కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కళకళలాడుతున్న వరి పొలాలు
సాక్షి, అమరావతి: రబీలో పంటలు రికార్డు స్థాయిలో సాగయ్యాయి. సాధారణంగా రబీలో అపరాల సాగు ఎక్కువగా, వరి తక్కువగా సాగవుతుంది. కానీ ఈ రబీలో అపరాలతో పోటీగా వరి కూడా సాగవ్వడం విశేషం. రబీలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా, 2018–19లో 15.41 లక్షలు, 2019–20లో 19.38 లక్షల ఎకరాల్లో సాగవ్వగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.03 లక్షల ఎకరాలు దాటింది. మరో 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. అపరాలు సాధారణ సాగు విస్తీర్ణం 24.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 22.69 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేసవి పంట కింద ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 1.5 లక్షల ఎకరాల్లో అపరాల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే గత ఐదు సంవత్సరాల్లో కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో రబీ సాగు 60 లక్షల ఎకరాల మార్క్‌ను అందుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వారం పది రోజుల్లో రబీ సీజన్ ముగియనుంది.
సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలు
► రబీ సాధారణ విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా, 2018–19లో 53.04 లక్షల ఎకరాల్లో సాగయింది. 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అలాంటిది ఈ ఏడాది ఇప్పటికే 55.63 లక్షల ఎకరాల మార్కును అందుకుంది.
► నెల్లూరు, చిత్తూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు పడే అవకాశాలున్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ అందుకోలేని లక్ష్యాన్ని ఈసారి అందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది 58.92 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు.
► వరి తర్వాత అత్యధికంగా 11.03 లక్షల ఎకరాల్లో శనగ సాగవ్వగా, 8.75 లక్షల ఎకరాల్లో మినుములు, 2.23 లక్షల ఎకరాల్లో పెసలు, ఇతర అపరాలు 1.11 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
► 3.91 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.52 లక్షల ఎకరాల్లో జొన్నలు, 1.45 లక్షల ఎకరాల్లో పొగాకు, 92 వేల ఎకరాల్లో మిరప, ఇతర పంటలు 1.14 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కాగా.. గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 50 వేల ఎకరాల చొప్పున నువ్వులు, మొక్క జొన్న, 30 వేల ఎకరాల వరకు అపరాలు సాగయ్యే అవకాశాలున్నాయి.
పచ్చని తివాచీలా రాయలసీమ
► నీళ్లు లేక నెర్రలు చాచే ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటోంది. ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్టు రాయలసీమ పచ్చని సీమగా కన్పిస్తోంది. ఆక్వా ప్రభావంతో ఓ వైపు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో రబీ సాగు తగ్గుతుండగా, రాయలసీమ జిల్లాల్లో గత రెండేళ్లుగా రబీ సాగు అనూహ్యంగా పెరుగుతోంది.
► వ్యవసాయం పండుగలా మార్చేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సమృద్ధిగా సాగు నీరివ్వడంతో ఈ ప్రాంతంలో లక్ష్యానికి మించి రబీ సాగవుతోంది.
► వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రబీ సాధారణ విస్తీర్ణం 16.99 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 17.75 లక్షల ఎకరాలు దాటింది. అత్యధికంగా అనంతపురంలో 4 లక్షల ఎకరాలు, చిత్తూరులో 2.10 లక్షలు, కర్నూలులో 7.65 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు దాటింది.
► వరి విషయానికి వస్తే ఈ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,991 ఎకరాలు కాగా, ఈ ఏడాది 2,64,531 ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా చిత్తూరులో 1,29,477 ఎకరాలు, కర్నూలులో 80,339 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 35,795 ఎకరాలు, అనంతపురంలో 18,920 ఎకరాల్లో సాగైంది. ఈ జిల్లాల్లో అపరాలు సాధారణ విస్తీర్ణం 9,57,314 ఎకరాలు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 10,09,462 ఎకరాల్లో సాగయ్యాయి. చరిత్రలో ఈ స్థాయిలో రాయలసీమ జిల్లాల్లో రబీ సాగవ్వలేదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో రబీ సాగు
రబీ సాగు దాదాపు చివరి దశకు వచ్చింది. గతేడాది 54.14 లక్షల ఎకరాలు సాగవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే 55.63 లక్షల ఎకరాలు దాటింది. వేసవి పంట కింద నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాల వరకు వరి, గోదావరి జిల్లాల్లో మరో 1.50 లక్షల ఎకరాల వరకు అపరాలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఇదే ఊపు కొనసాగితే 60 లక్షల ఎకరాలు దాటొచ్చు.
– హెచ్ అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
రెట్టించిన ఉత్సాహం..
ఖరీఫ్ చివరిలో ‘నివార్’ దెబ్బ తీయడంతో కాస్త ఇబ్బంది పడిన రైతన్నలు రబీ సాగును కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. ఖరీఫ్‌లో మాదిరిగానే రబీ సాగు ఆరంభంలోనూ వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సొమ్ము అందింది. దీనికి తోడు పూర్తి స్థాయిలో అక్కరకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, కావాల్సిన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. పైగా రికార్డు స్థాయిలో రుణాలందడంతో సాగు వేళ అన్నదాతలకు ఏ దశలోనూ ఇబ్బంది లేకుండా పోయింది. వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సమృద్ధిగా సాగు నీరివ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో రైతన్నలు రికార్డు స్థాయిలో రబీ పంటలు సాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment