పొంగిపొర్లుతున్న గోదారి
రెంజల్/బాల్కొండ/నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లతో పాటు ఎగువన మహారాష్ట్రలో గల విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ఆదివారం వేకువ జామునుంచి గోదావరి నది పొంగిపొర్లుతోంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మంజీర, హరిద్ర, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనకు ఆనుకుని రోడ్డు పై నుంచి వరద నీరు ప్రవహించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు స్పందించి గోదావరి పరవళ్లను పరిశీలించేందుకు వచ్చే సందర్శకులను గ్రామసరిహద్దులోనే నిలిపివేస్తున్నారు.
నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కందకుర్తిలో వేలాది ఎకరాల పంటలు పూర్తిగా నీటమునిగాయి. మంజీర, హరిద్ర నదుల పరీవాహకం వెంట వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి శనివారం అర్ధరాత్రి నుంచి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ 42 వర ద గేట్లను ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.