13 మంది రైతుల ఆత్మహత్య | 13 farmers commit suicide | Sakshi
Sakshi News home page

13 మంది రైతుల ఆత్మహత్య

Published Mon, Sep 28 2015 1:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM

13 మంది రైతుల ఆత్మహత్య - Sakshi

13 మంది రైతుల ఆత్మహత్య

- నల్లగొండలోనే నలుగురు
సాక్షి నెట్‌వర్క్:
తెలంగాణ జిల్లాల్లో అప్పుల బాధతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు  మొత్తం 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెంకు చెందిన అనిరెడ్డి హనుమారెడ్డి(62) తనకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. రూ. 5 లక్షల వరకు అప్పు చేసి మొత్తం తొమ్మిది బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. అప్పు తీరే మార్గం కనిపించక మనస్తాపానికి గురైన హనుమారెడ్డి శనివారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రాత్రి మరణించాడు.
 
ఇదే జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన రైతు పెండ్యాల లక్ష్మయ్య(45) తనకున్న 3 ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా నష్టాలు రావడం తో రూ. 6 లక్షల మేరకు అప్పు అయ్యింది. ఈ ఏడాది పంట చేతికి వచ్చే పరిస్థితి లేక మనోవేదనకు గురై ఈ నెల 22న క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం చనిపోయాడు.
 
గుర్రంపోడు మండలానికి చెందిన రైతు ఇటికాల యాదయ్య(42) తనకున్న 3 ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. వరుస నష్టాలతో పాటు ఈ ఏడాదీ పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సాగు కోసం చేసిన రూ. 6 లక్షల అప్పు ఎలా తీరుతుందనే బెంగతో ఆదివారం ఉదయం ఉరి వేసుకున్నాడు.
 
ఇదే జిల్లా నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన గంగుల రాములు(55) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. సాగు కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు. మనస్తాపానికి గురైన రాములు ఈ నెల 12న క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, ఆదివారం మృతి చెందాడు.
 
కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం మాచారూర్‌కు చెందిన రైతు బోదుకం గంగారాం(60)కు నాలుగు ఎకరాల భూమి ఉండగా, 6 బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. ఈ ఏడాది కేవలం 2 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న వేశాడు. అదికూడా నీరు లేక ఎండిపోయింది. బోర్ల కోసం చేసిన అప్పులు రూ. 5 లక్షలు అయ్యాయి. అప్పు పై బెంగతో నిత్యం మథనపడేవాడు. ఆదివారం కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లగా, ఇంట్లో ఉన్న గంగారాం ఉరి వేసుకున్నాడు.
 
ఇదే జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రైతు సుద్దాల గంగయ్య(42) తన మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. రూ. 5 లక్షల అప్పు అయ్యింది. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దిగి పైపులకు ఉరి వేసుకున్నాడు.
 
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లికి చెందిన రైతు సిద్ధిరాములు(23) తనకున్న ఎకరన్నరలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట చేతికి రాక పోగా, వరుస నష్టాలతో అప్పు రూ. 3 లక్షల వరకు చేరుకుంది. కలత చెందిన సిద్ధిరాములు శనివారం వేకువ జామున ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఇదే జిల్లా నాగాపూర్ గ్రామానికి చెందిన రైతు నీల పోచయ్య(65) తనకున్న రెండు ఎకరాల్లో 2 బోర్లు వేయించగా,  ఒకదాంట్లో కొద్దిగా నీరుపడింది. దీంతో అర ఎకరం మాత్రమే వరిసాగు చేశాడు. నీరు లేక పంట ఎండుముఖం పట్టింది. బోర్లు వేసేందుకు, సాగు కోసం చేసిన అప్పు రూ. 2  లక్షల వరకు అయ్యింది. అప్పు తీరే మార్గం కనిపించక ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన రైతు బాకారపు ప్రణీత్‌రెడ్డి(29) తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. సాగు కోసం రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. కాలం కలిసి రాక పంటలు ఎండిపోవడంతో అప్పు తీరే మార్గం కనిపించక మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
 
మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం లోకుర్తికి చెందిన రైతు కుర్వ లక్ష్మయ్య(50) తనకున్న రెండు ఎకరాల్లో బోర్లు ఎండిపోవడంతో అర ఎకరం మాత్రమే వరి సాగు చేశాడు. బ్యాంకు నుంచి రూ. లక్ష, వడ్డీ వ్యాపారుల నుంచి మరో రూ. లక్ష అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు.
 
ఇదే జిల్లా అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన రైతు పిల్లి ఆనంద్(38) ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. అప్పు తెచ్చిన రూ. మూడు లక్షలు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యా డు. ఆదివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడు.
 
ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన చెరుకూరి బాబురావు(45) తన అర ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. అప్పు తీరే మార్గం కనిపించక ఆదివారం క్రిమిసంహారక మందు తాగాడు.
 
ఇదే జిల్లా పాల్వంచ మండలం పాయాకారి యానంబైల్ పరిధి పునుకులకు చెందిన రైతు నీరుడు మాధవరావు(40) తనకున్న ఎకరన్నరకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వర్షాలకు పత్తి దెబ్బతింది. దీంతో మనోవేదనకు గురైన మాధవరావు శనివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు.
 
ఆగిన గుండెలు..
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన బెస్తనాగుల నర్సింహులు(55),  వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి శివారు సీత్లాతండాకు చెందిన రైతు అజ్మీర బాల్యా(48), పాలమూరు జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన రైతు దాసరి జనార్దన్‌రెడ్డి(58) వర్షాభావ పరిస్థితుల్లో పంటపోయిందనే బెంగతో మనోవేదనకు గురై అప్పు తీరేమార్గం కనిపించక ఆదివారం గుండె ఆగి మరణించారు.
 
కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి
ఆదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కొప్పుల చెతిర్ చిన్నభూమేశ్(38), మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ గ్రామపంచాయతీ పరిధిలోని బోడబండ తండాకు చెందిన రైతు లక్ష్మీపతి (40)  ఆదివారం కరెంట్ షాక్‌తో చనిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement