బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు(ఫైల్)
శ్రీకాకుళం , భామిని: మావోయిస్టుల బంద్‌కు పిలుపునివ్వడంతో మన్యంలో మరోసారి తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ బుధవారం ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లాలో ప్రైవేటు బస్సును దహనం చేయడంతో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గిరిజన ప్రాంతాలకు నడిచే రాత్రి బస్సులను సరిహద్దు పోలీస్ స్టేషన్లు వద్ద నిలిపివేస్తోంది. ఇప్పటికే సరిహద్దులో కీలకమైన తివ్వాకొండల పరిసరాల్లో ప్రత్యేక సాయుధ దళాలు ముమ్మర కూంబింగ్ చేపడుతున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పూట వాహన తనిఖీలు చేస్తున్నాయి.
నిరసన వారోత్సవాల నేపథ్యంలో..
సమాధాన్ పథకం పేరున మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టి, గిరిజన హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహిస్తూ ఈ నెల 25 నుంచి మన్యంలో నిరసన వారోత్సవం చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం మన్యం బంద్‌కు ప్రత్యేకంగా పిలుపు నివ్వడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఏవోబీలో మావోల కదలికలు తీవ్రం కావడంతో పోలీసులు అప్రమత్తం చర్యలు చేపట్టారు.
జిల్లా కేంద్రానికి అధికార పార్టీ నాయకులు..
మావోల హిట్‌లిస్టులో ఉన్న టీడీపీ నాయకులను స్వగ్రామాల్లో ఉండనీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే హెచ్చరికలు చేసిన పోలీసులు అధికార పార్టీ కార్యక్రమం పేరున సురక్షితంగా తీసుకెళ్లారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment