
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండటంతో రబీలో వరిపై ప్రధానంగా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 2017–18 రబీ సీజన్‌కు సంబంధించి అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని తాజాగా ఖరారు చేసింది. సంబంధిత నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం 2016–17 రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.22 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుత రబీలో సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 31.80 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. ఇందులో సగం విస్తీర్ణంలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 1.78 లక్షల ఎకరాలు అదనంగా 15.10 లక్షల ఎకరాలు లక్ష్యంగా ప్రకటించింది.
ఖరీఫ్‌లో నిరాశే..
ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి నిరాశే మిగిల్చింది. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, సరైన వర్షాలు కురవక 19.07 లక్షల (82%) ఎకరాలకే పరిమితమైంది. ఈ ఏడాది జూన్–సెప్టెంబర్ మధ్య 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 8, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్ కాలంలో 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే అక్టోబర్ ఒకటి నుంచి 22 (ఆదివారం) నాటికి రాష్ట్రంలో 51 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ సీజన్‌లో నిండని జలాశయాలు, చెరువులు 22 రోజుల్లో నిండాయి. కాబట్టి రబీలో వరి నాట్లు గణనీయంగా పెరుగుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా ఈ రబీలో వరి నాట్లు ఎక్కువగా పడతాయని ఆశిస్తున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్వి పార్థసారథి ఆశాభావం వ్యక్తపరిచారు. కావల్సిన విత్తనాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.