
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 26న రైతు సంఘాలు, విశాఖ ఉక్కు కార్మికులు తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్‌సీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇటు రైతులు, అటు కార్మికుల ఆందోళనకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్‌కు వ్యాపార, కార్మిక సంఘాలు, లారీ, గూడ్స్ వాహనాల యాజమానులు, వివిధ వర్గాలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించాయన్నారు. అలాగే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు కేంద్రానికి తమ నిరసనను తెలియజేసినప్పటికీ విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తామని కేంద్రం ప్రకటించిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. విశాఖ ఉక్కు కార్మికులు కూడా అదేరోజు తలపెట్టిన భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్ని నాని చెప్పారు. ఆ రోజు అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కాగా, ఆ రోజు మ.ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
టీడీపీ నేతలు ఇసుకను దోచేశారు
ఇదిలా ఉంటే.. దండుపాళ్యం బ్యాచ్‌లా టీడీపీ నేతలు ఐదేళ్ల పాటు వందల కోట్లు విలువచేసే ఇసుకను దోచుకుతిన్నారని మంత్రి నాని మండిపడ్డారు. అప్పట్లో ఇసుక రీచ్‌లను టీడీపీకి చెందిన దళారులు, నేతల చేతుల్లో పెట్టి, పేద వారిని కనీసం వాటి దగ్గరకు కూడా రానివ్వకుండా దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని ఘాటుగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment