నేడే భారత్‌ బంద్‌ | Bharat Bandh: Find out the timings and what is closed | Sakshi
Sakshi News home page

నేడే భారత్‌ బంద్‌

Published Mon, Sep 27 2021 2:45 AM | Last Updated on Mon, Sep 27 2021 11:39 AM

Bharat Bandh: Find out the timings and what is closed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారత్‌ బంద్‌ జరగనుంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆందోళనను రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్‌(న్యూడెమొక్రసీ), లిబరేషన్, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు ప్రజా సంఘాలు ఈ బంద్‌లో పాల్గొననున్నాయి.

సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ను విజయవంతం చేసేలా ఆయా పార్టీలు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజాసంఘాలు, పార్టీల అనుబంధ సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాయి. రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని ఇప్పటికే పలు పార్టీలు కోరాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని, ప్రజల కోసం జరుగుతున్న ఈ బంద్‌లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశాయి.  

బంద్‌లో పాల్గొనే ముఖ్యనేతలు... 
వరంగల్‌ హైవేపై బోడుప్పల్‌ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. 
హయత్‌నగర్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, మల్‌రెడ్డి రంగారెడ్డి. 
బెంగళూర్‌ హైవేపై శంషాబాద్‌ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి. 
బెంగళూర్‌ హైవేపై పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌. 
బెంగళూర్‌ హైవేపై పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి. 
శ్రీశైలం హైవేపై తుక్కుగూడ వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి. 

కాంగ్రెస్‌ శాసనసభ్యుల నిరసన... 
బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ శాసనసభ్యులు అసెంబ్లీ వరకు నిరసనగా రానున్నారు. ట్యాంక్‌బండ్‌ దగ్గరున్న అంబేద్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండ్లపై వచ్చి శాసనసభ సమావేశాల్లో పాల్గొననున్నారు. పెట్రో ధరలు, నిత్యావస సరుకుల ధరల పెంపుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైకిల్‌పై అసెంబ్లీకి రానున్నారు.  

బంద్‌ను విజయవంతం చేయాలి.. 
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తోన్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి. ఈ బంద్‌లో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజలను భాగస్వాములను చేసి ఆందోళనను సక్సెస్‌ చేయాలి. కాంగ్రెస్‌కు చెందిన డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. అలాగే ఈనెల 30న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి’. 
– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌     

నేడు బస్సులు యథాతథం...
రాష్ట్రంలో సోమవారం బస్సులు య«థావిధిగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులంతా విధులకు హాజరవుతారని, సాధారణ రోజుల్లో తరహాలోనే ఆర్టీసీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సుల వేళలను మాత్రం మార్పు చేశారు. ఏపీకి వెళ్లే బస్సులను ఆదివారం సాయంత్రం ఏడు తర్వాత నిలిపేశారు. అయితే 10 ఆర్టీసీ సంఘాలతో కూడిన జేఏసీ మాత్రం సమ్మెకు మద్దతు ప్రకటించింది. అయితే బస్సులను ఆపబోమని, విధులకు హాజరవుతామని జేఏసీ నేత వీఎస్‌రావు, రాజిరెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement