మండలంలోని సావెల్ గ్రామంలో అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఏడడుగులు నడిచి పదికాలల
బాల్కొండ: మండలంలోని సావెల్ గ్రామంలో అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఏడడుగులు నడిచి పదికాలల పాటు కలిసి ఉంటామని బాస చేసిన భర్త కత్తితో పొడిచి చంపేశాడు. బాల్కొండ ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సావెల్ గ్రామానికి చెందిన ఎండ్ర లీల(35)ను భర్త పిరాజీ శనివారం రాత్రి హత్య చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకారాకు చెందిన పిరాజీ, లీలా దంపతులు 8 ఏళ్ల క్రితం సావెల్ గ్రామానికి రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా లీలా ఐదు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను హాస్టల్‌లో చేర్పించడానికి వెళ్లి, శుక్రవారం ఇంటికి వచ్చింది.
రాత్రి పిరాజీ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజలు ఎక్కడికి వెళ్లావని లీలాతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో పిరాజీ లీలా తలపై పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై లీల అక్కడిక్కడే మృతి చెందింది. లీలాకు అక్రమ సంబంధం ఉందని తరుచూ గొడవ పడేవాడని లీలా కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా ఉదయం హోటల్‌లో టీ తాగి పరారయ్యాడు. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.