నాగమణి మృతదేహం,రోదిస్తున్న పిల్లలు స్రవంతి, పావని,మృతురాలి ఇంటి వద్ద గుమిగూడిన గ్రామస్తులు
ప్రకాశం ,బద్వీడు (పెద్దారవీడు): వ్యసనాలకు బానిసైన భర్త.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన మండలంలోని బద్వీడులో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగమణి (25)ని ఆమె మేనత్త కుమారుడు ప్రగళ్లపాడుకు చెందిన వెంగళయ్య వివాహం చేసుకున్నాడు. వెంగళయ్య కొంతకాలం నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను హింసిస్తున్నాడు. దంపతలు మధ్య తరుచూ ఏర్పడే వివాదాలను గ్రామస్తులు, పెద్దలు పరిష్కరించేవారు. బతకుదెరువు కోసం భార్యతో కలిసి వెంగళయ్య మార్కాపురం, త్రిపురాంతకం, గుంటూరు జిల్లా గొల్లెపల్లెలో కాపురం పెట్టాడు. అక్కడ కూడా ఇంట్లోని వస్తువులు తాకట్టు పెట్టి మద్యం తాగేవాడు. భార్యపై వేధింపులు కూడా అలాగే కొనసాగించాడు. గొల్లపల్లెలో తరుచూ దంపతులు గొడవ పడుతుండటంతో స్థానికులు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాగమణి తన తమ్ముడికి ఫోన్ చేసి తక్షణమే తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది. ఆమె తమ్ముడు వచ్చి అప్పటికే తన బావ వెంగళయ్య తాకట్టులో ఉంచిన వస్తువులకు రూ.10 వేలు కట్టి విడిపించాడు. ఆటోలో సామగ్రితో పాటు అక్క, బావతో కలిసి స్వగ్రామం బయల్దేరారు. మార్గమధ్యంలో భార్య, బావమరిది గాలెయ్యను కర్రలతో కొట్టుతుండటంతో స్థానికులు వెంగళయ్యను మందలించి వారిని లారీలో సాగనంపారు.
అంత వరకూ ఓకే..
దంపతులు బద్వీడులో అత్తగారింట్లో కాపురం ఉన్నారు. కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తరుచూ భార్యతో గొడవపడుతూ కొట్టుతున్నాడు. గొడవ ఎక్కువ చేస్తుండటంతో గురువారం అదే గ్రామంలో అద్దె ఇంట్లో సామగ్రి చేర్చారు. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమానికి ఇష్టం లేకున్నా గ్రామస్తులు నచ్చజేప్పి ఇప్పించారు. రాత్రి పిల్లలు నాగమణి తల్లి ఇంట్లో నిద్రించారు. దంపతులు మాత్రం అద్దె ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి కత్తితో నాగమణి గొంతుకోసి చంపి తలుపులు మూసి వెంగళయ్య ఎటో వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ ఇంటి నుంచి పిల్లలు తల్లిదండ్రుల కోసం వచ్చారు. ఎంతకూ తల్లి పలకకపోవడంతో పెద్దగా కేకలేశారు. ఇరుగుపొరుగు వచ్చి చూడగా నాగమణి నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉంది. మృతురాలి తల్లి రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వీఆర్వో ఏడుకొండలు ఫిర్యాదు మేరకు మార్కాపురం సీఐ భీమానాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ రమణారావు సమక్షంలో వైద్యులు పంచనామా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment