తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక బంద్ విజయవంతంగా సాగుతోంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఆర్టీసీ సిటీబస్సులు నిలిచిపోయాయి. ఆటోలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. దాంతో సామాన్యులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సిటీబస్సులు లేకపోవంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ప్రతిరోజూ వందలాది బస్సులు నడిపే వేలాది ట్రిప్పులలో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కానీ సార్వత్రిక సమ్మె పేరుతో ఆర్టీసీ సిటీబస్సులు ఆగిపోవడంతో.. ఇక సెట్విన్ బస్సులు, షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది.
దొరికిందే చాన్సని సెట్విన్ బస్సులలో కూడా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని, వాటిలో పుష్పకవిమానంలా ఎంతమంది వస్తే అంతమందిని ఎక్కిస్తూ ఇరికిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ఇక షేర్ ఆటోలు, మామూలు ఆటో చార్జీల గురించి చెప్పనక్కర్లేదు. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల మీదుగా వెళ్లే షేర్ ఆటోలలో ఒక్కోదాంట్లో దాదాపు 15 మంది వరకు ఎక్కిస్తున్నారు. డ్రైవర్‌కు అటూ ఇటూ ఐదుగురు కూర్చుంటున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఆటోలు వెళ్తున్నాయి.
రామంతపూర్ నుంచి కోఠి వరకు వెళ్లాలంటే సాధారణంగా షేర్ ఆటోలో 15 రూపాయలు తీసుకుంటారు. కానీ, శుక్రవారం మాత్రం ఇది అమాంతం 100 రూపాయలు అయిపోయింది!! దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు అవసరమైతే వాయిదా వేసుకునే అవకాశం ఉన్నా.. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవాళ్లు మాత్రం సమ్మె వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వ్యక్తిగత వాహనాలను వాడొద్దంటూ ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కానీ, ఇలాంటి సమయాల్లో మాత్రం ప్రత్యామ్నాయం కల్పించడం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని జంటనగరాల వాసులు మండిపడుతున్నారు.
సమ్మె ఎఫెక్ట్: జనం జేబుకు చిల్లు
Published Fri, Sep 2 2016 9:56 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
Advertisement