
సందీప్ పూజ మృతదేహాలు, (ఇన్‌సెట్లో)చనిపోయిన చిన్నారి సహన
కమ్మర్‌పల్లి(బాల్కొండ) : కూతురి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. రెండు నెలల కిత్రం అనారోగ్యంతో చిన్నారి కూతురు మృతి చెందడంతో దంపతులిద్దరు తీవ్ర మనస్థాపం చెందారు. అప్పటి నుంచి కూతురును పదేపదే తలచుకుంటూ నీవు లేక సమాజంలో బతకలేకపోతున్నాం.. అంటూ డైరీలో రాసి శనివారం ఉదయం గరిపె సందీప్(30), పూజ(26) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన గరిపె సందీప్, పూజ దంపతుల కూతురు సహన(5) అనారోగ్యంతో రెండు నెలల కిత్రం మరణించింది. దీంతో దంపతులిద్దరూ డిప్రెషన్‌లోకి వెళ్లారు. కూతురుని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి వెళ్లి పడుకోవడం, కూర్చోవడం, ఏడ్వడం చేశారు. గ్రామస్తులు, సన్నిహితులు వారిని ఇంటికి తీసుకువచ్చి సముదాయించారు.
కూతురును తలచుకుంటూ పదేపదే ఏడుస్తూ తీవ్ర మనస్తాపం చెందిన దంపతులిద్దరూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులకు తల్లి సత్తెమ్మ, తండ్రి బాలయ్య, రెండు నెలల కొడుకు మణిదీప్ ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మురళి సంఘ టన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆకలైతే అన్నం తింటున్నం.. మనసునైతే పడతలేదు
ఆకలైతే అన్నం తింటున్నం, కానీ మనసునైతే పడతలేదని దంపతులిద్దరు డైరీలో రాసుకున్నారు. డైరీలో పాపపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. నీవు లేని ఈ సమాజంలో మేమేందుకుండాలి.. చనిపోవాలనుకుంటున్నాం అని రాశారు. కూతురును మరిచిపోలేకపోతున్నాం.. చనిపోతున్నాం అని రాసుకున్నారు.

తల్లిదండ్రులను కోల్పోయిన మణిదీప్
Comments
Please login to add a commentAdd a comment