సాక్షి, అమరావతి: సర్వ సాధారణంగా ఎవరైనా సరే మన పరిస్థితిని సమీక్షించుకోవాలంటే గతంతో బేరీజు వేసుకుంటారు. ఇప్పుడు అంతకంటే మెరుగ్గా ఉన్నామో లేదో పరిశీలించుకుంటారు. ఈనాడు రామోజీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం! పొరపాటున కూడా అలా పోల్చే సాహసం చేయరు! ఎందుకంటే చంద్రబాబు వైఫల్యాలు, రైతులకు చేసిన మోసాలు బహిర్గతమవుతాయి కాబట్టే!! టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో వరి సాగు సగటున మరో నాలుగున్నర లక్షల ఎకరాలకుపైగా అదనంగా పెరిగింది. అందుకు తగ్గట్లే అన్నదాతలకు ఆదాయమూ పెరిగింది.
నీళ్లపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ కొందరు రైతులు ప్రభుత్వ తోడ్పాటుతో ఉద్యాన పంటల వైపు మళ్లి పండ్ల తోటల సాగుతో మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వరి రైతులకు బోనస్ చెల్లిస్తున్నారంటూ రామోజీ మన రాష్ట్రం గురించి మొసలి కన్నీళ్లు కార్చారు. గ్రామస్థాయిలోనే రైతన్నలకు ఆర్బీకేల ద్వారా పంట ఉత్పాదకాలన్నీ సమకూరుస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం నుంచి పంట నష్ట పరిహారం దాకా ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తోంది.
సీజన్ ముగియకుండానే ఇన్‌పుట్ సబ్సిడీ అందుతోంది. పంటలను నేరుగా కల్లాల నుంచే కొనుగోలు చేస్తూ రైతన్నలకు గన్నీ బ్యాగులు, లేబర్ చార్జీలు, రవాణా చార్జీలను సైతం చెల్లించి వారిపై భారం పడకుండా ఆదుకుంటోంది. జీఎల్‌టీ పేరుతో టన్నుకు రూ.2,523 చొప్పున ధాన్యం కొనుగోలు డబ్బులతోపాటే రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్న విషయం రామోజీకి తెలుసా? తెలిసీ నటిస్తున్నారా?
ఈనాడు ఆరోపణ: ఏపీలో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది...
వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు కాగా రబీలో 19.92 లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో ఏటా సగటున 55.43 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు గత నాలుగేళ్లుగా సగటున 60 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. చంద్రబాబు పాలనలో 2014–15లో గరిష్టంగా 59.85 లక్షల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు 2020 – 21లో గరిష్టంగా 63.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.
రాష్ట్రంలో వరి మొత్తం సాగు విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు కాగా 2022–23లో 55.52 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు మాత్రమే. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్యసాగు విస్తరించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 6.34 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ పొంతన లేని లెక్కలతో ఈనాడు కథలు అల్లింది.
ఆరోపణ: పంట విరామం ప్రకటించినా మొద్దు నిద్రే
వాస్తవం: చంద్రబాబు అధికారంలో ఉండగా కరువు మండలాలను ప్రకటించని ఏడాదంటూ లేదు.గత నాలుగేళ్లుగా అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాలేదు. పుష్కలంగా వర్షాలు, సమృద్ధిగా సాగునీరు, ముందస్తుగానే కాలువలకు నీటి విడుదలతో సిరులు పండుతున్నాయి. గోదావరి, కృష్ణాకే కాకుండా తొలిసారిగా పెన్నాకు కూడా వరదలు వచ్చాయంటే వరుణుడు ఏ స్థాయిలో కరుణ కురిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటప్పుడు పనిగట్టుకుని పంట విరామం ప్రకటించాలి్సన అవసరం ఏముంటుందో రామోజీకే తెలియాలి. 2022–23లో వరి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తే పంట విరామం ప్రకటించినట్లుగా నోటికొచి్చన అంకెలతో రామోజీ అబద్ధాలను అచ్చేశారు.
ఆరోపణ: మద్దతు ధర మాయే..
వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. టీడీపీ హయాంలో దళారులదే రాజ్యం. తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించడమే ఇందుకు నిదర్శనం. 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
ఒక్కో రైతు నుంచి సగటున 33.89 టన్నుల ధాన్యం సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారురైతులున్న ఈ రాష్ట్రంలో ఈస్థాయిలో ధాన్యంఅమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 32,78,354 మంది రైతుల నుంచి రూ.58,766 కోట్ల విలువైన 3,10,69,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. గరిష్టంగా కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేశారు.
ఆరోపణ: తడిసిన ధాన్యాన్ని కొనలేదు..
వాస్తవం: గతంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఒక్కో బస్తాకి (75 కేజీలు) మద్దతు ధర కంటే రూ.200 – రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇప్పుడు జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షిస్తున్నారు.
తడిసిన ధాన్యాన్నే కాకుండా ముక్క విరిగిన ధాన్యాన్ని సైతం బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు చేసిన మొత్తం ధాన్యంలో సుమారు 30 శాతం తడిసిన ధాన్యమే ఉంది. కేంద్ర నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మిల్లర్లను ఒప్పించి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా సేకరించింది. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడమే కాకుండా పొలం నుంచే నేరుగా కొనుగోలు చేస్తూ జీఎల్‌టీ(గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది.
టన్నుకు రూ.2,523 చొప్పున (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలుగా రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85) చెల్లిస్తుండగా ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాల్‌కు రూ.418 చొప్పున భరిస్తోంది. ఈ అదనపు మొత్తాన్ని ధాన్యం సొమ్ముతో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు.
ఆరోపణ: వరిసాగు లేక కూలీలు వలసపోతున్నారు
వాస్తవం: వరి సాగు లేక వ్యవసాయ పనిదినాలు తగ్గిపోయాయని, కూలీలు వలస వెళుతున్నారంటూ రామోజీ కంటతడి పెట్టారు. వాస్తవానికి ఉపాధి హామీ పనులతో పాటు ఇతర పనుల కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. సాగులో కూలీల కొరత తీర్చేందుకు యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చి పెట్టుబడి ఖర్చులను తగ్గించేలా యంత్రపరికరాలను అందుబాటులోకి తెచ్చింది.
ఆరోపణ: వరి రైతును ఆదుకునే చర్యలేవి?
వాస్తవం: 2020 నుంచి ఇప్పటివరకు వైపరీత్యాల వల్ల 15.31 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా 12.79 లక్షల మంది వరి రైతులకు రూ.930.56 కోట్ల పెట్టుబడి రాయితీని సీజన్ ముగియకుండానే అందజేశారు. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు 2.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఈనాడుకు మాత్రం 3.51 లక్షల ఎకరాలుగా తోచింది. 2014 నుంచి నేటి వరకు ఎకరాకు పెట్టుబడి రాయితీ రూ.6 వేల చొప్పునే ఇస్తున్నారు.
2018లో తితిలీ, పెతాయి తుపాన్ వల్ల నష్టపోయిన పంటలకు కేవలం రెండు జిల్లాల పరిధిలో మాత్రమే ఎకరాకు రూ.8వేల చొప్పున ఇచ్చారు. 2014–19 మధ్య 359 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 42.26 లక్షల ఎకరాలు కరువు బారిన పడినట్లు గుర్తించారు. నాడు పరిస్థితి అంత దారుణంగా ఉంటే 20.09 లక్షల మంది రైతులకు రూ.2,188.74 కోట్ల పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది కాదా? ఈ లెక్కలు రామోజీ ఎక్కడ దాచినట్లు?
ఆరోపణ: ఏటా ఉత్పాతమే...
వాస్తవం: ఆహార ధాన్యాల దిగుబడి 2014–19 మధ్య ఐదేళ్లలో సగటు 153.94 లక్షల టన్నులు
కాగా గత నాలుగేళ్లలో 170.96 లక్షల టన్నులు ఉంది. ఒక్క వరినే పరిశీలిస్తే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏటా సగటున 1.22 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2019–22 మధ్య 1.29 కోట్ల టన్నుల చొప్పున ఉత్పత్తి జరిగింది.
2021–22 ఖరీఫ్‌లో హెక్టార్‌కు 4,351, రబీలో 6,950 కేజీల చొప్పున దిగుబడి నమోదైంది. 2022–23 ఖరీఫ్‌లో 5,195 కేజీలు, రబీలో 6,944 కేజీల చొప్పున దిగుబడి వచ్చింది. 2021–22లో 1.25 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 2022–23లో 1.29 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే దిగుబడి పెరిగినట్లా? తగ్గినట్లా? రామోజీకి మాత్రం ఇవన్నీ కనపడవు. ఎందుకంటే ఆయన కళ్లున్నా కబోదిలానే వ్యవహరిస్తున్నారు కాబట్టి!!
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్లను (2022–23)మన రైతన్నలు సాధిస్తుండగా తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఎంత ప్రోత్సహిస్తున్నా ఫలితం లేకపోవడంతో కేరళ ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బొండాల కోసం క్యూ కడుతుండగా తమిళనాడు మన రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీల వైపు చూస్తోంది. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యాన్ని జార్ఖండ్ కొనుగోలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment