
మోర్తాడ్ (బాల్కొండ): కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి సౌదీ అరేబియాకు వెళ్లిన మోర్తాడ్ మండలం పాలెం వాసి షేక్ మదర్(50) అనారోగ్యంతో అక్కడే కన్నుమూశాడు. కరోనా వైరస్ ఉధృతితోనే విదేశాల్లో మరణించినవారి మృతదేహాలను తెప్పించడం కష్టంతోపాటు ఖర్చుతో కూడుకున్నది కావడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో సౌదీలోనే మదర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ కుటుంబ పెద్ద కడసారి చూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని మదర్ కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు)
ఎన్నో ఏళ్ల నుంచి మదర్ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల కింద ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లి అక్కడ సైకిల్ రిపేరింగ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. నెల రోజుల కిందట మదర్ అనారోగ్యానికి గురవడంతో ఈనెల 6వ తేదీన మరణించాడు. మదర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాలంటే ఎంతో ఖర్చు అవుతుందని అతడికి ఆజాద్ వీసా స్పాన్సర్ చేసిన సౌదీవాసి తెలిపాడు. మక్కా ఉన్న సౌదీలోనే మదర్ మృతదేహానికి ఖననం చేస్తే అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని పలువురు సూచించడంతో కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈనెల 25 ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు.
రావడానికి ఒక్కరోజు ముందుగానే మృతి
సౌదీలో మరణించిన మదర్ ఈ నెల 7వ తేదీన స్వదేశం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మధుమేహం, బీపీ ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడు ఇంటికి రావడానికి విమాన టికెట్‌ను తీసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఒకరోజు ముందుగానే తీవ్ర అనారోగ్యానికి గురై సౌదీలోనే మరణించడం, అక్కడే అంత్యక్రియలు ముగిసిపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మదర్‌కు భార్య, నలుగురు కొడుకులు ఉన్నారు.
చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో