ఆక్వా ’బడా’యి | acqua ponds effect | Sakshi
Sakshi News home page

ఆక్వా ’బడా’యి

Published Mon, Mar 20 2017 12:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

ఆక్వా ’బడా’యి - Sakshi

ఆక్వా ’బడా’యి

సిండికేట్‌గా బడా రైతులు 
ఏకమొత్తంలో భారీ చెరువుల తవ్వకం 
కొల్లేరులోకీ ప్రవేశం  
నిబంధనలకు తూట్లు
జిల్లాలో ఆక్వా బడాయి నానాటికీ పెచ్చుమీరుతోంది. బడా రైతులు సిండికేట్‌గా మారి చిన్నచిన్న కమతాలను లీజుకు తీసుకుని వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా భారీ చెరువులు తవ్వుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా పిల్ల కాలువలు, పంట బోదెలు, గట్లు కనుమరుగవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. 
 
 
జిల్లాలో చెరువుల తవ్వకం పరిస్థితి ఇదీ(మారుగా)
చెరువులు అధికారికం   అనధికారికం మొత్తం 
         (ఎకరాల్లో )
చేపలు 2,00,000 20,000 2.20,000
రొయ్యలు 15,000 65,000  80,000
====================================
మొత్తం 2,15,000 80,000 3,00,000
 
 
 
ఆకివీడు :  జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెరువులు తవ్వేందుకు వివిధ ప్రాంతాల నుంచి బడా రైతులు తరలివస్తున్నారు. అధిక లీజులు చెల్లిస్తామంటూ చిన్నసన్నకారు రైతులను ఆశపెట్టి వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా చెరువులు తవ్వేస్తున్నారు. తమకున్న పలుకుబడితో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. అధికారులు తమవైపు చూడకుండా చేసుకుంటున్నారు. ఆక్వా రంగాన్ని కార్పొరేట్‌ బాట పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డెల్టాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులు తవ్వేశారు. మరో 3 వేల ఎకరాలు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నట్టు అధికార వర్గాల సమాచారం. వీటిలో 20వేల ఎకరాల చెరువులకు అనుమతులు లేవని తెలుస్తోంది.  ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో 80వేల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిలో అధికారికంగా 15వేల ఎకరాలు కూడా ఉండవని సమాచారం. అనధికారికంగా రొయ్యల చెరువులనూ భారీగా తవ్వేందుకు బడా రైతులు ముందుకు వస్తున్నారు.    
బోదెలు, కాలువలు çకనుమరుగు
 భారీ చెరువుల తవ్వకంతో పంట బోదెలు, పిల్లకాలువలు మాయమవుతున్నాయి. మురుగు కాలువలూ కనుమరుగవుతున్నాయి.  వీటితో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వం భూమి కూడా మాయమవుతోంది. పంట, మరుగుకాలువల అంతర్ధానంతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో నీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
పంట కాలవల్లోకి ఉప్పునీరు 
రొయ్యల చెరువులు విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పంట కాలువల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోయింది. రొయ్యల పెంపకానికి ఉప్పునీటి అవసరాన్ని గుర్తించిన రైతులు అనధికారికంగా బోర్లు తవ్వేస్తున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతోపాటు రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిని పంట కాలువల్లోకి వదిలివేయడంతో వాటిల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోతోంది.  ఈ నీటిని పంట చేలకు పెట్టడంతో భూములు చౌడుబారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 
కొల్లేరులోకి తిమింగలాలు
 కొల్లేరు సరస్సులోకి మళ్లీ తిమింగలాలు ప్రవేశిస్తున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూర్‌ దిగువనున్న డిఫారం భూములకు అక్రమార్కులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే డిఫారం భూముల్లో 4 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులుగా మారిపోయాయి. మిగిలిన  భూములతోపాటు జిరాయితీ, ప్రభుత్వ భూములనూ తవ్వేసేందుకు బడా రైతులు నడుం బిగించారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొల్లేరు భూములను చెరువులుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. 
 
నాలుగు సార్లు నారుమళ్లు
చెరువుల్లోని ఉప్పునీరు పంట కాలువల్లో నుంచి చేలల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చేలు చౌడుబారుతున్నాయి. ఉప్పునీటి వల్ల వేసిన నారుమళ్లు చనిపోతున్నాయి.  ఖరీఫ్‌లో మూడు సార్లు, రబీలో నాలుగు సార్లు నారుమళ్లు పోసుకోవలసి వచ్చింది 
  కొట్టు సత్యనారాయణ, సన్నకారు రైతు, దుంపగడప.
 
వరి దండగ అనిపిస్తోంది 
       పెదకాపవరం గ్రామంలో వరి సాగు చేయడం దండగ అనిపిస్తోంది. చుట్టూ చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉన్నాయి. పట్టుబడుల సమయంలో చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల వరి పంటకు తీవ్ర నష్టం వస్తోంది. దాళ్వాలో వరి దిగుబడులు తగ్గే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల చెరువు నీటి వల్ల నా పొలంలో వేసిన నారుమడి ఎండిపోయింది. 
   సత్యనారాయణ, రైతు, పెదకాపవరం
 
అనుమతుల్లేకుండానే 
   అనుమతుల్లేకుండానే చేపల చెరువులు తవ్వేస్తున్నారు. ‍కొంతమందే జిల్లా కమిటీ అనుమతి తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకం వల్ల  నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పంట కాలువల్లోకి చెరువుల నీరు వదలకూడదు. అలాంటి వారిపై చర్యలు తప్పవు.  
కె.శ్రీనివాస్, సూపరింటెండెంట్, నీటిపారుదలశాఖ 
 
 
    
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement