dalwa
-
ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో ముందంజ
సాక్షి, భీమవరం: రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు సొమ్ములు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించిన వారంలోగా సొమ్ములను వారి బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. పండించిన పంటను నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం ద్వారా దళారుల కమీషన్ల బెడద లేకుండా రైతులకు మద్దతు ధర అందుతోంది. అంతేగాకుండా ధాన్యం సొమ్ములతోపాటు గోనె సంచులు, హమాలీలు, రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే చెల్లించడం రైతులకు వరంగా మారింది. 296 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జిల్లాలోని 20 మండలాల పరిధిలో గడిచిన దాళ్వా సీజన్లో సుమారు 2.19 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని దళారులు, రైస్ మిల్లర్లకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ధాన్యం అమ్మకం చేసిన 21 రోజుల్లోగానే పంట సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తుందని వ్యవసాయ, రెవెన్యు శాఖాధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనితో దాళ్వా సీజన్లో జిల్లాలోని 74,083 మంది రైతుల నుంచి 6,43,128 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీరికి మొత్తం రూ.1,312.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.1,310.82 కోట్లు చెల్లించారు. అలాగే గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీలకు రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.41.55 కోట్లు దాదాపు జమ చేయగా కొద్దిమొత్తంలో ధాన్యం రవాణ చేసిన ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ సక్రమంగా లేకే జాప్యం జిల్లాలోని ధాన్యం విక్రయాలు చేసిన రైతుల్లో కేవలం 117 మందికి రూ.1.39 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆయా రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ చేయకపోవడం, జన్‌ధన్ బ్యాంకు ఖాతాకు కేవలం రూ.50 వేలు మాత్రమే జమచేసే అవకాశం ఉండడం వంటి అవరోధాలు కారణంగా సొమ్ములు జమ కాలేదు. అలాగే గోనె సంచులు, రవాణా, హమాలీ చార్జీలకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయగా ఏజెన్సీల ద్వారా ధాన్యం రవాణా చేసిన సుమారు రూ.1.58 కోట్ల సొమ్మును ఏజెన్సీలు క్లయిమ్స్ అందజేయకపోవడంతో చెల్లించలేదు. ధాన్యం సొమ్ములతోపాటు రైతులకు రవాణా, హమాలీ, గోనె సంచులకు సంబంధించిన సొమ్ములను త్వరితగతిన ప్రభుత్వం చెల్లిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : దాళ్వాకు అనుమతినివ్వాలని కోరుతూ మంగళవారం వందలాదిమంది రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఉండి రోడ్డులోని లోసరి కాలువ వద్ద ఇరిగేషన్ అధికారులు వేసిన అడ్డుకట్టను తొలగించి, నీటిని విడుదల చేశారు. అక్కడే రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈలోగా అక్కడ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరగా అధికారులు వచ్చి దాళ్వాకు నీరిస్తామని ప్రకటించేవరకు ఆందోళనను విరమించేదిలేదని బీష్మించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ లోసరి మెయిన్ ఛానల్‌కు నీరిచ్చి దిగువ గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు, మూడేళ్ల నుంచి వరుస తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు దాళ్వాకు అనుమతినివ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసం నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. పెసర, మినుము పంటలు వేసుకోమని అధికారులు చెబుతున్నా చౌడు భూముల్లో అపరాలు వంటివి పండవన్నారు. అనంతరం నరసాపురం ఆర్డీవో వసంతరావు రైతులతో మాట్లాడారు. భీమవరం మండలంలో చాలా మంది నారుమళ్లు వేసుకున్నారని, ఇప్పుడు దాళ్వా వేయవద్దని చెప్పడం సమంజసంకాదని, వెంటనే దాళ్వాకు నీరివ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్డీవో వసంతరావు రైతులతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్ప వెళ్లి పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. కలెక్టర్‌కు పరిస్థితిని నివేదిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన సద్ధుమణిగింది. నాయకులు జేఎన్వీ గోపాలన్, కొప్పర్తి వెంకట రామారావు, గుద్దటి రవికుమార్, బొమ్మిడి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, గుద్దటి చంద్రరావు, రామాయణం ఏడుకొండలు, భూసారపు అమ్మిరాజు, ఆరేటి సత్యనారాయణ, బోడపాటి రామకృష్ణ, జడ్డు పెదకాపు, ఆకుల నరసింహమూర్తి, ముత్యాలరావు, ఇంటి రామకృష్ణ, కొప్పర్తి భాస్కరరావు, రైతులు పాల్గొన్నారు.