Bharat Bandh LIVE Updates, in Telugu | Farmers Protest, Telangana, Andhra Pradesh Latest News - Sakshi
Sakshi News home page

విజయవంతంగా ముగిసిన భారత్ బంద్

Published Tue, Dec 8 2020 7:39 AM | Last Updated on Tue, Dec 8 2020 6:37 PM

Bharat Bandh Live Updates: Nationwide Farmers Protest - Sakshi

భారత్‌ బంద్‌ విజయవంతంగా ముగిసింది. రైతులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించింది. తెలంగాణలోనూ బంద్‌ విజయవంతంగా సాగింది. తెలంగాణ రోడ్లపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నిరసన తెలిపాయి. రైతులకు పూర్తి అండగా నిలుస్తామని పలు పార్టీల నేతలు పేర్కొన్నారు.  

రైతు మెడకు ఉరి తాడుగా మారిన చట్టాలను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు మెడకు ఉరి తాడుగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు భూపాల్ రెడ్డి, నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.

రోడ్డుపై బైఠాయించిన కేటీఆర్‌
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్‌ బూర్గులకు చేరుకున్నారు. అనంతరం షాద్‌నగర్‌​జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేట్టారు. 

నల్లబెలూన్లు ఎగురవేసిన నిరసన తెలిపిన ఎంఎల్‌సీ కవిత
కామారెడ్డి: భారత్‌ బంద్‌కు మద్దతుగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు టెక్రియల్‌ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం నిజామాబాద్‌- ముంబై జాతీయ రహదారిని దిగ్భందించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రహదారిపైకి భారీగా చేరుకున్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్‌ పాల్గొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ రహదారి దిగ్భందనంలో కవిత బైటాయించారు.

వైఎస్సార్‌ జిల్లాలో..
రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ నేడు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌ తలపెట్టారు. దీంతో కమలాపురంలో కడప- తాడిపత్రి జాతీయ రహదారి క్రాస్‌ రోడ్డు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బంద్‌ చేపట్టారు. 

మరికాసేపట్లో బూర్గులకు చేరుకోనున్న కేటీఆర్‌
మంత్రి కేటీఆర్‌ మరికాసేపట్లో బూర్గుల చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్‌ బంద్‌లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బూర్గులకు చేరుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవేను దిగ్భందించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలు రోడ్లపైకి చేరుకోడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

విజయవాడలో..
భారత్ బంద్‌లో భాగంగా లెనిన్ సెంటర్‌లో రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, వామపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ పనిముట్లతో మహిళా సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు. ఆల్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరల చట్టం, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకుండా కేంద్రం నల్ల చట్టాలు తెచ్చింది. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 62 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతాంగానికి మద్దతుగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. కేంద్రం మెడలు వంచైనా.. చట్టాలు రద్దు చేసేవరకు పోరాడతాం. చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాము' అని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు. 

తెలంగాణలో..
తెలంగాణలో భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనగా.. మంత్రి తలసాని సికింద్రాబాద్‌లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ.. 'దేశానికి రైతు వెన్నెముక. ప్రస్తుతం రైతులు దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టాలతో రైతుల నడ్డి విరుగుతుంది. రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే. కొంత మంది మూర్కులు అనవసరంగా మాట్లాడుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం మాట్లాడుతున్నారు.

చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం
రైతుల నిరసన చేస్తుంటే రాజకీయ పార్టీలపై నెడుతున్నారు. వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలి. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా. రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టదా. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతాంగం కోలుకుంటోంది. ఎవర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలు. పంజాబ్, హరియాణలో నిరసనలు ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి భయపడుతోందని అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు, ఎన్నికలు మేం ఎన్ని చూడలేదు. అధికారం శాశ్వతం కాదు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుంది. ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలి' అని మంత్రి తలసాని కోరారు.



కరీంనగర్‌లో స్వల్ప ఉద్రిక్తత
భారత్ బంద్ సందర్భంగా కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంద్‌లో భాగంగా బస్ స్టేషన్ వద్ద వామపక్షాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి ధర్నా చేస్తుండగా అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు దారితీసింది. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రూప్ సింగ్ ఆధ్వర్యంలో కొందరు విపక్ష పార్టీల ధర్నా వద్దకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు ఇరువర్గాల మధ్య నిలిచి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఆ తరువాత వేరువేరుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు.

భారత్‌ బంద్‌కు ఆస్ట్రేలియాలోని తెలుగువారి మద్దతు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని, ఈ చట్టాల ద్వారా కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకు కేంద్రం ఆరాటపడుతున్నట్టు ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు సంఘాల భారత్ బంద్ పిలుపులో బాగంగా మహబూబ్ నగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతు ప్రయోజనాల కోసం వారితో కలిసి పోరాడుతామని, కేంద్రం తన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలవాల్సిన భాద్యత అందరిపైనా ఉందని.. కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతోందని మంత్రి పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో..
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా విద్యా, వ్యాపార సముదాయాలు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. 

నిర్మానుష్యంగా జేబీఎస్‌ బస్టాండ్‌
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ చేపట్టారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్, జేబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్, పికెట్ డిపోలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జేబీఎస్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది. జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


వరంగల్  జిల్లాలో
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి వరంగల్  జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఎక్కడికక్కడ అన్ని బంద్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా  ఆర్టీసీ బస్సు సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో 950 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయాన్నే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్‌ను నిర్వహిస్తున్నారు.

జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మడికొండ వద్ద తమ నిరసన తెలుపనున్నారు. అలాగే ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఘనపూర్‌లో ఎమ్మెల్యే నరేందర్  నాయుడు పెట్రోల్ బంక్‌ వద్ద తమ ధర్నా కొనసాగించనున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందగా బంద్ పాటిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బందులో భాగంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించి పోయింది.

హుస్నాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని చెప్పారు. పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్న ఈ చట్టం తేనె పూసిన కత్తిలాంటిదని విమర్శించారు. ప్రస్తుతం రైతు పండించిన పంట మార్కెట్‌ యార్డులో అమ్ముకొని మద్దతు ధర పొందేవారని తెలిపారు. అయితే.. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అమ్మితే జవాబుదారీ ఎవరుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరుకులు స్టాక్‌ పెట్టుకోవడానికి వీలు లేకుండా చట్టం ఉండేదని, కొత్త చట్టం ద్వారా బడా వ్యాపారులు నిత్యావసర వస్తువులను స్టాక్‌ పెట్టుకునేలా వారికి లాభం చేకూర్చేలా ఉందన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు బ్రిటన్‌ ప్రధానితో పాటు అమెరికా వీధుల్లో తెలుగు ప్రజలు మద్దతు తెలుపుతుంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.


లెవీ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలి 
సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లేవీ సేకరణ చట్టాన్ని రద్దు చేసేలా చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రమైనా కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధర పెట్టినా లెవీ సేకరణ నిలిపివేస్తామని కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. చట్టాలు తెచ్చేది మీరే, ధరలు పెంచుతూ ధర్నాలు చేసేది మీరే అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇలా రైతుల కోసం ఏటా రూ.50 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే, సన్నరకం ధాన్యానికి ఇంకో రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేమా అని ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రంపచోడవరంలోని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి నాయకులు రోడ్లపైకి చేరి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ బంద్‌ను పాటిస్తున్నారు. బంద్‌కు మద్దతుగా రంపచోడవరంలో దుకాణాలు, వ్యాపార సముదాయాల స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

బండెనక బండి.. రైతన్నకు మద్దతు దండి
►భారత్‌బంద్‌కు మద్దతుగా రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల ర్యాలీ
హన్మకొండ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హన్మకొండలో ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వరకు చేపట్టిన ఈ ర్యాలీని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రారంభించి మాట్లాడారు. రైతాంగమంతా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు.

కర్నూలు జిల్లాలో..
నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరణ చేసుకొని కర్నూలులో వామపక్షాలు పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్‌కు స్వచ్చందంగా మూసివేశారు. ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నారు. కర్నూలులో ప్రధాన కూడళ్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. విద్యా, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూసివేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పలాసలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముఖ్య కూడళ్లు, టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను మోహరించారు.

గ్రేటర్ విశాఖ పరిధిలో..
అన్నదాతలకు మద్దతుగా గ్రేటర్ విశాఖ పరిధిలో బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది. నగరంలోని ద్వారక బస్ స్టేషన్‌కే ఆర్టీసీ బస్సులు పరిమితం అయ్యాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేసి స్వచ్చందంగా  మూసివేసి మద్దతుగా నిలిచారు. వామపక్ష పార్టీలు నేతల నిరసన ర్యాలీ చేపట్టారు. అందులో భాగంగా మద్దిలపాలెం జంక్షన్‌లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేశారు. సీపీఐ, సీపీఎంతో పాటు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన ఈ బందుకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలికింది. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో...
నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్‌లో వేకువజామునే సీపీఐ, సీపీఎం నాయకులు కార్యకర్తలు బస్ స్టేషన్ వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ముందు బస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. గోదావరిఖని బస్ డిపో ముందు బైఠాయించి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆందోళనలో పాల్గొన్నారు. మంథనిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపారస్తులు, కూరగాయల మార్కెట్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.



సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా బంద్‌ జరుగుతోంది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు బంద్‌ పాటిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్‌ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులు చాలా చోట్ల డిపోలకు పరిమితమయ్యాయి. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement