ముందుస్తు ముంచింది!
ముందుస్తు ముంచింది!
Published Sun, Sep 18 2016 12:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
వేరుశనగ రైతుకు అపార నష్టం
– లక్ష హెక్టార్లలో ఎండిన పైర్లు
– పూర్తిగా దెబ్బతిన్న కొర్ర, మొక్కజొన్న
– అప్పుల ఊబిలో రైతులు
– రెయిన్‌గన్లు హడావుడికే..
– ఉపయోగం లేని ప్రస్తుత వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): ముందస్తు వర్షం వేరుశనగ రైతును నిండా ముంచేసింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ విడత జిల్లాలోనే వేరుశనగ సాగు అధికంగా ఉంది. జూన్, జూలై నెలల్లో మురిపించిన వర్షాలు ఆగస్టు నెలలో ముఖం చాటేయడంతో రైతుల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ నెలలో 12వ తేదీ వరకు చినుకు జాడ కరువైంది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ., ఉండగా.. 79.8 మి.మీ., మాత్రమే నమోదయింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 కాగా.. ఇప్పటి వరకు 90.4 మి.మీ., వర్షం కురిసింది. ఏకంగా 40 రోజుల పాటు వర్షం లేకపోవడం.. ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. ఆగస్టు మొదటి నుంచి సెప్టెంబర్ 10 వరకు కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నెలలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురిసినా వేరుశనగ, కొర్ర, మొక్కజొన్నకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆగస్టు మొదటి వారంలో వేరుశనగలో పూత వస్తుంది. ఆగస్టు నెల చివరికి ఊడలు దిగి కాయలు ఏర్పడతాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పూత రాకపోవడం.. వచ్చినా ఎండలకు రాలిపోయింది. అక్కడక్కడ ఊడలు దిగినా.. ఆ తర్వాత తేమ శాతం పడిపోవడంతో ఊడలకు కాయలు రాక రైతులకు నష్టం మిగిలింది.
లక్ష హెక్టార్లలో దెబ్బతిన్న వేరుశనగ
జిల్లాల్లో వేరుశనగ సాధారణ సాగు 1,04,237 హెక్టార్లు కాగా.. 1,15,627 హెక్లార్లలో సాగయింది. ఇందులో లక్ష హెక్టార్లకు పైగా వేరుశనగ వర్షాభావం వల్ల దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులే చెబుతున్నారు. దెబ్బతిన్న నల్లరేగడి నేలల్లో వేసిన వేరుశనగను దున్నేసి రబీలో శనగ సాగుకు సిద్ధవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వేరుశనగ దెబ్బతినడంతో రైతులు నట్టేట మునిగారు. ఎకరాకు కనీసం ఒక బస్తా కూడా.. అంటే 42 కిలోలు కూడా వచ్చే పరిస్థితి లేదంటే రైతులు ఏ స్థాయిలో నష్టపోయారో తెలుస్తోంది.
మిగిలిన పంటలదీ అదే పరిస్థితి
ప్రధానంగా వేరుశనగ కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో సాగయింది. నష్టపోయిన రైతుల కన్నీటి గాథలు వర్ణనాతీతం. అదేవిధంగా కొర్ర, మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా దెబ్బతిని పనికి రాకుండాపోయాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో 10,444 హెక్టార్లలో కొర్ర.. 25,932 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు పొట్టదశలోనే ఎండలకు ఎండిపోయాయి. వచ్చిన కంకుల్లో ఒక్క గింజ కూడా కనిపించని పరిస్థితి.
రెయిన్‌గన్ల పేరిట హడావుడి
ప్రభుత్వం రెయిన్‌గన్ల పేరిట గత నెల నుంచి హడావుడి చేస్తోంది. జిల్లాలోని ఆలూరు మండలం అరికెరలో రెయిన్‌గన్లతో ఎండుతున్న పంటలను తడిపే ప్రక్రియను ఇటీవల ముఖ్యమంత్రి కూడా పరిశీలించారు. అయితే ఈ ప్రక్రియ దారుణంగా విఫలమైంది. తమకు రెయిన్‌గన్లు వద్దు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే చాలని రైతులు వేడుకుంటున్నారు. రెయిన్‌గన్ల పేరిట రైతులను మభ్యపెట్టడం, ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
హెక్టారుకు రూ.40వేల పెట్టుబడి నేలపాలు
వేరుశనగ సాగులో ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ బాడుగలు తదతర ఖర్చులు కలిపి హెక్టారుకు సగటున రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. హెక్టారుకు కనీసం 12 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వస్తే రైతులకు పెట్టుబడి దక్కి రూ.10 వేల వరకు మిగులు ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజులకు పైగా వర్షాలు లేకపోవడంతో ఎండలకు లక్ష హెక్టార్లలో వేరుశనగ మాడి పోయింది. అంటే పెట్టిన పెటుబడి మొత్తం నేల పాలయింది. అంటే రైతులు పెట్టిన పెట్టుబడులు రూ.400 కోట్లు మట్టి పాలయ్యాయి. కొర్రకు హెక్టారుకు రూ.20వేలు, మొక్కజొన్నకు రూ.25వేలు ప్రకారం పెట్టుబడి పెట్టగా.. ఇదంతా మట్టిలో కలిసిపోయింది.
Advertisement