మంత్రి గారూ.. గోడు వినరూ | Latency cultivation of paddy farmers | Sakshi
Sakshi News home page

మంత్రి గారూ.. గోడు వినరూ

Published Sun, Jun 29 2014 1:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

మంత్రి గారూ.. గోడు వినరూ - Sakshi

మంత్రి గారూ.. గోడు వినరూ

  • సాగు జాప్యంతో ఖరీఫ్ రైతు ఆందోళన
  •   జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులు
  •   కొలిక్కిరాని కొల్లేరు సమస్యలు
  •   నేడు జిల్లాకు రానున్న వ్యవసాయ మంత్రికి సమస్యలు నివేదించనున్న నేతలు
  • కైకలూరు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మత్స్యకారులు, రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయా సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర చేపల రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబులతో పాటు ఆయనకు కైకలూరులో ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రైతులు, మత్స్యకారులు, చేపల రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
     
    సాగు.. బహు జాగు...

    జిల్లాలో వరి రైతు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఖరీఫ్ ముంచుకొచ్చేసినా అదునులో వర్షాలు లేకపోవడం, తీవ్ర నీటి కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మొత్తం మీద 8.81 లక్షల పంట సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో వరి 6.34 లక్షలు, పత్తి 1.41 లక్షలు, చెరుకు 36 వేలు, మిర్చి 25 వేలు, మొక్కజొన్న ఇతరత్రా పంటలు 43 వేల 892 ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. సాధారణంగా జూన్ మొదటి వారం దాటాక రైతులు నారుమడులు పోస్తారు.

    జూలై మొదటి వారంలో నాట్లు ప్రారంభిస్తారు. తీవ్ర వర్షభావం ప్రభావంతో జూన్ నెలాఖరు కావస్తున్నా వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మరోవైపు జాతీయ ఆహార భద్రత పథకం నుంచి జిల్లాను మినహాయించడంతో రాయితీపై విత్తనాలు అందే పరిస్థితి లేదు. కొద్ది రోజుల క్రితం కేంద్రం సాధారణ రకం ధాన్యంపై క్వింటాలుకు మద్దతు ధర రూ.50 పెంచింది. ప్రస్తుతం క్వింటాలు పంటకు రూ. 2,104 ఖర్చవుతుండగా, మద్దతు ధర రూ.1400 మాత్రమే ఉందని, ఇది రైతులకు ఏ విధంగా మేలు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
     
    ప్రోత్సాహకాలు కరువు...

    జిల్లాలో 111 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మొత్తం లక్షా 15 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 40 వేల మంది సముద్రపు వేటపై ఆధారపడ్డారు. ప్రభుత్వం నుంచి ప్రొత్సహకాలు లేకపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నారు. వీరికి సముద్రపు వేట ఆశాజనకంగా లేదు.

    ఎన్‌ఎఫ్‌డీబీని సీమాంధ్రలో ఏర్పాటు చేయాలి...
     
    మత్స్యరంగం అభివృద్ధికి కేంద్ర స్థాయిలో సాయమందించే నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) కార్యాలయం హైదరాబాదులో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్‌ఎఫ్‌డీబీని కోస్తాంధ్రకు మార్పు చేయాలని ఇక్కడి ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖలో అన్ని కేటగిరీలకు సంబంధించి 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 500 మంది విడిగా వెళ్లారు. కార్యాలయం కూడా రెండుగా విడిపోయింది.

    కోస్తాంధ్రలో విస్తరించిన ఆక్వా రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఎఫ్‌డీబీని ఇక్కడ ఏర్పాటు చేయాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసుకోడానికి ప్రభుత్వపరంగా ఒక్కటంటే ఒక్క కోల్డ్‌స్టోరేజీ కూడా అందుబాటులో లేదు. గతంలో బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫార్మర్స్ ఏజెన్సీ (బీఎఫ్‌డీఏ), ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మర్స్ ఏజెన్సీ (ఎఫ్‌ఎఫ్‌డీఏ)ల ద్వారా కేంద్రం సబ్సిడీపై రైతులకు నిధులు అందించేది. పదేళ్లుగా అవి మనుగడలో లేవు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరగటంతో పాటు రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఆక్వా రైతులు చెబుతున్నారు.
     
     మత్స్యకారుల సమస్యలివీ...

     సముద్రంలో చేపల వేటకు ఉపయోగించే మర బోటులకు ప్రభుత్వం అందించే డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.10కి పెంచాలని మత్స్యకారులు కోరుతున్నారు.
     
     2002 ఏడాదికి ముందు ఇంజన్ బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ అందిస్తామనే మెలిక పెడుతున్నారు. అందరికీ సబ్సిడీ అందించాలి.
     
     ఏటా 50 శాతం సబ్సిడీతో వలలు పంపిణీ చేయాలి.
     
     ఎకో టూరిజం ద్వారా సముద్రంలో తిరిగే విహార బోట్లకు మచిలీపట్నంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.
     
     హార్బర్ పూడుకుపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు పోటు సమయం వరకు వేచివుండాల్సి వస్తోంది.
     
     కొల్లేరు వాసుల కష్టాలివీ...

     కొల్లేరు ప్రాంత మత్స్యకారులు వేటకు ఉపయోగించే వెదురు గెడల పంపిణీ రెండేళ్లకోసారి చేసేవారు. పంపిణీ నిలిచిపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు.
     
     కొల్లేరు సొసైటీలకు అందించే వలల పంపినీ పథకం వివాదాల వల్ల నిలిచిపోయింది.
     
     కొల్లేరులో వేటకు ఉపయోగించే తాటి దోనెల స్థానంలో ఫైబర్ దోనెలు అందించాలని కొల్లేరు మత్స్యకారులు కోరుతున్నారు.
     
      చేపల ఉత్పత్తులను విక్రయించేందుకు ఉపయోగించే మోటారు సైకిళ్లు, ఐస్ బాక్సుల పంపిణీ జరగడం లేదు.
     
     కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన జిరాయితీ భూములకు నష్టపరిహారం చెల్లించలేదు.
     
     మత్స్యశాఖలో సిబ్బంది కొరత కారణంగా సేవలు సన్నగిల్లుతున్నాయి.
     
     తీవ్ర తాగునీటి ఎద్దడి కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement