ధాన్యం కొనకుంటే ఏం పండించాలె?
యాసంగి నుంచి వరి సాగు చేయొద్దనడం అన్యాయం. ప్రభుత్వం వరి కొనుగోలు చేయకుంటే రైతులు ఏం సాగు చేసి బతకాలో చెప్పాలి. ఇక్కడ వరి సాగు చేయకుంటే తినడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వరి సాగుతోటే చాలా మంది జీవితం ముడిపడి ఉంది.
– జెరిపోతుల రంగన్నగౌడ్, రైతు, చింతపల్లి, కురవి మండలం
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా వరి సాగు చేయవద్దంటే ఎలా, రైతుల పరిస్థితి ఏమవుతుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నీటి లభ్యత పెరగటంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వానాకాలంలో సుమారు కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగుచేసే స్థాయికి చేరింది. ఇదే సమయంలో వరి సాగు కూడా భారీగా పెరిగింది. ఏటా రెండు పంటలు కలిపి కోటి ఎకరాలకుపైగా సాగవుతోంది. దిగుబడులు కూడా మెరుగయ్యాయి. ఇలా ఇబ్బడిముబ్బడిగా సాగు పెరగడంతో మార్కెటింగ్ సమస్యలు ఎదురవుతున్నాయి. దొడ్డురకాలు ఎక్కువ సాగు చేయటంతో అంతర్రాష్ట్ర, విదేశీ ట్రేడర్ల నుంచి.. యాసంగిలో బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఉత్పత్తి చేయటం ద్వారా ఎఫ్‌సీఐ నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికే ఉప్పుడు బియ్యం ఉత్పత్తిని తగ్గించి, పచ్చి బియ్యం (అదికూడా సన్న బియ్యం) ఉత్పత్తిని పెంచడం, యాసంగిలో వరిసాగుకు విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడమనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
భారీగా వరిసాగు
కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా వానాకాలంలో భారీగా సాగు జరుగుతోంది. గత ఏడాది వానాకాలంలో 53.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలోనూ ఏకంగా 52.79 లక్షల ఎకరాల్లో వరి వేశారు. రెండు సీజన్లలో కలిపి కోటి ఎకరాలకుపైగా వరి సాగు చేయగా.. ఒక్క ఏడాదిలోనే రెండున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. వానాకాలం సీజన్‌లో ఉత్పత్తి అవుతున్న సుమారు కోటీ 25 లక్షల టన్నుల ధాన్యంతోనే.. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల అవసరాలు తీరుతాయి. యాసంగిలో ఉత్పత్తయ్యే మరో కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం అదనంగా ఉంటోంది. దీంతో యాసంగిలో ఆ ధాన్యాన్ని ఎవరు కొనాలనే సమస్య ఎదురవుతోంది.
రైతులు వినే పరిస్థితి ఉండదు!
ప్రభుత్వం చెప్పగానే రైతులు వరి వేయడాన్ని మానుకోరని, తమకు అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారని ఒక అధికారి పేర్కొన్నారు. గతంలో పత్తి సాగు చేయవద్దని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కాస్త సాగు తగ్గిందని.. కానీ ఆ ఏడాది పత్తికి మంచి రేటు రావడంతో తర్వాతి ఏడాది మళ్లీ పత్తిసాగు భారీగా పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు వరి సాగు విషయంలోనూ రైతులెవరూ వినే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
ఇలాగైతే రైతులు అప్పుల పాలే..
నాకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. గతంలో నీళ్లు లేక, కరెంట్ రాక సగం పొలమే వేసేవాళ్లం. ఇప్పుడు కరెంటు, నీళ్ల బాధలేదు. ప్రభుత్వం కొంటేనే ఖర్చులు పోగా కొద్దో గొప్పో మిగులుతున్నాయి. ప్రభుత్వం కొనకుంటే.. వ్యాపారులు తక్కువ ధర ఇచ్చి రైతులను మోసం చేస్తారు.
-అలువాల నవీన్, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment