దోన్‌పాల్‌లోని పోలింగ్ బూత్ వద్ద నిర్మించిన ర్యాంప్
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల కోసం పోలింగ్ బూత్‌లలో సౌకర్యాలను కల్పించడానికి రెవెన్యూ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. పోలింగ్ బూత్‌లుగా పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గతంలోనే గుర్తించారు. అయితే వాటిల్లో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయో లేవో అని పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు సౌకర్యాలు లేని చోట పునరుద్దరణ పనులు చేపట్టారు. పోలింగ్ బూత్‌లలో విద్యుత్ సౌకర్యం లేక పోతే ఏర్పాటు చేయడం, వికలాంగుల కోసం ర్యాంపుల నిర్మాణం, పోలింగ్ సిబ్బందికి బాత్‌రూం సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అంతలోపు పోలింగ్ బూత్‌లను అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకరావాలని ఎన్నికల కమీషన్ ఆదేశించడంతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ కనెక్షన్ లేకుంటే అత్యవసరంగా విద్యుత్ కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి విద్యుత్ సంస్థ అధికారులను ఆదేశించారు.
పోలింగ్ బూత్‌లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్‌లు పరిశీలిస్తు సౌకర్యాలు లేని వాటిల్లో పునరుద్దరణ పనులు చేపట్టడానికి ఆదేశాలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో 239 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఆర్మూర్ నియోజకవర్గంలో 211 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. బోధన్‌లో 239, నిజామాబాద్ అర్బన్‌లో 218, నిజామాబాద్ రూరల్ పరిధిలో 272, బాన్సువాడ నియోజకవర్గంలో 223 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మొత్తం 1,402 పోలింగ్ బూత్‌లు ఉండగా అన్ని బూత్‌లలో విద్యుత్, ర్యాంపులు, బాత్‌రూం తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలింగ్ రోజున ఓటర్లు, సిబ్బంది కోసం తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. పోలింగ్ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందు నుంచి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సౌకర్యాల కల్పనపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment