‘కరువు’ ప్రకటనపై దాటవేత
గతేడాది కరువు ప్రకటన చేయకుండా ప్రభుత్వం మొండిచెయ్యి
* ఈ ఏడాదీ తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నా నాన్చివేత ధోరణి
* 263 మండలాల్లో కరువు ఉందని విపత్తు నిర్వహణశాఖ అంచనా
* ఆదుకునే వారు లేకనే రైతుల ఆత్మహత్యలు..!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రం ఏర్పడినకొత్తలో కరువు మండలాల ప్రకటన చేయడం సమంజసం కాదని వదిలేశారు.
అలా రైతుకు సర్కారు తీవ్ర అన్యాయం చేసింది. ఈ ఏడాదీ కరువు పరిస్థితులు కమ్ముకున్నా... ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం కరువు ప్రకటనపై నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తోంది. ‘ఇంకా చూద్దాం’ అన్న ధోరణితో వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా రైతులు కరువుతో కుంగిపోతున్నా, అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతోన్నా.. ప్రభుత్వం మౌనం వీడటంలేదు. కరువు ప్రకటనను కేవలం రాజకీయ కోణంలోనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఆలోచనా ధోరణిపై అన్ని వర్గాల్లోనూ నిరసన వ్యక్తమవుతోంది.
గతేడాది 88 మండలాల్లో కరువు..:
రాష్ట్రంలో 2014-15 సంవత్సరంలో వ్యవసాయరంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా మినహా ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన గత సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 498.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.
30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 464 మండలాలకుగాను... 339 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. వర్షపాతం లోటు కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. 401 మండలాల్లో కరువుందని కలెక్టర్లు నివేదిక పంపారు. వాటిని పక్కనపెట్టిన సర్కారు 88 మండలాల్లోనే కరువు ఉందని నిర్దారించింది. కానీ పంట కోత ప్రయోగాల నివేదిక రాలేదన్న సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి కరువు ప్రకటన చేయకుండానే వదిలేసింది. ఫలితంగా ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నదాతుల ఆత్మహత్యలు గత ఏడాది 700 వరకు చేరాయి.
ఇప్పుడూ 263 మండలాల్లో కరువు పరిస్థితులు...
ఈ ఏడాది కూడా పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. జూన్‌లో రుతుపవనాలు వచ్చినా జూలైలో వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. ఆగస్టులో వర్షాలు కురిసినా వాటివల్ల పంటలకు ప్రయోజనం లేకుండాపోయింది. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సాధారణంగా ఇప్పటివరకు 546.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 425.6 మిల్లీమీటర్లకే పరిమితమైంది.
22 శాతం లోటు కనిపిస్తోంది. వర్షానికి వర్షానికి మధ్య తేడా ఎక్కువ రోజులు ఉండటంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో (హైదరాబాద్ మినహాయిస్తే) 263 మండలాల్లో వర్షాభావం నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 46 మండలాల్లో, మెదక్‌లో 45, కరీంనగర్‌లో 44 మండలాల్లో వర్షాభావం నెలకొంది. విపత్తు నిర్వహణ శాఖ తాజా అంచనా ప్రకారం మొత్తం 263 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
సెప్టెంబర్ లో వర్షాలు వస్తే పరిస్థితి మారొచ్చని లేకుంటే వర్షాభావ మండలాలలు మరిన్ని పెరుగుతాయని ఆ శాఖ అంటోంది. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా కరువు మండలాల ప్రకటపై నా.. వాటిల్లో వ్యవసాయ పంటల దుస్థితిపైనా సర్కారు కదలడంలేదు. వర్షపాతంలో లోటు, తగ్గిన సాగు విస్తీర్ణం, వర్షానికి వర్షానికి మధ్య రోజులు, పంటల దిగుబడి తదితర సాంకేతిక అంశాలు పరిశీలించాకే కరువును నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు.
కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అంచనా వేసి కరువును ప్రకటిస్తేనే తప్ప రైతులకు ప్రయోజనం కలగదని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిందనీ... మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసిందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక ఇప్పటివరకు సుమారు 70 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం.