కార్తెలు కరిగిపోతున్నాయి..! | No rain's for rice cultivation | Sakshi
Sakshi News home page

కార్తెలు కరిగిపోతున్నాయి..!

Published Sat, Jul 15 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

కార్తెలు కరిగిపోతున్నాయి..!

కార్తెలు కరిగిపోతున్నాయి..!

కానరాని వర్షం జాడ..
► అదను దాటుతోందని అన్నదాత ఆవేదన
► బోసిపోతున్న ప్రాజెక్టులు, చెరువులు
► మరో పది రోజులు వర్షాలు లేకుంటే..
► పత్తి, మొక్కజొన్న, సోయాకు దెబ్బ
► వరి సాగుకు అనుకూలించని వర్షాలు


సాక్షి నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి నెల రోజులవుతున్నాయి. మరో పక్క కార్తెలు కరిగిపోతున్నాయి. తొలకరిలో మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేయడంతో రైతు పరిస్థితి దిక్కుతోచకుంది. ఇప్పటికే భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాల్సి ఉంది.

కొత్తనీటితో జలాశయాలు నీటి కుండలను తల పించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో అధిక వర్షపాతం, 15 జిల్లాల్లో సాధా రణ వర్షపాతం నమోదు కాగా, జగి త్యాల, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో లోటు వర్షపాత మున్నట్లు తాజాగా వ్యవసాయ శాఖ వెల్లడిం చింది. పది శాతం చెరువుల్లో కూడా కనీస నీటి నిల్వలు లేవు.  ఇప్పటికే నార్లు పోసు కున్న అదను దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల్లో వర్షాలు పడ కుంటే కొద్దిపాటిగా సాగు చేసిన ఆరు తడి పంటలు  దెబ్బతినే ప్రమాదముంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి...
ఠి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాజెక్టుల కింద సుమారు 2,67,780 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజీల్లోనే ఉన్నా యి. ఒక్క కడెం ప్రాజెక్టు గరిష్ట మట్టానికి పది అడుగులుండటంతో 5 రోజులుగా నారుమ డుల కోసం నీటిని విడుదల చేస్తున్నారు.  ఉమ్మడి జిల్లాలో 2,579 చెరువుల కింద 2,68,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం చెరువుల్లోకి కూడా నీళ్లు రాలేదు.  అత్య ధికంగా పత్తి, సోయా, మొక్కజొన్న  వేశారు.

♦ మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైతాంగం జూలై చివర్లో వరినాట్లు వేసుకుంటారు. వర్షాధా రంగా చెరువుల కింద పంటలు పండించు కుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,332 కుంటలు, చెరువులు ఉండగా, 86 చెరువులు మాత్రమే నిండాయి. 5,448 చెరువులు 25 శాతం, 559 చెరువులు 50 శాతం, 192 చెరువుల్లో 75 శాతం నీళ్లు చేరాయి.
♦ పాత నల్లగొండ జిల్లాలో 4,652 చెరువులు ఉండగా.. 60 చెరువులు పూర్తిగా నిండాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లోకి వరదనీరు రాలేదు. 4,27,459 హెక్టార్లకుగాను 1,47,122 హెక్టార్లలో మాత్రమే వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర్లు, వేరుశనగ, 1,00,907 హెక్టార్లలో పత్తి సాగు చేశారు.
♦ సంగారెడ్డి జిల్లా పరిధిలో 1,279 చెరువులకు గాను.. ఏ ఒక్క చెరువులోనూ కనీస స్థాయిలో నీరు చేరలేదు. ఖరీఫ్‌లో 5.19 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 3.04 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది 51వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని చెబుతున్నా 35 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశముంది. బోరు బావుల కింద నారు పోసిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి 1.82 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పటికే వర్షాలు లేక మొక్కలు అక్కడక్కడా వడలిపోతున్నాయి.
♦  మెదక్‌ జిల్లాలో 2,240 చెరువులు వుండగా ఒక్కటీ పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో పత్తి, మొక్కజొన్న వంటి వర్షాధార, ఆరుతడి పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. బోరు బావుల కింద వరినారు పోసిన రైతులు.. చెరువులు, కుంటల్లో నీరులేక నాట్లకు మొగ్గు చూపడం లేదు. ఈ సీజన్‌లో 2.31 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 88,984 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.
♦  సిద్దిపేట జిల్లాలో 5.79 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4.20 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసి వుంటారని ప్రాథమిక అంచనా. చెరువులు, కుంటల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో వర్షాధారం, బోరుబావుల ఆధారంగానే రైతులు పంటలు వేశారు.
♦ వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 1,907 చెరువులు ఉండగా, 1.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి 22 వేల హెక్టార్లలో వరి పంట సాగు అవుతోంది. బోర్లకింద ఇప్పటికే 30 శాతం రైతులు నారుమళ్లు పోసుకుంటున్నారు.
♦ నిజామాబాద్‌ జిల్లాలో 1,241 చెరువులు ఉన్నాయి. వీటిలో సుమారు 600 చెరువుల్లో నీటిమట్టం సగం కూడా లేదు. కొన్ని చిన్న చెరువులు, కుంటల్లో అయితే సుమారు 30 శాతానికి నీటి మట్టం పడిపోయిందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.34 టీఎంసీలు మాత్రమే నీటి మట్టం ఉంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలకుగాను ప్రస్తుతం 2.44 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది.  
♦ కామారెడ్డి జిల్లాలో 1,988 చెరువులు, కుంట లు ఉన్నాయి. ఏ ఒక్కదానిలో ఇప్పటి దాకా చుక్కనీరు చేరలేదు. జిల్లాలో 1,47,635 హెక్టార్లలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,10,917 హెక్టార్లలో విత్తనాలు వేశారు.

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము రాజం, గట్టమ్మ దంపతులు వరిసాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నారు. తొలకరికి పోసుకున్న నారుమడి వర్షాల్లేక ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో ఎడ్లబండిపై డ్రమ్ములతో సమీపంలో బోర్లవద్ద నుంచి నీళ్లు తెచ్చి బిందెలతో నారుమడిని తడుపుతున్నారు.    – భీమారం(చెన్నూర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement