లింబాద్రి గుట్టపై స్వామివారి దర్శనం చేసుకుని వస్తున్న ప్రశాంత్‌రెడ్డి దంపతులు
సాక్షి,భీమ్‌గల్(నిజామాబాద్): బాల్కొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు భీమ్‌గల్‌కు చేరుకున్న ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టకు చేరుకుని నరసింహ స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన భీమ్‌గల్‌లోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 200 మీటర్ల దూరంలో వాహనం దిగి సతీమణి నీరజారెడ్డి, ఎంపీపీ కొండ గోదావరి, డాక్టర్ మధుశేఖర్, పెర్కిట్‌కు చెందిన బంధువుతో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 12.45 గంటలకు రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈవో వేణుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసి వచ్చిన అనంతరం నాయకులు, కార్యకర్తలు ప్రశాంత్‌రెడ్డిని పూలమాలలతో అభినందించారు. అనంతరం ఆయన స్థానిక చర్చిలో ప్రార్థనలు జరిపి దైవజనుల ఆశీస్సులు తీసుకున్నారు.
అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తా : బిగాల గణేషగుప్తా
సాక్షి,చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్): నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ అనుబంధ అభ్యర్థిగా బిగాల కృష్ణమూర్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గణేశ్‌గుప్తా విలేకరులతో మాట్లాడుతూ.. 2014లో తనపై అపారమైన విశ్వాసం ఉంచి నగర ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. రూ. 950 కోట్లతో ఇందూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ కవితతో కలిసి గుప్తా గురువారం మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలుదాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment