కలెక్టర్ రామ్మోహన్‌రావుకు విన్నవిస్తున్న వేంపల్లి రైతులు(ఫైల్), ఎంపీ అరవింద్‌కు విన్నవిస్తున్న రైతులు(ఫైల్)
సాక్షి, బాల్కొండ: గ్రీన్ హైవే నిర్మాణ ప్రతిపాదన రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పచ్చని పొలాల్లోంచి జాతీయ రహదారి వెళ్తుందన్న వార్త అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో గల 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల జిల్లా మీదుగా జగదల్‌పూర్ వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి గత నెలలో సర్వే కూడా చేపట్టారు. పక్కన గల జగిత్యాల జిల్లాలో సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులకు గ్రీన్ హైవే గుబులు పట్టుకుంది. జిల్లాలోని ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల పరిధిలోని విలువైన భూముల్లోంచి ఈ గ్రీన్ హైవే వెళ్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
63వ జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్రం భావించింది. అయితే, ఈ రోడ్డు విస్తరణలో భాగంగా భారీగా భవన నిర్మాణాలను పడగొట్టాల్సి వస్తుండడం, ఇందుకు భారీగా నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉండడంతో కేంద్రం ప్రత్యామ్నయంగా గ్రీన్ హైవేకు రూపకల్పన చేసింది. ఇళ్లను తొలగించకుండా పంట భూముల మీదుగానే రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదన సిద్ధం చేసింది. నాలుగు లేన్ల రోడ్డు నిర్మించనుండడంతో ఎకరం, రెండేకరాల భూమి ఉన్న రైతులు పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాము ఉపాధిని కోల్పోతామని చిన్న, సన్నకారు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ముప్కాల్ మండల పరిధిలోని రైతులు గత వారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో పాటు కలెక్టర్ రామ్మోహన్‌రావును కలిసి గ్రీన్ హైవే నిర్మాణం నిలిపి వేయాలని విన్నవించారు.
విలువైన భూములు..
ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల పరిధిలో భూముల విలువ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పలుకుతోంది. 44వ జాతీయ రహదారి పక్కన భూములైతే రూ.అర కోటికి పైగానే ధరలున్నాయి. గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే తమకు ప్రభుత్వం అంత ధర చెల్లించే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకునే భూములు కోల్పోవడంతో ఉపాధి కోల్పోతామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునారాలోచన చేసి గ్రీన్ హైవే నిర్మాణం విరమించు కోవాలని కోరుతున్నారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటమంటూ రైతులు హెచ్చరిస్తున్నారు.
వేంపల్లి రైతులకు తీవ్ర నష్టం..
గ్రీన్ హైవే నిర్మాణం జరిగితే వేంపల్లి రైతులకు మరోమారు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే వేంపల్లి రైతులు తమ విలువైన భూములను వరద కాలువతో పాటు 44వ జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్ హైవే నిర్మాణం కోసం భూమి కోల్పోతే అసలు సాగు చేసుకోవడానికే భూమి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే లక్ష్మి కాలువ డీ–3పై నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి రైతులు భూమిని కోల్పోయారు. గతంలో నిర్మించిన నవాబు కాలువ, నిజాంసాగర్ కాలువలు కూడా వీరి భూముల నుంచే పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment