Kammarpally
-
Photo Feature: ‘ఉపాధి’కి రండి..
కమ్మర్పల్లి (నిజామాబాద్): మండలంలోని హాసాకొత్తూర్‌లో శనివారం పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు రావాలని కోరుతూ గ్రామంలో ఇంటింటా బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఏనుగు పద్మ, ఉపాధి హామీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కూలీలకు బొట్టు పెట్టి ఉపాధి హామీ పనులకు రావాలని ఆహ్వానించారు. ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, జీపీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, సిబ్బంది రమణ, వార్డు సభ్యులు కుందేటి పుష్ప, మేట్లు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..
సాక్షి, నిజామాబాద్(కమ్మర్పల్లి): ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ యువకుడు నాలుగేళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులతో మనసారా ముచ్చటించకుండానే మృత్యు ఒడికి చేరాడు. కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామానికి చెందిన యాట రాజేశ్ (35)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ బాట పట్టాడు. చదవండి: (విధి వక్రించి భర్త, తండ్రి మృతి.. చంటితో సహజీవనం.. అంతలోనే..) సౌదీ అరేబియా వెళ్లిన అతడు నాలుగేళ్ల తర్వాత గత నెల 27న అర్ధరాత్రి 12 గంటలకు స్వగ్రామం కోనాసముందర్‌కు వచ్చాడు. తర్వాతి రోజు (ఆదివారం) ఉదయం నుంచి కుటుంబ సభ్యులతో గడిపిన రాజేశ్ సాయంత్రం వేళ బైక్‌పై బయటకు వెళ్లాడు. నర్సాపూర్ వెళ్లే మార్గంలో రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపై కప్పిన తాటిపత్రాలు లేవకుండా బండరాయి పెట్టారు. అయితే, చీకట్లో బండరాయి కనిపించక పోవడంతో దాన్ని ఢీకొని రాజేశ్ రోడ్డుపై ఎగిరి పడ్డాడు. చదవండి: (టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..) తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబ సభ్యులు భీమ్‌గల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందాడు. నాలుగేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రాజేశ్ తమతో మనసారా మాట్లాడకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డుపై వడ్లు ఆరబోసి ప్రమాదానికి కారణమైన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
మృతదేహం మాయం: టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి
సాక్షి, కమ్మర్పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌లో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురవడం, అనుమానితుడి ఇంటిని వందలాది మంది ముట్టడించడం, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హాసాకొత్తూర్ మారుతినగర్లో నివాసముండే మాలవత్ శ్రీనివాస్, సరోజ దంపతులకు ఇద్దరు కుమారులు కృష్ణ, సిద్ధార్థ (17) ఉన్నారు. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ అచేతన స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. సరోజ వ్యవసాయ కూలీ కాగా, పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు. చిన్న కొడుకు సిద్ధార్థ హార్వెస్టర్ క్లీనర్‌గా కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కరోనాతో చనిపోయాడని.. బుధవారం రాత్రి సిద్ధార్థను అతని స్నేహితుడు నరేందర్ వచ్చి మెదక్ వెళ్లాల్సి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో సిద్ధార్థకు వరసకు మామ అయిన వసంత్, అన్న కృష్ణకు ఫోన్ చేసి సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కనక రాజేశ్ చెప్పాడు. అంత్యక్రియల నిమిత్తం గండి హన్మాన్ ప్రాంతానికి రమ్మని తెలిపాడు. దీంతో కృష్ణ, వసంత్‌తో పాటు రవి, స్వామి అక్కడకు వెళ్లగా, ఎవరు లేరు. మరోవైపు, సిద్ధార్థ గురించి నరేందర్‌ను అడిగితే రాత్రి భోజనం చేశామని, కొద్దిసేపటికి సిద్ధార్థకు ఫోన్ రాగా బయటకు వెళ్లాడని తెలిపాడు. మరోవైపు, గండి హన్మాన్ వద్ద మృతదేహం ఉందని చెప్పినప్పటికీ అక్కడ లేకపోవడం, ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీ గదిలో మృతదేహం తేలడం అంతా సినీ ఫక్కీలో జరిగి పోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగా, వారు మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై, తలపై కమిలి పోయిన గాయాలు కనిపించాయి. కట్టెలతో కొట్టి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. ఇంటిపై దాడికి యత్నం.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కనక రాజేశ్, అతని అనుచరులు కలిసి 15 రోజుల క్రితమే కృష్ణ, సిద్ధార్థను చంపేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థను కనక రాజేశ్, అతని అనుచరులు బాలాగౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్ తదితరులు కలిసి చంపేశారని వాపోయారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు రాజేశ్ ఇంటిని ముట్టడించారు. నిందితుడి ఇంటిపై దాడికి యత్నించగా, పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. గంట గంటకు పరిస్థితులు మారి పోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను దింపారు. ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలుమార్లు ఆందోళనకారులను చెరదగొట్టారు. పరిస్థితులు చేయి దాటుతుండడంతో అదనపు బలగాలను పిలిపించారు. ఇటు స్థానికులు, అటు పోలీసులు.. ఆరేడు వందల మందికి పైగా అక్కడ గుమిగూడారు. సాయంత్రం వేళ నిజామాబాద్ డీసీపీలు స్వామి, శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ రఘు చేరుకొని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. బందోబస్తు నడుమ అంత్యక్రియలు.. పరిస్థితులు అదుపులోకి వచ్చాక పోలీసులు రాత్రి ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్నతాధికారుల సమక్షంలో, భారీ బందోబస్తు మధ్యే రాత్రి వేళ ఖననం చేశారు. మరోవైపు, మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. చదవండి: రైస్‌పుల్లింగ్: రాగిపాత్రకు రంగుపూసి.. -
నీవు లేని.. జీవితం మాకొద్దు
కమ్మర్పల్లి(బాల్కొండ) : కూతురి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. రెండు నెలల కిత్రం అనారోగ్యంతో చిన్నారి కూతురు మృతి చెందడంతో దంపతులిద్దరు తీవ్ర మనస్థాపం చెందారు. అప్పటి నుంచి కూతురును పదేపదే తలచుకుంటూ నీవు లేక సమాజంలో బతకలేకపోతున్నాం.. అంటూ డైరీలో రాసి శనివారం ఉదయం గరిపె సందీప్(30), పూజ(26) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన గరిపె సందీప్, పూజ దంపతుల కూతురు సహన(5) అనారోగ్యంతో రెండు నెలల కిత్రం మరణించింది. దీంతో దంపతులిద్దరూ డిప్రెషన్లోకి వెళ్లారు. కూతురుని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి వెళ్లి పడుకోవడం, కూర్చోవడం, ఏడ్వడం చేశారు. గ్రామస్తులు, సన్నిహితులు వారిని ఇంటికి తీసుకువచ్చి సముదాయించారు. కూతురును తలచుకుంటూ పదేపదే ఏడుస్తూ తీవ్ర మనస్తాపం చెందిన దంపతులిద్దరూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులకు తల్లి సత్తెమ్మ, తండ్రి బాలయ్య, రెండు నెలల కొడుకు మణిదీప్ ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మురళి సంఘ టన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆకలైతే అన్నం తింటున్నం.. మనసునైతే పడతలేదు ఆకలైతే అన్నం తింటున్నం, కానీ మనసునైతే పడతలేదని దంపతులిద్దరు డైరీలో రాసుకున్నారు. డైరీలో పాపపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. నీవు లేని ఈ సమాజంలో మేమేందుకుండాలి.. చనిపోవాలనుకుంటున్నాం అని రాశారు. కూతురును మరిచిపోలేకపోతున్నాం.. చనిపోతున్నాం అని రాసుకున్నారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కమ్మరపల్లి (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ప్రేమ వివాహం జరుగుతుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ , ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలిపివేశారు.