సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారంరాత్రి వరకు వేర్వేరు జిల్లాల్లో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో వరంగల్ నలుగురు, నిజామాబాద్‌లో ముగ్గురున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డెపల్లికి చెందిన పుష్ప(28) ఎకరం భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేయగా, వర్షాలు లేక ఎండిపోయింది. ఆమెకు సిండికేట్ బ్యాంకులో రూ.50 వేలు, మహిళా గ్రూపులో రూ. 20 వేలు, గ్రామ సంఘంలో రూ. 20 వేలు, ప్రైవేట్‌గా రూ. లక్ష వరకు బాకీలు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గంలేక శుక్రవారం తెల్లవారు జామున ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
ఇదే జిల్లా బీర్కూర్ మండలం నెమ్లిలో బొబ్బిలి అంజయ్య(55) సాగు చేసిన ఐదెకరాల వరి ఎండిపోయింది. నాలుగు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. రూ. 5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. మనస్తాపంతో అంజయ్య గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ అప్పులు తీర్చే మార్గం కనిపించక శుక్రవారం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన గద్దెల రాములు (55) తన ఆరు ఎకరాల్లో వరి, రెండెకరాలోల వేరుశనగ దిగుబడి తగ్గిపోవడంతో రూ. 2 లక్షల మేరకు అప్పులు అయ్యాయి. అప్పుల కారణంగా మనోవేదనకు గురైన రాములు శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు.
ఇదే జిల్లా చిట్యాల మండలం జూకల్లుకు చెందిన కౌటం రాజయ్య(40) పత్తి, మిర్చి సాగు కోసం రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. పం టలు సరిగా పండకపోవడంతో గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా ములుగు మండలం మల్లంపల్లికి చెందిన చిట్టిరెడ్డి జక్కిరెడ్డి(43) ఏడెకరాల్లో పత్తి, పసుపు, మిర్చి వేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో రూ. 6.70 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాదీ ఆశించిన మేరకు పంట పండకపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉరి వేసుకున్నాడు. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన అంబాల నర్సయ్య(40) తనకున్న ఎకరంలో పత్తి వేశాడు.
దిగుబడి సరిగా రాకపోగా, గిట్టుబాటు ధర కూడా లభించలేదు. దీంతో నెల రోజుల క్రితం చెన్నై వెళ్లాడు. వారం క్రితమే తిరిగి వచ్చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో గురువారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రానికి చెందిన పొట్ల కోటేశ్వరరావు (58) తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. లక్షల్లో అప్పు చేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంటి ఆవరణలో విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన రైతు బండారి (మడిగేటి) మొగిలి(48) శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వరిపొలంలోనే మృతి చెందాడు.
ఉసురు తీస్తున్న అప్పులు
Published Sat, Dec 5 2015 4:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement