సాక్షి, నిజామాబాద్ : మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీలో సరికొత్త సమీకరణలకు దారితీసింది. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ క్యాడర్‌లో సంతోష్‌రెడ్డి రాకతో మూడో గ్రూపు కూడా తయారవుతోంది. ఈ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి వర్గీయులకు, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఈరవత్రి అనిల్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పలు మండలాల్లో అభివృద్ధి పనుల విషయంలో గతంలో ఇరు వర్గీయులు బహిరంగంగానే గొడవలకు దిగిన సందర్భాలున్నాయి. ఈ పోరు తారాస్థాయికి చేరడంతో ఇరువర్గాల నేతలు ఓ ఒప్పందానికి వచ్చారు. తాజాగా ఇప్పుడు సంతోష్‌రెడ్డి కూడా పార్టీలో చేరడంతో మరో పవర్ పాయింట్ ఏర్పడినట్లయ్యింది.
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న సంతోష్‌రెడ్డి ఆయన ఆశీస్సులతో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. స్పష్టమైన హామీతోనే సంతోష్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడైన వాసుబాబును బరిలోకి దించాలనే యోచనలో సంతోష్‌రెడ్డి ఉన్నా రు. ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. గ్రామాల్లో తిరుగుతూ తన అనుచరులను కలుస్తున్నారు. ఇటీవల వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇలా నియోజకవర్గం తెరపైకి మూడో నేత కూడా రావడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
ఏ నేత వైపు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు విజయోత్సవ సభలు, జైత్రయాత్రల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, బాల్కొండల్లో నేతలు విజయోత్సవ సభలను నిర్వహించారు. తాజాగా బోధన్‌లో తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల బహిరంగసభ కూడా జరిగింది. ఆయా నియోజకవర్గ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభలు, సమావేశాలను నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం ఇంకా తెలంగాణ విజయోత్సవ సభ జరగలేదు.
ఇక్కడ ఎవరు ఈ సభను నిర్వహిస్తారనే విషయంపై సైతం చర్చ మొదలైంది. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ రెండు నెలల క్రితమే ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా.. విలీనమైనా.. ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న సురేశ్‌రెడ్డి కూడా బాల్కొండ వైపు దృష్టిసారించాల్సిన పరిస్థితి అనివార్యం కానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇక్కడ మూడు ముక్కలాట ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మూడు ముక్కలాట!
Published Fri, Oct 25 2013 3:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement