నాట్ల కన్నా విత్తటం మిన్న | Labor Less .. Yields More | Sakshi
Sakshi News home page

నాట్ల కన్నా విత్తటం మిన్న

Published Mon, Jun 2 2014 12:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

నాట్ల కన్నా విత్తటం మిన్న - Sakshi

నాట్ల కన్నా విత్తటం మిన్న

శ్రమ తక్కువ.. దిగుబడి ఎక్కువ
 - ఎకరానికి రూ. 5 వేల ఖర్చు తక్కువ.. రెండో పంటకు దిగుల్లేదు..
 - గుంటూరు జిల్లాలో లక్ష ఎకరాలకు విస్తరించిన ఎద పద్ధతిలో వరి సాగు
 - రాయలసీమ, తెలంగాణలకూ అనుకూలమే

పెరిగిన సాగు ఖర్చులు, కూలీల కొరత, అదనుకు కురవని వర్షాలు, అందని కాలువ నీరు సమస్యలన్నీ కలగలిసి రైతు సోదరులతో వరి ఉరిరా బాబు అనిపించాయి. కాలువ కింద మాగాణి పొలాల్లో  ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లేందుకు అవకాశం లేదు. దీనికి తోడు రుతువులు తలకిందులయిపోతున్న కాలంలో కాలువ కింది పొలాలకు కూడా నీరు నిర్దిష్టంగా ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు చివరి వారం నుండి సెప్టెంబర్ మధ్య కాలం వరకు నీరందని పరిస్థితి. దీంతో నాట్లు ఆలస్యమై దిగుబడుల మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంది. వాన రాకడ  శాస్త్రీయ అంచనాలకు కూడా అందని పరిస్థితులు ఉత్పన్నమౌతున్న రోజుల్లో దమ్ము చేసి నాట్లు వేయడం అనేది రైతుకు నష్టదాయకంగా మారింది.
 
 ఈ పరిస్థితులను అధిగమించడానికి లాం ఫాంకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కోటపాటి గురవారెడ్డి సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రాచీన కాలంలో రైతులు అనుసరించిన మెట్ట వరి సాగు పద్ధతిని ఆధునీకరించి ఎద సాగు పద్ధతిని రూపొందించి మార్గదర్శకత్వం వహించారు. తొలుత 2010-11వ సంవత్సరంలో గుంటూరు గ్రామీణ మండలం జొన్నలగడ్డలో తొలుత నాలుగు వేల ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయ నారంభించారు. డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ వి. సీతారాంబాబు, డాక్టర్ ఈ. నారాయణ, కె. తులసీరామ్, కె. సురేష్‌రెడ్డిలతో కూడిన లాంఫాం శాస్త్రవేత్తల  బృందం, గుంటూరు వ్యవసాయ శాఖ అధికారులతో కలసి చేసిన కృషి ఫలితంగా.. ఈ విధానం ఇప్పుడు  గుంటూరు గ్రామీణ మండలం, తెనాలి, బాపట్ల, దుగ్గిరాల తదితర మండలాల్లో  దాదాపు లక్ష ఎకరాలకు విస్తరించింది.
 
 ఏ ప్రాంతమైనా అనువైనదే..

 ఎదబెట్టి వరి సాగు చేసే విధానం కేవలం కోస్తా జిల్లాల రైతులకే కాక వర్షాభావ ప్రాంతమైన రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోనూ అనుసరణీయమైన విధానమే అని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. బావులు, చెరువులు, బోర్ల కింద మాగాణి సాగు చేసే తెలంగాణ జిల్లాల్లోనూ తొలకరి వర్షాలకు పొడి దుక్కి దున్నుకొని విత్తనం ఎదబెట్టి.. తరువాత అందే వర్షాలతో పూర్తిస్థాయి నీటి తడులు అందించి మెరుగైన దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉంది. ప్రయోగశీలురైన రైతు సోదరులు ఈ విధానాన్ని ఆచరించి మిగతా రైతులకు మార్గదర్శకత్వం వహించవచ్చు. ఈ పద్ధతి కొత్తగా కనిపిస్తున్నప్పటికీ మూడు, నాలుగు దశాబ్దాల కింద మన పూర్వీకులు అనుసరించిన విధానమే. ఈ విధానానికి కొన్ని యంత్ర పరికరాల తోడ్పాటు తీసుకోవడం వలన మరింత మెరుగైన, ఖచ్చితమైన ఫలితాలు సాధ్యమయ్యాయి.
 
 ఎద పద్ధతిలో సాగు విధానం

 ఈ సాగు పద్ధతిలో  అకాల వర్షాలు లేదా తొలకరి వర్షాల్లో పొడి దుక్కి చేసుకోవాలి. నాలుగుసాళ్లు దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తనాలను ఎద జల్లడం కాకుండా విత్తుకోవాలి. దీనికి విత్తన గొర్రును ఉపయోగించాలి. దీని వలన కనీసం రెండు నుంచి నాలుగు సెంటీ మీటర్ల వెడల్పు, నాలుగు నుంచి ఏడు సెంటీమీటర్ల లోతు సాళ్లు ఏర్పడుతాయి. గొర్రును ఉపయోగించడం వలన విత్తనం సమానలోతు, సమానదూ రంలో పడతాయి. సాళ్ల వెంట నీరు పెట్టినప్పుడు.. గింజకు సమానంగా నీరందుతుంది.  ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం పది నుంచి 15 కిలోల విత్తనం చాలు. అనుభవజ్ఞుడైన డ్రైవర్ ట్రాక్టర్‌తో గంటలో ఎకరం విత్తడం పూర్తిచేయగలుగుతాడు.
 
 మెట్టవరి సాగు విధానంలో ప్రధానమైనది కలుపు సమస్య. అయితే కొన్ని మెలకువలు పాటిస్తే కలుపును అదుపు చేయడం అంత కష్టమేమీ కాదు. వరి సాగుకు ముందు పచ్చిరొడ్డ పైరు అలికి, దాన్ని దుక్కిలో రోటవేటర్‌తో కలియదున్నితే పొలానికి బలం చేకూరడంతో పాటు ముందుగా మొలిచిన కలుపు మొక్కలు చనిపోతాయి. వరి విత్తిన రెండు, మూడు రోజుల్లోపు పెండి మిథాలిన్ (స్టాంప్) లీటరు లేదా ప్రిటిలాక్లోర్ + సేఫనర్ (సోఫిట్) 600 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు మొలకెత్తదు. ఈ మందులు బాగా పని చేయాలంటే నేలలో తేమ అవసరం. విత్తిన 20 రోజుల నుంచి నెల లోపు సైహలోపాప్ బ్యుటైల్ (క్లించర్, రాప్ అప్) 400 మిల్లీ లీటర్లు మరియు బిస్ ఫైరిబ్యాక్ సోడియం (నామిని గోల్డ్) 80 నుంచి 100 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని వల్ల పైరుతో పాటు మొలిచి పెరిగిన ఊదా గడ్డితో పాటు ఇతర వెడల్పాటి ఆకుల కలుపు నశిస్తుంది.
 
 దిగుబడీ ఎక్కువే..


 ఎద పద్ధతి వల్ల సాగు ఖర్చులు తొలి దశలోనే 5 వేల రూపాయల వరకు ఆదా అవుతాయి. తక్కువ నీటితో పంట పండుతుంది. సాధారణ పద్ధతి కంటే 10 రోజులు ముందుగానే కోతకు వస్తుంది. పైరు సాళ్ల క్రమంలో ఉండడం వలన చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. చదరపు మీటరుకు దుబ్బుల శాతం ఎక్కువగా ఉండడం వలన సాధారణ పద్ధతి కంటే దిగుబడి హెచ్చుగానే ఉంటుంది.
 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్
 (ఇన్‌పుట్స్: కోటిరెడ్డి, న్యూస్‌లైన్, కొరిటెపాడు, గుంటూరు)

 
 నాలుగేళ్లలో లక్ష ఎకరాలకు..


గుంటూరు సమీపంలోని జొన్నలగడ్డ గ్రామ పొలాలకు  నాగార్జునసాగర్ ఎడమ కాలువ  మిగులు నీరు తప్ప వేరే నీటి వనరు లేదు. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కాలువ మిగులు నీరు కొండవీటి వాగు ద్వారా అందుతుంది.  ఈ గ్రామాన్ని వ్యవసాయ విశ్వ విద్యాల యం తరఫున దత్తత తీసుకొని నాలుగేళ్లుగా క్లైమా అడాప్ట్ పథకాన్ని అమలు చేస్తున్నాం. కాలువ నీరు ఆలస్య మౌతుండడంతో  వరి విత్తనాలు ఎద జల్లే పద్ధతిని అనుస రించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈ పద్ధతిని మెరుగు పరిచి ఇప్పుడు జిల్లాలోని ఇతర ప్రాంతాలకూ  దాదాపు లక్ష ఎకరాలకు విస్తరింపజేశాం.
 - డాక్టర్ కోటపాటి గురవారెడ్డి (9849484398),    
 ‘కై ్లమా అడాప్ట్’ పథకం సమన్వయకర్త,
 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం ఫాం,
 గుంటూరు -522034, ఫోన్: 0863-2524017
 
 ఇంకొన్ని సంగతులు..!

- సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ విత్తనం వాడితే దుబ్బులో కంకులు లేని పిలకలు ఎక్కువగా ఉంటాయి. వరి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువ కావడం వల్ల పొడ తెగులు, దోమ ఉధృతి పెరుగుతుంది. నత్రజని లోపం కనిపిస్తుంది. విత్తేటప్పుడు గింజ ఎక్కువ లోతులో పడితే మొలక శాతం తగ్గుతుంది.
 
అధిక దిగుబడి సాధనకు మెలకువలు:


- పొలాన్ని మిట్టపల్లాలు లేకుండా చక్కగా చదును చేసుకోవాలి. ఠ నేలలో విత్తనం 3 సెం.మీ.ల కంటే లోతులోకి జారనివ్వకూడదు. ఠ విత్తనాన్ని నాటిన 2 రోజుల్లోపే కలుపు మందు పిచికారీ చేయాలి. ఠ విత్తనం మొలిచిన 10-15 రోజుల్లోపు వర్షాభావం ఉండకూడదు. ఠ విత్తనం పూర్తిగా మొలకెత్తిన తరువాత నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి.  ఠ పైరు దుబ్బు చేసే వరకు 3-7 రోజుల అంతరంతో ఆరుతడి పద్ధతిలో నీరు పెట్టవచ్చు. దుబ్బు కట్టిన తరువాత మాత్రం నీటి ఎద్దడి రానీయకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement