వినాయక మండపాలకు చార్జీలా.. హవ్వ! | Heavy charges for Vinayaka Mandapams: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వినాయక మండపాలకు చార్జీలా.. హవ్వ!

Published Mon, Sep 9 2024 5:54 AM | Last Updated on Mon, Sep 9 2024 5:54 AM

Heavy charges for Vinayaka Mandapams: Andhra pradesh

వినాయక మండపాలకు భారీ చార్జీలపై సర్వత్రా ఆగ్రహం

చంద్రబాబు ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ప్రజల కన్నెర్ర 

తోకముడిచిన ప్రభుత్వం.. చార్జీల ఉపసంహరణ

సాక్షి, అమరావతి: హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం విభ్రాంతి కలిగిస్తోంది. వినాయక మండపాలను ఆదాయ వనరుగా చేసుకునేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. సీఎం చంద్రబాబు చెప్పారని సింగిల్‌ విండో విధానం పేరిట స్వయంగా హోం మంత్రి వంగలపూడి అనిత వినాయక మండపాలకు అనుమతుల కోసం భారీ చార్జీలను నిర్ణయించడం వివాదాస్పదమైంది. వినాయక మండపాల ఏర్పాటుకు భారీ ఫీజులు చెల్లించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వం విధానంపై హిందువులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో తోకముడిచిన చంద్రబాబు ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు యతి్నంచి అడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...  

జగన్‌ సర్కారుపై నెపం నెట్టేందుకు కుట్ర 
వినాయక మండపాలకు అనుమతుల పేరిట భారీగా చార్జీలు వసూలు చేయడం పట్ల రాష్ట్రంలోని హిందువులు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాన మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దాంతో బెంబేలెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం తోకముడిచింది. సీఎం చంద్రబాబు హోం మంత్రి అనితను పిలిపించి మాట్లాడి ఈ అంశాన్ని పక్కదారి పట్టించమని ఆదేశించినట్టు సమాచారం. దాంతో ఆమె వినాయక మండపాలకు అనుమతుల కోసం నిర్ణయించిన చార్జీల విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆదివారం ప్రకటించారు.

అంతేకాదు.. వాస్తవాలను కప్పిపుచ్చుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు మంత్రి అనిత యతి్నంచడం గమనార్హం. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచి్చన జీవో గురించే తనకు అధికారులు చెప్పారని.. ఆ జీవోలోని అంశాలనే తాను వెల్లడించానని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదనే విషయాన్ని గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ కమిటీలు గుర్తు చేశాయి. మొదటిసారిగా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే వినాయక మండపాల్లో మైకులు, విగ్రహాలు ఏర్పాటుకు చార్జీలు చెల్లించామని కూడా స్పష్టం చేశాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైకి నెపం నెట్టేసేందుకు హోంమంత్రి అనిత ప్రయతి్నంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. మరి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఏడు సంక్షేమ పథకాలైన జగనన్న అమ్మ ఒడి,  జగనన్న విద్యా దీ­వెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంత్రి అనిత వెల్లడించిన ఫీజులు ఇవీ  
మైక్‌ సెట్‌ కోసం రోజుకు రూ.100 చొప్పున, 3 అడు­గులలోపు విగ్రహం పెడితే.. రూ.350, 6 అడు­గులలోపు విగ్రహమైతే రూ.700 చొప్పున వసూలు చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం గణేశ్‌ నవరాత్రుల నిర్వహణకు రోజుకు రూ.100 చొప్పున 9 రోజులకు రూ.900 చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది వినాయక మండపాలు ఏర్పా­టు చేస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వం కేవలం మైక్‌ సెట్‌ అనుమతుల పేరిట కోట్లాది రూపాయ­లు బలవంతంగా వసూలు చేసేందుకు పన్నాగం పన్నింది.

ఇక రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వినాయక మండపాల్లో విగ్రహానికి రూ.350 నుంచి రూ.700 చొప్పున వసూలు చేస్తూ కూడా కోట్లాది రూపా­య­లు ఆదాయంగా రాబట్టేందుకు కుతంత్రం పన్నింది. ఏకంగా హోం మంత్రి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు మైక్‌ సెట్, విగ్రహం ఏర్పాటు కోసం రుసుములు చెల్లించారు. ఆ మేరకు చార్జీలు చెల్లించిన రశీదులు చూపించిన అనంతరమే వినాయక మండపాలకు స్థానిక అధికారులు అనుమతులు ఇచ్చారు. భారీ చార్జీలు చెల్లించే శని­వారం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement