సాక్షి, భీమవరం: రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు సొమ్ములు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించిన వారంలోగా సొమ్ములను వారి బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
పండించిన పంటను నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం ద్వారా దళారుల కమీషన్ల బెడద లేకుండా రైతులకు మద్దతు ధర అందుతోంది. అంతేగాకుండా ధాన్యం సొమ్ములతోపాటు గోనె సంచులు, హమాలీలు, రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే చెల్లించడం రైతులకు వరంగా మారింది.
296 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు
జిల్లాలోని 20 మండలాల పరిధిలో గడిచిన దాళ్వా సీజన్‌లో సుమారు 2.19 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ధాన్యాన్ని దళారులు, రైస్ మిల్లర్లకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ధాన్యం అమ్మకం చేసిన 21 రోజుల్లోగానే పంట సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తుందని వ్యవసాయ, రెవెన్యు శాఖాధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
దీనితో దాళ్వా సీజన్‌లో జిల్లాలోని 74,083 మంది రైతుల నుంచి 6,43,128 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీరికి మొత్తం రూ.1,312.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.1,310.82 కోట్లు చెల్లించారు. అలాగే గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీలకు రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.41.55 కోట్లు దాదాపు జమ చేయగా కొద్దిమొత్తంలో ధాన్యం రవాణ చేసిన ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది.
బ్యాంకు లింకేజీ సక్రమంగా లేకే జాప్యం
జిల్లాలోని ధాన్యం విక్రయాలు చేసిన రైతుల్లో కేవలం 117 మందికి రూ.1.39 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆయా రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ చేయకపోవడం, జన్‌ధన్ బ్యాంకు ఖాతాకు కేవలం రూ.50 వేలు మాత్రమే జమచేసే అవకాశం ఉండడం వంటి అవరోధాలు కారణంగా సొమ్ములు జమ కాలేదు.
అలాగే గోనె సంచులు, రవాణా, హమాలీ చార్జీలకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయగా ఏజెన్సీల ద్వారా ధాన్యం రవాణా చేసిన సుమారు రూ.1.58 కోట్ల సొమ్మును ఏజెన్సీలు క్లయిమ్స్ అందజేయకపోవడంతో చెల్లించలేదు. ధాన్యం సొమ్ములతోపాటు రైతులకు రవాణా, హమాలీ, గోనె సంచులకు సంబంధించిన సొమ్ములను త్వరితగతిన ప్రభుత్వం చెల్లిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment