సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఏ, డీఏల చెల్లింపులను నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. గతంలో పోలింగ్ ముగిసిన తరువాత పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బందికి భత్యాన్ని నగదు రూపంలో చెల్లించే వారు. నగదు రూపంలో చెల్లింపులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన ఎన్నికల కమిషన్.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ముందస్తు శాసనసభ ఎన్నికలలో భాగంగా డిసెంబర్ 7న జరుగనున్న పోలింగ్ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది తమ బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను అందించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించే ఉద్యోగుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే, ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ అధికారి (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారి(ఏపీవో)లకు శిక్షణ ఇస్తున్నారు. దశల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కొనసాగించనున్నారు. సిబ్బంది పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పోలింగ్ రోజున విధులు నిర్వహించి, ఓటింగ్ యంత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. గతంలో ఎన్నికలు ముగిసిన తరువాత రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి టీఏ, డీఏలను చెల్లించే వారు.
అయితే, కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు, ఇతర ఉద్యోగులు పోలింగ్ సిబ్బందికి సక్రమంగా భత్యం పంపిణీ చేయలేరనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక భత్యం చెల్లింపునకు ఎక్కువ సమయం పట్టడంతో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఇబ్బంది పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది టీఏ, డీఏలను బ్యాంకు ఖాతాల్లో ఆన్‌లైన్ ద్వారానే జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పోలింగ్ విధులకు ఎంపికైన ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను రిటర్నింగ్ అధికారులకు అందించాలని సూచించడంతో ఉద్యోగులు తమ వివరాలతో పాటు బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment