భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : దాళ్వాకు అనుమతినివ్వాలని కోరుతూ మంగళవారం వందలాదిమంది రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఉండి రోడ్డులోని లోసరి కాలువ వద్ద ఇరిగేషన్ అధికారులు వేసిన అడ్డుకట్టను తొలగించి, నీటిని విడుదల చేశారు. అక్కడే రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈలోగా అక్కడ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరగా అధికారులు వచ్చి దాళ్వాకు నీరిస్తామని ప్రకటించేవరకు ఆందోళనను విరమించేదిలేదని బీష్మించారు.
ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ లోసరి మెయిన్ ఛానల్‌కు నీరిచ్చి దిగువ గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు, మూడేళ్ల నుంచి వరుస తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు దాళ్వాకు అనుమతినివ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసం నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. పెసర, మినుము పంటలు వేసుకోమని అధికారులు చెబుతున్నా చౌడు భూముల్లో అపరాలు వంటివి పండవన్నారు. అనంతరం నరసాపురం ఆర్డీవో వసంతరావు రైతులతో మాట్లాడారు. భీమవరం మండలంలో చాలా మంది నారుమళ్లు వేసుకున్నారని, ఇప్పుడు దాళ్వా వేయవద్దని చెప్పడం సమంజసంకాదని, వెంటనే దాళ్వాకు నీరివ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
దీంతో ఆర్డీవో వసంతరావు రైతులతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్ప వెళ్లి పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. కలెక్టర్‌కు పరిస్థితిని నివేదిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన సద్ధుమణిగింది. నాయకులు జేఎన్‌వీ గోపాలన్, కొప్పర్తి వెంకట రామారావు, గుద్దటి రవికుమార్, బొమ్మిడి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, గుద్దటి చంద్రరావు, రామాయణం ఏడుకొండలు, భూసారపు అమ్మిరాజు, ఆరేటి సత్యనారాయణ, బోడపాటి రామకృష్ణ, జడ్డు పెదకాపు, ఆకుల నరసింహమూర్తి, ముత్యాలరావు, ఇంటి రామకృష్ణ, కొప్పర్తి భాస్కరరావు, రైతులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
Published Wed, Dec 18 2013 5:32 AM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
Advertisement
Advertisement