ఆరుతడి వరికి ‘సెన్సార్ల’ దన్ను! | to paddy 'Sensors' support! | Sakshi
Sakshi News home page

ఆరుతడి వరికి ‘సెన్సార్ల’ దన్ను!

Published Tue, Aug 18 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

ఆరుతడి వరికి  ‘సెన్సార్ల’ దన్ను!

ఆరుతడి వరికి ‘సెన్సార్ల’ దన్ను!

సెన్సార్లు అమర్చిన పొలాల్లో నిశ్చింతగా ఆరుతడి వరి సాగు
నీరు నిల్వ కట్టనక్కర్లేదు.. భూమిలో కొంత మేరకు తేమ ఆరిన తర్వాత సెన్సార్ల ద్వారా రైతుకు ఎస్సెమ్మెస్
వరి మాగాణుల్లో 30-40% వరకు సాగు నీరు ఆదా!
{పభుత్వ సంస్థ ‘వాలంతరి’ క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెల్లడి

 
కరువు కోరలు చాచి పంటలను కబళిస్తోంది. కరువు కరాళ నృత్యం చేస్తున్న కష్ట కాలం ఇది. బోర్లపై ఆధారపడే మెట్ట పొలాల్లోనే కాదు.. భారీ ప్రాజెక్టుల పరిధిలో సాగు నీటి భరోసా ఉందనుకున్న పొలాల్లోనూ నీటి బొట్టు లేని దుస్థితి. బోర్లలో ఉన్న కొద్ది నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటను కాపాడుకోవడం ఇప్పుడు వారి ముందున్న సవాలు. నీటిని నిల్వగట్టకుండా కాలువ కింద భూముల్లో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చని, నేలలో జాన లోతు వరకు నీటి తేమ ఆరిన తర్వాత మళ్లీ తడి పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరు తడి పద్ధతుల్లో వరి సాగు చేస్తే దిగుబడి నష్టపోయే ప్రమాదమేమీ లేదా? ముమ్మాటికీ లేదంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. సాయి భాస్కర్‌రెడ్డి. సెన్సార్లను పొలంలో అమర్చుకోవడం ద్వారా నేలలో తేమ గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందుతూ.. పంట ఎండిపోతుందేమోనన్న భయం లేకుండా నిశ్చింతగా ఆరుతడి వరి సాగు చేయవచ్చంటున్నారు.
 సాగునీటి ప్రాజెక్టుల కింద మాగాణుల్లో సాగు నీటిని సమర్థవంతంగా వాడుకోవడాన్ని రైతులకు అలవాటు చేయాలన్న సంకల్పంతో ‘వాలంతరి’ అనే ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ‘క్లైమడాప్ట్’ ప్రాజెక్టు సమన్వయకర్తగా డా. సాయిభాస్కర్‌రెడ్డి పనిచేశారు. ఈ క్రమంలో సాగు నీటిని ఆదా చేసుకునేందుకు తోడ్పడే తక్కువ ఖర్చుతో కూడిన అల్ట్రాసోనిక్ సెన్సార్లను రూపొందించారు. నల్గొండ, గుంటూరు జిల్లాల్లో కొందరు రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా వాటర్ ట్యూబులు పాతారు.  నేలలోకి అల్ట్రాసోనిక్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. 30-40 శాతం సాగు నీటిని ఆదా చేసుకోవచ్చని రుజువైందన్నారు. వరి పొలంలో నీరు నిల్వ లేకపోతే దిగుబడి తగ్గిపోతుందేమోనని రైతులు సాధారణంగా కంగారు పడుతుంటారు.

అయితే, నీటి తేమ 15 సెం.మీ.(ఆరు అంగుళాల) లోతు వరకు పొడిబారే వరకు వేచి ఉండి.. తడి పెట్టినా ఇబ్బంది లేదని రైతులు అనుభవపూర్వకంగా గ్రహించారని డా. సాయి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆరుతడి పద్ధతుల్లో వరిని సాగు చేసినప్పుడు వేళ్లు మరింత లోతుకు చొచ్చుకెళ్తున్నందున పిలకలు ఎక్కువగా వస్తున్నాయని, ధాన్యం దిగుబడి కూడా పెరిగినట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి తీయడానికి సెన్సార్లు ఉపకరిస్తున్నాయన్నారు.

 నీటిని నిల్వగట్టే పద్ధతిలో రెండున్నర ఎకరాల(హెక్టారు)లో వరి పంటను సాగు చేయడానికి వాడే నీటికి లీటరుకు పైసా చొప్పున ఖరీదు కడితే రూ. 1,20,000 చెల్లించాల్సి వస్తుంది. కానీ, హెక్టారుకు రైతుకు వచ్చే ఆదాయం మాత్రం రూ. 30 వేలకు మించి ఉండటం లేదు. ఎంతో విలువైన జల వనరులను అతిపొదుపుగా వాడుకోవడానికి అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. కాలువల ద్వారా చుక్క నీరు వచ్చే వీల్లేని ఈ కరువు కాలంలో బోరు నీటి సదుపాయం కలిగిన రైతులు సెన్సార్లను అమర్చుకొని నిశ్చింతగా ఆరుతడి వరిని పండించుకోవచ్చని డా. సాయి భాస్కర్ రెడ్డి సూచిస్తున్నారు.

 పంట కాలువల్లో / పొలాల్లో నీటి మట్టం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, నేలలో తేమ, పొలంలో నిల్వ ఉన్న నీటి మట్టం, పంటలున్న పొలం మట్టిలో నీటి తేమ ఎంత కాలంలో ఎంత లోతు వరకు ఆరిపోతున్న విషయాన్ని కూడా ఈ సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆరుతడి పంటలు, పూర్తి వర్షాధార పంటలు, పండ్ల తోటల్లోనూ ఇటువంటి సెన్సార్లను ఏర్పాటు చేసుకోవచ్చు. పొలంలో నాలుగు చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేసుకుంటే చాలని డా. సాయి భాస్కర్ రెడ్డి (96767 99191) తెలిపారు.    - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 
 ఆరుతడి వరిలో సెన్సార్లతో ఉపయోగమే!
 నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఏడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. మా పొలంలో డా. సాయి భాస్కర్‌రెడ్డి మూడేళ్ల క్రితం సెన్సార్లను ఏర్పాటు చేశారు. మా పొలంలో మూడు చోట్ల సెన్సార్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు కాలువ నీరు ఎప్పుడూ చేనులో నుంచి పై నుంచి కిందికి పారుతూ ఉండేది. ఎప్పుడు నీరు నిల్వ ఉంచేవాళ్లం. సెన్సార్లు పెట్టిన తర్వాత నీరు నిల్వగట్టడం మానేశాను. పొలం మట్టిలో జాన లోతు వరకు తేమ ఆరిన తర్వాత తడి పెట్టడం నేర్చుకున్నాను. అవసరమైనప్పుడు నీటి తడి పెడితే చాలని సెన్సార్లు పెట్టిన తర్వాత తెలుసుకున్నాను. దిగుబడి కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 1121 రకం 45 బస్తాలు, బీపీటీ 40 బస్తాల దిగుబడి వచ్చింది. నిరుడు ఆరుతడి పంటను సుడి దోమ అంతగా దెబ్బతీయలేదు. నీరు నిల్వగట్టిన పంటకు సుడిదోమ దెబ్బ ఎక్కువగా ఉంది. సెన్సార్లు ఉపయోగకరమే. ఈ సంవత్సరం కాలువ నీళ్లు రాలేదు. బోరు నీటితో 3 ఎకరాల్లో ఆరుతడి వరి సాగు చేస్తున్నా.
 - కొడాలి ప్రభాకరరావు (90522 46301),
 కొండప్రోలు, దామరచర్ల మండలం, నల్గొండ జిల్లా
 
 నీళ్లు జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నా!

 మా రెండెకరాల వరి పొలంలో 4 చోట్ల సెన్సార్లు పెట్టాం. అంతకుముందు 24 గంటలూ పొలంలో నుంచి నీరు పారుతూనే ఉండేది. సెన్సార్లు పెట్టిన తర్వాత రోజుకు రెండు సార్లు సెల్‌కు మెసేజ్ వస్తుంది. నీటి లోతు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత వివరాలుంటాయి. దీంతో నీళ్లు జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నాను. ఇప్పుడు బోరు నీటితో ఆరుతడి వరి సాగు చేస్తున్నా. మామూలుగా 3 ఎకరాలకు సరిపోయే నీరు 5 ఎకరాలకు సరిపోతున్నది.
 - గోవిందు (99121 91838),
 గేలి తండా, దామరచర్ల, నల్గొండ జిల్లా  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement