విశాఖ మద్దిలపాలెం జంక్షన్‌లో మానవహారం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు కార్మిక వర్గం కదం తొక్కింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రయత్నాలు విరమించుకోవాలని, ఉక్కు పరిశ్రమ సొంతంగా నిలదొక్కుకుని లాభాల బాటలో పయనించేలా చూడాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ స్టీల్‌ప్లాంట్ కార్మికులను కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికి అండగా నిలవడంపై కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. బంద్‌కు బీజేపీ పూర్తిగా దూరంగా ఉండగా.. జనసేన విశాఖలో మాత్రమే మద్దతు పలికి రాష్ట్రవ్యాప్తంగా దూరంగా ఉండటం గమనార్హం. బంద్‌లో వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలతోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్తక, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విశాఖలోని మద్దెలపాలెం జంక్షన్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పాల్గొని బంద్‌కు సంఘీభావం తెలిపారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాలకు సంధానకర్తగా వ్యవహరించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు ఎం.రాజశేఖర్, వై.మస్తానప్ప, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విశాఖలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
అన్నివర్గాల సంఘీభావం
రాష్ట్రవ్యాప్త బంద్‌కు అన్ని వర్గాలు సంఘీభావంగా నిలిచాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డెక్క లేదు. డిపోల నుంచి బస్సులు బయటకు తీయబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకటించాయి. బంద్‌లో వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు సైతం బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు
ఆర్టీసీలో మొత్తం 10,057 బస్సులు ఉండగా.. 8,619 బస్సులు డిపోల నుంచి కదల్లేదు. హైకోర్టు, సచివాలయాలకు వెళ్లే వారికి మాత్రం ఇబ్బందుల్లేకుండా బస్సుల్ని తిప్పారు. మధ్యాహ్నం వరకు బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీకీ రూ.8 కోట్ల నష్టం వాటిల్లింది. దూర ప్రాంత సర్వీసులను మధ్యాహ్నం నుంచి కొనసాగించారు. బంద్‌కు మద్దతు పలికిన లారీ యాజమానుల సంఘం ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో లారీ యజమానుల సంఘం రాష్ట్ర నాయకులు వైవీ ఈశ్వరరావు, గోపిశెట్టి వీర వెంకయ్య పాల్గొన్నారు.
కడపలో వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్టు పార్టీల నిరసన
ఉద్యమానికి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మద్దతు పలికింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడలో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. బంద్ కారణంగా కాకినాడ జేఎన్‌టీయూలో పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ సీపోర్ట్‌లో కార్మికులు బంద్ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతపురంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంద్‌కు అమరావతి సచివాలయ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. బంద్‌కు జర్నలిస్టు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment