స్వర్ణోత్సవ శోభ వచ్చేనా!
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పునాది రాయి పడి నేటితో 51 ఏళ్లు పూర్తికాగా, 52వ వసంతం మొదలవుతోంది. 1963 జూలై 26న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎస్సారెస్పీ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. గతేడాది 50 ఏళ్లు పూర్తయిన వేళ స్వర్ణోత్సవాల నిర్వహణ కు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డు తగి లిందని ప్రభుత్వం కుంటిసాకు చెప్పింది. అధికారులు స్వర్ణోత్సవ వేడుకలకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ మోక్షం కలగలేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ప్రాజెక్టు స్వర్ణోత్సవం జరుపుతుం దని అందరూ ఊహించారు. అయితే అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గా నీ ఎలాంటి చర్యలు చేపట్టినదాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఎస్సారెస్పీ ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. అలాంటి ప్రాజెక్ట్ పై ఇన్నాళ్లు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించారనే వచ్చిన విమర్శలు ఇక నుంచి కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎస్సారెస్పీని పట్టించుకోవాలని ఆయక ట్టు రైతులు కోరుతున్నారు. స్వర్ణోత్సవ సంబురాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
మాయని మచ్చ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 2007-2010 వరకు జరిగిన పనుల్లో అవినీతి అక్రమాల పంచాయతీ ఎడతెగకుండా సాగడం ప్రాజెక్ట్ అభివృద్ధికే ప్రతి బంధకంగా మారింది. ఎస్సారెస్పీ కాలువల గైడ్ వాల్స్, కాలువల లైనింగ్ పనులు 2007-10 వరకు మూడేళ్లలో రూ. 278 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో డివిజన్-2 నుంచి 227 పనులు, డివిజన్ -5 నుంచి 406 పనులు, డివిజన్-1 నుంచి 1247 పనులు చేపట్టారు. అయితే పనుల్లో అక్రమాలు జరిగాయంటూ,పనులు చేయకుండనే బిల్లులు ఎత్తారని అనేక ఆరోపణాలు వచ్చాయి. దీంతో తీగా లాగితే డొంక కదిలింది. ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగి ప్రాజెక్ట్ అధికారులను ఒక కుదుపు కుదిపాయి.
87 మంది ఇంజినీర్లు నోటీసులు అందుకోగా, 21 మంది ఇంజినీర్లు సస్పెండ్ అయ్యారు అయినా సమస్య తొలిగి పోలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లు రాక గుండె పోటుతో మరణించినా, ఆపనుల తాలూకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం కరుణించడంలేదు. అందుకు కారణం పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడమే! అధికారులు బంగారు గుడ్లు పెట్టే బాతుల ఎస్సారెస్పీని వాడుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వర్క్ ఆర్డర్ చేయడమంటే ప్రాజెక్ట్ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చేయని పనులకు కూడ బిల్లులు అందించారని విమర్శలున్నాయి.
ఫలితంగా శిక్ష కూడ అనుభవించారు. అయినా ఎస్సారెస్పీని ఆపనులు మచ్చలాగా వెంటాడుతునే ఉన్నాయి. చివరికి పనులు ఎంత వరకు నాణ్యతతో చేపడితే అంతవరకు కొలతలు చేసి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముందుగా బిల్లులు మంజూరైన కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని మూడేళ్ల క్రితం నోటీసులు కూడ ఇచ్చింది. అయితే రికవరీ మాత్రం జరగలేదు.
ఇతర పనులు కొలతలు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చె ందుతున్నారు.రెండేళ్ల క్రితం ఎల్‌ఎండీలో రూ. 30 లక్షల పనులు చేసి బిల్లులు అందక ఒక నీటి వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు గుండె పోటుతో మృతి చెందాడు. కాగా ఎస్సారెస్పీ పనులు అంటేనే ప్రభుత్వాలకు విసుగు వచ్చేల అవినీతి జరిగిందని అంటున్నారు. దీంతో ఏపని చేపట్టినా నిధులు మంజూరు కావడం లేదంటున్నారు. ప్రస్తుతం ఒక పనికి అధికారులు అంచన విలువ తయారు చేసి ప్రతి పాదనలు పంపిణీ చేసేందుకు జంకుతున్నారు. బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం వలన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడంలేదు. కొత్త ప్రభుత్వంలోనైన ఎస్సారెస్పీకి మహర్దశ పట్టాలని రైతులు కోరుతున్నారు.