వరిపై వట్టి ప్రచారమే..!
►పట్టిసీమ ద్వారా నీళ్లిచ్చినా పశ్చిమ డెల్టాలో పూర్తి కాని నాట్లు
► గతేడాది కంటే భారీగా తగ్గిన మిర్చి సాగు
► పెరిగిన పత్తి విస్తీర్ణం
► కౌలు రైతులకు అందని రుణాలు
సాక్షి, అమరావతి బ్యూరో: ‘ పట్టి సీమ ద్వారా నీరు ఇచ్చాం.. రైతులు రెండు నెలల ముందే వరి సాగు చేసుకొనే అవకావం వచ్చింది..’ అని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆగస్టులోనే ప్రారంభిస్తున్నారు. కారణం పశ్చిమ డెల్టా రైతులు ప్రభుత్వ ప్రచారాన్ని పట్టించుకొలేదు. రైతులు సంప్రదాయబద్ధంగా ఏటా సాగు చేస్తున్న మాదిరిగా ఈ నెలలోనే వరి సాగు ప్రారంభించారు. దీనికి ప్రధాన కారణం జూన్ నెలలోనే సాగు ప్రారంభిస్తే అక్టోబరు, నవంబరులో పంట కోత వస్తోంది. ఆ సమయంలో తుఫాన్‌లు వస్తే భారీ నష్టం సంభవిస్తుందనే కోణంలో రైతులు ఆలోచిస్తున్నారు.
భారీగా తగ్గిన మిర్చి సాగు..
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 13,38,035 ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ కేవలం 7,83,765 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 4,63,527 ఎకరాల్లో పత్తి పంట సాగు కావడం గమనార్హం. గతేడాది మిర్చి పెద్దఎత్తున సాగు చేయగా ఈ ఏడాది పత్తి సాగుపై రైతులు దృష్టి సారించారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 1,02,105 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా ఈసారి కేవలం 29,810 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు చేయడం గమనార్హం. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఈ ఏడాది వరి సాగు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్నారు. అపరాల పంటలు వేసేందుకు కూడా ఆసక్తి చూపటం లేదు.
కౌలు రైతులకు కష్టాలే....
కౌలు రైతుల పట్ల ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 5,193 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.4,000 కోట్లకు పైగా రుణాలు అందాయి. ఇప్పటికే వరి పంటకు తప్ప, అన్ని çరకాల పంటలకు పంట బీమా గడువు ముగిసింది. జిల్లాలో దాదాపు 2 లక్షల మందికి పైగా కౌలు రైతులు పంట సాగు చేస్తున్నారు. అయితే వీరిలో ఎల్‌ఈసీ కార్డులు, సీఓసీ పత్రాలు కేవలం 70,000 మందికి మాత్రమే అందాయి.
ప్రభుత్వం ఈ ఏడాది కచ్చితంగా రైతులకు ఇస్తున్న రుణాల్లో 10శాతం రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని నిబంధన పెట్టింది. అంటే రూ.400 కోట్ల మేర కౌలు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 14,000 వేల మంది కౌలు రైతులకు నామమాత్రంగా రూ. 62 కోట్లు ఇవ్వడం గమనార్హం. వరి పంటకు సైతం ఆగస్టు 21తో బీమా గడువు ముగుస్తోంది. ఖరీఫ్‌లో ఇంకా దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సింది. వీరంతా పంటల బీమా చేసుకొనే అవకాశం కోల్పోనున్నారు.