పట్టుగూళ్ల తీతకు పసందైన యంత్రం!
- పట్టుగూళ్లను వెలికితీసే యంత్రాన్ని రూపొందించిన రైతు శాస్త్రవేత్త
- టన్ను పట్టుగూళ్ల తీతకు 70-80 మంది కూలీలు.. రూ.15 వేల ఖర్చు..
- యంత్రంతో ముగ్గురు కూలీలు చాలు.. ఖర్చు రూ. 800 మాత్రమే
- రోజంతా పనిచేసినా యంత్రం విద్యుత్ బిల్లు రూ. 20
పట్టు పురుగుల పెంపకం ఆయన వృత్తి. వాటి పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులను సవాల్‌గా తీసుకుని పరిష్కారం కనుగొనటంలో ఆయన నేర్పరి. పట్టుపురుగులను పెంచే రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య నేత్రికల నుంచి పట్టు గూళ్లను తీయటం. దీన్ని అధిగమించేందుకు ఒక వైపు మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేస్తూనే పట్టు గూళ్లను సులువుగా సేకరించే యంత్రాన్ని రూపొందించి తోటి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రశంసలు పొందిన ఆ రైతు శాస్త్రవేత్త పేరు గాండ్ల గురుమూర్తి శెట్టి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకూ చదువుకున్నారు. తనకున్న ఆరెకరాల్లో మల్బరీ పంటను సాగు చేస్తూ పట్టు పురుగులను పెంచుతున్నారు.
గురుమూర్తి రూపొందించిన యంత్రంతో నేత్రికల నుంచి పట్టుగూళ్లను విడిపించటం, శుభ్రపరచటం, బస్తాల్లో నింపటం వంటి మూడు పనులను ఏక కాలంలో పూర్తిచేయవచ్చు. కూలీల సంఖ్య తగ్గటం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది. పని సకాలంలో పూర్తవుతుంది.
పట్టు గూళ్లను నేత్రికల నుంచి తీసి అమ్ముకునే ప్రక్రియలో రైతుకు ఎదురయ్యే తొలి అవరోధం కూలీల కొరత. రైతులు పట్టుపురుగుల గుడ్లను బ్యాచ్‌ల వారీగా పెంచటమే దీనికి కారణం. నెలకు మూడు బ్యాచ్‌లు వస్తాయి. ఒక బ్యాచ్‌లో సాగుచేసిన రైతులందరికి పంట ఒక్కసారే వస్తుంది. దీంతో ఒక్కసారిగా కూలీలకు గిరాకీ పెరుగుతుంది. సకాలంలో కూలీలు దొరక్క రైతులు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఎన్ని ఇబ్బందులెదురైనా గూళ్లు అల్లటం పూర్తయిన వారంలో పట్టుగూళ్లను నేత్రికల నుంచి తీసి విక్రయించాలి. లేకుంటే పురుగులు గూళ్లను బద్దలు కొట్టుకొని బయటకు వస్తాయి. అదే జరిగితే రైతు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ఆలస్యం జరిగే కొద్దీ పంటను నష్టపోయే పరిస్థితి. ఈ సమస్యను గురుమూర్తి తయారు చేసిన యంత్రం స్వల్ప ఖర్చుతోనే పరిష్కరిస్తుంది.
పట్టుగూళ్లను నేత్రికల నుంచి తీసే యంత్రం 12 అడుగుల పొడవు, 2 1/2 అడుగుల వెడల్పుతో బల్లపరుపుగా ఉంటుంది. యంత్రం మధ్యలో రెండు బ్లేడ్‌లను అమర్చారు. నేత్రికలను బ్లేడ్ల మధ్యన ఉంచి లాగితే పట్టుగూళ్లు బయటకు వ స్తాయి. గూళ్లు బ్లేడ్ల కింద ఏర్పాటు చేసిన కన్వేయర్ బెల్ట్‌పై పడతాయి. కన్వేయర్ బె ల్ట్‌పై అమర్చిన ఇనుప కమ్మలు గూళ్లను పట్టి శుభ్రపరుస్తాయి. గూళ్లను అంటిపెట్టుకుని ఉండే ఆకు, పురుగుల పెంట, జుంజుర (వృథా దారం)ను పూర్తిగా తొలగిస్తాయి. బెల్ట్‌తో పాటు పట్టు గూళ్లు దొర్లుకుంటూ వెళ్లి యంత్రం చివరన ఉంచిన బస్తాలో పడతాయి. బస్తా నిండగానే మూతి బిగించి కట్టి, నేరుగా మార్కెట్‌కు తరలించవచ్చు.
1/4 హెచ్. పి. సామర్థ్యం కలిగిన కుట్టుమిషన్ మోటార్‌ను ఈ యంత్రంలో వాడారు. నాలుగు గంటలకు ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే రూ. 20 ఖర్చుతో ఏకంగా 8 గంటలు పనిచేస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇళ్లలో వాడే ఇన్వర్టర్‌తోను ఈ యంత్రాన్ని నడిపించవచ్చు. అదీ వీలు కాకుంటే యంత్రంలో ఏర్పాటు చేసిన హ్యాండిల్‌ను చేతితో తిప్పుతూ యంత్రాన్ని పనిచేయించవచ్చు. దీనికి కొంచెం అధికంగా శ్రమపడాలి. వంద కిలోల బరువుండే ఈ యంత్రాన్ని ట్రాలీ ఆటోలో పెట్టుకుని కావలసిన చోటుకు తీసుకెళ్లవచ్చు. దీని ఖరీదు రూ. 20 వేలు. ఇంత ఖర్చు భరించే స్థోమత లేని చిన్న రైతుల కోసం చేతితో తిప్పితే నడిచే యంత్రాన్ని కూడా గురుమూర్తి రూపొందించారు. ఇది రూ. 3 వేలకే లభిస్తుంది. హ్యాండిల్‌ను చేతితో తిప్పుతూ గంటకు 60 నేత్రికల నుంచి పట్టుగూళ్లను తీయవచ్చు. రైతులు వాటిని శుభ్రం చేసుకుని ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టన్ను పట్టు గూళ్లను సేకరించటానికి 70-80 మంది కూలీలు అవసరమవుతారు. రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. గురుమూర్తి యంత్రంతో ఒక్కరోజులో ముగ్గురు కూలీలతో పని పూర్తి చేయవచ్చు. కూలీలకు, విద్యుత్ బిల్లు అన్ని కలిపి రూ. 800 వరకు మాత్రమే ఖర్చవుతుంది.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ ఇన్‌పుట్స్ : సుబ్రమణ్యం, సాక్షి, పలమనేరు
కేవీకే శాస్త్రవేత్తలు అభినందించారు..
పట్టు పురుగులు పెంచే రైతులందరూ ఎదుర్కొనే సమస్య పట్టుగూళ్ల సేకరణ. దీన్ని అధిగమించేందుకు ఈ యంత్రాన్ని తయారు చేశాను. రైతులు ఈ యంత్రాన్ని సులభంగా ఉపయోగించవచ్చు. ఏవైనా మరమ్మతు వస్తే రైతులే స్వంతగా బాగు చేసుకోవచ్చు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు నా యంత్రం పనితీరును పరిశీలించి, అభినందించారు. ప్రస్తుతం ఈ యంత్రాన్ని నా తోటి రైతులకు అద్దెకిస్తున్నాను. కిలో పట్టుగూళ్లకు రెండు రూపాయల చొప్పున తీసుకుంటున్నాను. ఎవరైనా రైతులు యంత్రం కావాలని కోరితే తయారుచేసి ఇస్తాను.
- గాండ్ల గురుమూర్తి శెట్టి (98491 26223) ఏడూరు, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా