అప్పుడే ‘కట్’కట..! | Again power cut problems | Sakshi
Sakshi News home page

అప్పుడే ‘కట్’కట..!

Published Sat, Mar 1 2014 4:00 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

Again power cut problems

సాక్షి, మహబూబ్‌నగర్: కరంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఎండ కాలం ప్రారంభలోనే అధికారిక, అనధికారిక  కరంటు కోతలుఇలా ఉంటే ...రానున్న మూడు నెలల పరిస్థితిని తలచుకుంటే... ఎలా ఉంటుందోనన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.విద్యుత్తుపై ఆధారంతో చిన్న,మధ్యతరహా పరిశ్రమలను నడిపిస్తున్న  యాజమాన్యాలతో  సహా రబీలో పంట సాగు చేసిన రైతులు కరెంటు కటకటతో తమ పరిస్థితి ఏమవుతుందోనని ఆవేదన చెందుతున్నారు.
 
  జిల్లా  వ్యాప్తంగా 8,56,836 విద్యుత్తు కనెక్షన్లు ఉండగా... ఇందులో గృహాలకు సంబంధించినవి  5,96,836 ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లు 61,597 ఉండగా, వ్యవసాయానికి 1,98,405 కనెక్షన్లున్నాయి. వీటికి ప్రతీ రోజు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉండగా ప్రస్తుతం మాత్రం 13 నుంచి 15 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే సరఫరా చేస్తున్నారు. అందువల్ల కోతలు తప్పటం లేదని అధికారులు చెప్తున్నారు.
 అనధికారంగానే...
 విద్యుత్తు శాఖ అధికారికంగా ప్రతి రోజు గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, మున్సిపాలిటిల్లో 6గంటలు,జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో 4 గంటలు కరంటు కోత విధించింది. ఈ కోతలను రెండు విడుతలుగా జిల్లాలో అమలు చేస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు అంటున్నా ...అనధికారికంగా మరో రెండు గంటలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.
 
 
 ఈ లెక్కన జిల్లాలోని 1319 గ్రామ పంచాయతీల పరిధిలోని 3342 అవాసాల్లో ప్రతీ రోజు రెండు విడతలుగా  14 గంటలు కరంటు కోత ఉంటోంది. అదేవిధంగా నారాయణపేట్, గద్వాల, వనపర్తి మున్సిపాలిటిల్లో 8 గంటలు,మండల కేంద్రాల్లో 10 గంటలు కరంటు కోత ఉంటుంది.మహబూబ్‌నగర్‌లో కూడా ఇదే పరిస్థితి దాపురించింది. దీంతో ప్రజలు బుగ్గ వెలుగుతే చాలంటున్నారు.ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతుండటంతో  ఇబ్బందులు పెరుగుతున్నాయి. పైగా విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
 
 రబీపై ఆశలు వదులుకోవాల్సిందేనా...
  రైతుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది.వ్యవసాయానికి ఏడుగంటల  సరఫరా మాట దేవుడెరుగు  నాలుగు గంటలు కూడా రావడం లేదు.గ్రామాల్లో 14 గంటలు విద్యుత్తు కోత ఉండటం వల్ల ఉదయం 2 నుంచి 3 గంటలు, రాత్రి ఒక గంట కరెంటు రావటం కష్టంగా ఉందని రైతులు మండిపడుతున్నారు.   
 
 జిల్లాలో ఈ రబీ సీజన్‌లో  పంట సాగు సాధారణ విస్తీర్ణం 1,99,037 హెక్టార్లు కాగా...రైతులు మాత్రం సాధారణం కంటే ఎక్కువగా 2.42,969 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసుకున్నారు. వరి నాట్లతో పాటు వివిధ పంటలు సాగు కావటంతో ఎదుగుదల కోసం నీటి వినియోగం  తప్పని సరికావడంతో  కరంటు కోసం  రైతులు ఎదురు  చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 48,174 హెక్టార్లు కాగా...ప్రస్తుతం ఆ సాగు 80,105 హెక్టార్లకు పెరిగింది.
 
 పల్లీ సాగు కూడా 89,489 హెక్టార్లు ఉండగా నేడది 1,05,499 హెక్లార్లకు పెరిగింది.మొక్కజొన్న పంట సాగు 3,869 హెక్టార్ల నుంచి 4,200 హెక్టార్లకు పెరిగింది. పొద్దు తిరుగుడు పంట 2,172,చెరుకు 1495, ఉల్లిగడ్డ 1168, జోన్న పంట 8,450 హెక్టార్లలో రైతులు సాగు చేశారు.పెరిగిన పంట సాగు విస్తీర్ణాన్ని అనుసరించి  నీటి ఉపయోగం బాగా పెరిగింది. పైగా విద్యుత్తు కనెక్షన్ల ఆధారంగానే పంటలు సాగు చేయటం వల్ల కరెంటు అవసరం తప్పనిసరిగా మారింది . మరొక పక్క సర్కారు విధిస్తున్న అప్రకటిత కరంటు కోతలు రైతుకు రబీపై ఆందోళన రేకెత్తిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement