్లిం, సిఖ్‌ భేదాలేవీ లేవని వారు స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణాల్లో షాపులు, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్‌ బంక్‌లు మూతపడ్డాయి.  

పంజాబ్‌లోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, ఆప్‌లు ఈ బంద్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా పంజాబ్‌లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా ‘క్యాజువల్‌ లీవ్‌’ తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు. రహదారులపై ధర్నా చేశారు. అధికార టీఎంసీ బంద్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ.. బంద్‌లో క్రియాశీలకంగా పాల్గొనలేదు. బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాల్గొన్నారు. బిహార్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసనకారులు ధర్నా నిర్వహించారు. ఒడిశాలోని రైలు సేవలకు అంతరాయం కలిగింది. భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు, నిరసన కారులు రైల్వే ట్రాక్‌లపై కూర్చుని నిరసన తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో వ్యాపారస్తులు షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. మహారాష్ట్రలో అధికార శివసేన– కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి మద్దతివ్వడంతో బంద్‌ విజయవంతంగా ముగిసింది. రైతులకు మద్దతుగా అహ్మద్‌నగర్‌ జిల్లాలోని స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఒకరోజు నిరహార దీక్ష చేపట్టారు. అస్సాంలో పలు పట్టణాల్లో దుకాణాలను మూసేశారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు నిరసనల్లో పాల్గొన్నాయి. కర్ణాటకలోనూ బంద్‌ ప్రభావం కనిపించింది. రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. రైతుల శక్తిని ఈ బంద్‌ కేంద్రానికి చూపిందని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా వ్యాఖ్యానించారు.  

నేడు రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రతిపక్ష పార్టీల నేతలు నేడు సమావేశం కానున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సహా విపక్షాలకు చెందిన మొత్తం ఐదుగురు సభ్యుల బృందం బుధవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలు, ఆ చట్టాల్లో రైతులు లేవనెత్తిన అభ్యంతరకర అంశాలను రాష్ట్రపతి దృష్టికి విపక్ష నాయకులు తీసుకెళ్ళనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కంటే ముందు విపక్ష నాయకులు చర్చించి తమ సమష్టి వైఖరిని రాష్ట్రపతికి వెల్లడిస్తాయని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మంగళవారం ప్రకటించారు. గత 13 రోజులుగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. భారత్‌ బంద్‌ నిరసన కార్యక్రమాన్ని సైతం చేపట్టారు. వ్యవసాయ సవరణ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు కేంద్రంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నేడు 11 గంటలకు ఆరో విడత చర్చలు జరుగనున్నాయి. సాగు చట్టాల సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉందని, చట్టాలను రద్దు చేయడం అసాధ్యమని కేంద్ర మంత్రులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చల్లో ప్రభుత్వం వైఖరి మార్చుకోని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తా మని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.


రాజకీయం చేయొద్దనే..
బంద్‌కు సంబంధించి నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని ప్రతిపక్ష నేతలంతా కలిసికట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని వామపక్ష నేతలు వెల్లడించారు. రైతు సంఘాలు కూడా ఇదే కోరుకున్నాయన్నారు. అందువల్లనే నిరసన ప్రదేశాల్లో పార్టీ బ్యానర్లను ప్రదర్శించలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు రైతులకు మద్దతిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. రైతు నిరసనను రాజకీయం చేయకూడదని తాము భావించామని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన ఉద్యమమని సీపీఐ నేత డీ రాజా పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఎపీఎంసీ) చట్టం కొన్ని సవరణలతో కొనసాగాలన్నదే తన ఉద్దేశమని, గతంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా అదే విషయాన్ని స్పష్టం చేశానని ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ వివరణ ఇచ్చారు. ఈ విషయమై గతంలో తాను రాసిన లేఖపై బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు.

రైతు నేతలతో అమిత్‌ షా చర్చలు 
రైతు ప్రతినిధులతో హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో మరో విడత చర్చలు నేడు జరగనున్న నేపథ్యంలో.. అందుకు ఒక రోజు ముందు హోంమంత్రి కొందరు ఎంపిక చేసిన రైతు ప్రతినిధులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు సంఘాల నుంచి 13 మంది నేతలను చర్చలకు ఆహ్వానించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరిలో పంజాబ్‌ నుంచి 8 మంది, ఇతర జాతీయ రైతు సంఘాల నుంచి ఐదుగురు ఉన్నారన్నాయి. గతంలో ఐదు విడతలుగా రైతు ప్రతినిధులతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, పియూష్‌ గోయల్, సోమ్‌ ప్రకాశ్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. మొదట అమిత్‌ షా నివాసంలో ఈ చర్చలు జరుగుతాయని భావించారు. కానీ అనూహ్యంగా వేదికను పుసాలోని నేషనల్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ కాంప్లెక్స్‌కు మార్చారు. అయితే, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాల ప్రతినిధులు వెనక్కు తగ్గకపోవడంతో.. చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. షా తో చర్చలు ముగిసిన అనంతరం.. రైతు ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సవరణల ప్రతిపాదనతో ముందుకు వచ్చినప్పుడు బుధవారం నాటి చర్చలకు అర్థం లేదని ఒక రైతు నేత అభిప్రాయపడ్డారు.  ‘రేపు(బుధవారం) చర్చలు జరిగే అవకాశం లేదు. సవరణలకు మేం సిద్దంగా లేము. చట్టాల రద్దుకు వారు సిద్ధంగా లేరు. ఇక చర్చలకు అర్థమేముంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, షాతో సమావేశానికి హాజరైన పలువురు ఇతర నేతలు మరో విధంగా స్పందించారు. సవరణలతో పాటు, కనీస మద్దతు ధర విధానానికి స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి లభిస్తే చాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్న సవరణలను పరిశీలించిన తరువాత భవిష్యత్‌  కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ‘చట్టాల రద్దు కుదరదని హోం మంత్రి స్పష్టం చేశారు. ఆ చట్టాలకు ఎలాంటి సవరణలు చేస్తామో రాతపూర్వకంగా రేపు ఇస్తామని చెప్పారు. ఇతర రైతు సంఘాల నేతలతో చర్చించి రేపటి సమావేశానికి హాజరు కావాలో, వద్దో నిర్ణయించుకుంటాం’ అని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మోల్లా వివరించారు. 

ట్రాక్టర్‌ టు ట్విట్టర్‌..
అమృత్‌సర్‌లో అన్నదాతల ట్రాక్టర్‌ ర్యాలీ
 

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్‌ బంద్‌కు సోషల్‌ మీడియాలో అనూహ్య మద్దతు లభించింది. నాగళ్లు, ట్రాక్టర్లు, పంటలు ఫోటోలతో ట్విటర్‌ హోరెత్తిపోయింది. రైతన్నలకు సంఘీ భావంగా నెటిజన్లు మెసేజ్‌ లతో హోరెత్తించారు. ఆజ్‌ భారత్‌ బంద్‌ హై అన్న హ్యాష్‌ట్యాగ్‌ సాయంత్రం వరకు ట్రెండింగ్‌లోనే ఉంది. స్టాండ్‌ విత్‌ఫార్మర్స్, కిసాన్, ఫార్మర్స్‌ప్రొటెస్ట్, ట్రాక్టర్‌టు ట్విట్టర్, నోఫార్మర్స్‌ నోఫుడ్‌ అన్న హ్యాష్‌ ట్యాగ్‌లు వినియోగించారు. బంద్‌ ప్రభావాన్ని తెలియజేసే ఫొటోలు, నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్‌ యార్డు ఫోటో లను షేర్‌ చేశారు.  భారత్‌ మ్యాప్‌కి ఒక నాగలి తాళం వేస్తున్నట్టుగా ఉన్న ఒక చిత్రం ట్విట్టర్‌లో విస్తృతంగా షేర్‌ అయింది. ‘మన ఆర్థిక వ్యవస్థలో అన్నీ రిటైల్‌గా కొనుగోలు చేసి, తన దగ్గరున్న సమస్తాన్ని హోల్‌సేల్‌లో అమ్ముకునే ఏకైక వ్యక్తి రైతు... అన్నదాత లేకపోతే మనకి తిండి లేదు. నా సహోదరుడికి అండగా ఉంటా’ అని ఒక నెటిజన్‌ స్పందిస్తే, ‘మన కడుపులు నింపే అన్నదాతకు బాష్ప వాయువులు, వాటర్‌ కెనాన్లు, కరకు లాఠీల మోతలు బహుమానమా’ అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు ట్రెండింగ్‌లో ఉంటారని ఎవరూ ఊహించలేదని మరి కొందరు కామెంట్లు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement