కల‘వరి’మాయె..!
ఆగస్టుపైనే ఆశలు..ఆకాశం కేసి చూపులు..వరుణుడు కరుణించక పోతాడా అని.., సాగర్ ఉప్పొంగక పోతుందా అని.., హలాలు పట్టి పొలాలు దున్నే సమయం కోసం నిరీక్షణ. వరి సాగు కోసం రైతులు ఆశగా ఎదురుచూపు.. చినుకమ్మా ఓసారైనా రావమ్మా..! ఆగస్టుపైనే ఆశలు..
- ‘సాగర్’లోకి ఆశించిన మేర నీరు చేరితేనే నాట్లు
- 16 మండలాల రైతుల ఎదురు చూపులు
- వర్షాలు అనుకూలిస్తే 1.50 లక్షల ఎకరాల్లో వరిసాగు
ఖమ్మం వ్యవసాయం : జిల్లాలోని 16 మండలాల రైతులు వరి పంట సాగుకోసం ఎదురు చూస్తున్నారు. వరినాట్లకు అనుకూలమైన సమయం సమీపించడంతో నాట్ల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో వరి సాగు దాదాపు 1.34 లక్షల హెక్టార్లు కాగా దీనిలో దాదాపు 60 నుంచి 65 లక్షల హెక్టార్లు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. నాగార్జున సాగర్ నిండితే కానీ ఈ ఆయకట్టులో వరిసాగుకు అవకాశం ఉండదు. సాగర్లో ప్రస్తుతం 510 అడుగుల నీటిమట్టం ఉంది. ఈ నీటిమట్టం మరో 30 నుంచి 40 అడుగులు పెరిగితే వరి పంట సాగుకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆగస్టులో కురిసే వర్షాలు అనుకూలిస్తే ఈ నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. సాగర్ ఆయకట్టు పరిధిలో పలుచోట్ల వరినారు పోశారు. కూసుమంచి నుంచి వేంసూరు దాక..
జిల్లాలోని కూసుమంచి మండలం మొదలు ఒక వైపు వేంసూరు, మరో వైపు ఎర్రుపాలెం వరకు సాగర్ ఆయకట్టు ఉంది. ఈ పమండలాల పరిధిలోని పలు ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరటంతో రైతులు వరినాట్లు వేస్తున్నారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావం మంగళవారం జిల్లాలో కనిపించింది. ఈ వర్షాలు అనుకూలిస్తే సరే..లేదంటే సాగర్ ఆయకట్టులో ఆగస్టు నెల దాటితే ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని వ్యవసాయ శాఖ భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే ఆ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది. విత్తనాలను కూడా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ నుంచి తెప్పించేందుకు ప్రణాళిక రూపొందించింది.
22.1 శాతమే వరినాట్లు
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 1,34,781 హెక్టార్లు కాగా ఇప్పటి వ రకు 29,726 హెక్టార్లలో వరి పంటను వేశారు. పలు ప్రాజెక్టుల్లోకి నీరు రావటంతో ఆయకట్టులో వరినాట్లు వేస్తున్నారు. తాలిపేరు, బయ్యా రం, బేతుపల్లి, మూకమామిడి, వైరా, కిన్నెరసాని తదితర ప్రాజెక్టుల పరిధిలో వరినాట్లు వేస్తున్నారు. సత్తుపల్లి డివిజన్‌లో 12,689 హెక్టార్లు, ఖమ్మం డివిజన్‌లో 1,147 హెక్టార్లు, మధిర డివిజన్‌లో 1491హెక్టార్లు, గార్లలో 2,858 హెక్టార్లు, కొత్తగూడెంలో 2,194 హెక్టార్లు, పాల్వంచలో 1567హెక్టార్లు, మొరంపల్లిబంజర డివిజన్‌లో 3,981 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయి.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరిసాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పరిధిలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సత్తుపల్లి మండంల బేతుపల్లి, పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు, వైరా రిజర్వాయర్, బయ్యారం రిజర్వాయర్ తదితర ప్రాజెక్టులు, చెరువుల కింద వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలో మొత్తం వ్యవసాయ పంట సాగు సాధారణ విస్తీర్ణం 3,48,706 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2,10,927 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. దీనిలో వరి సాగు విస్తీర్ణం కేవలం 29,726 హెక్టార్లు అంటే మొత్తంలో 22.1 శాతం మాత్రమే వరినాట్లు వేశారు.