Rabi crops cultivation
-
రబీ కోతల వేళ అకాల వర్షాలు
సాక్షి, అమరావతి: రబీ కోతలు జోరుగా సాగుతున్న తరుణంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను కొంత ఇబ్బందికి గురిచేశాయి. వీటి ప్రభావంతో చేలమీద ఉన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ దిగుబడులకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వర్షాలు, ఈదురుగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,243.6 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో అత్యధికంగా 4,488.4 ఎకరాల్లో వరి, 2,416.1 ఎకరాల్లో మొక్కజొన్న, 87.5 ఎకరాల్లో పత్తి, 61.3 ఎకరాల్లో మినుము, 58.8 ఎకరాల్లో బాజ్రా, 55.1 ఎకరాల్లో పెసలు, 32 ఎకరాల్లో నువ్వులు, 25 ఎకరాల్లో కొర్రలు, 12.4 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 7 ఎకరాల్లో రాగులు పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పశ్చిమగోదావరిలో 3,111.3 ఎకరాలు, వైఎస్సార్‌లో 1,517.5, విజయనగరంలో 878, శ్రీకాకుళంలో 693.6, నెల్లూరులో 380, కర్నూలులో 305, అనంతపురంలో 248.7, ప్రకాశంలో 102, విశాఖలో 7.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ సాక్షికి తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుది నివేదిక తయారు చేస్తామని చెప్పారు. రెండురోజులు మోస్తరు వర్షాలు మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. మరట్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీరప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ద్రోణి వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
రబీలో రికార్డు స్థాయిలో పంటల సాగు
సాక్షి, అమరావతి: రబీలో పంటలు రికార్డు స్థాయిలో సాగయ్యాయి. సాధారణంగా రబీలో అపరాల సాగు ఎక్కువగా, వరి తక్కువగా సాగవుతుంది. కానీ ఈ రబీలో అపరాలతో పోటీగా వరి కూడా సాగవ్వడం విశేషం. రబీలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 17.60 లక్షల ఎకరాలు కాగా, 2018–19లో 15.41 లక్షలు, 2019–20లో 19.38 లక్షల ఎకరాల్లో సాగవ్వగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.03 లక్షల ఎకరాలు దాటింది. మరో 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. అపరాలు సాధారణ సాగు విస్తీర్ణం 24.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 22.69 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేసవి పంట కింద ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 1.5 లక్షల ఎకరాల్లో అపరాల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే గత ఐదు సంవత్సరాల్లో కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో రబీ సాగు 60 లక్షల ఎకరాల మార్క్‌ను అందుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వారం పది రోజుల్లో రబీ సీజన్ ముగియనుంది. సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలు ► రబీ సాధారణ విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా, 2018–19లో 53.04 లక్షల ఎకరాల్లో సాగయింది. 2019–20లో 54.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అలాంటిది ఈ ఏడాది ఇప్పటికే 55.63 లక్షల ఎకరాల మార్కును అందుకుంది. ► నెల్లూరు, చిత్తూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు పడే అవకాశాలున్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ అందుకోలేని లక్ష్యాన్ని ఈసారి అందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది 58.92 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ► వరి తర్వాత అత్యధికంగా 11.03 లక్షల ఎకరాల్లో శనగ సాగవ్వగా, 8.75 లక్షల ఎకరాల్లో మినుములు, 2.23 లక్షల ఎకరాల్లో పెసలు, ఇతర అపరాలు 1.11 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ► 3.91 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.52 లక్షల ఎకరాల్లో జొన్నలు, 1.45 లక్షల ఎకరాల్లో పొగాకు, 92 వేల ఎకరాల్లో మిరప, ఇతర పంటలు 1.14 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కాగా.. గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మరో 50 వేల ఎకరాల చొప్పున నువ్వులు, మొక్క జొన్న, 30 వేల ఎకరాల వరకు అపరాలు సాగయ్యే అవకాశాలున్నాయి. పచ్చని తివాచీలా రాయలసీమ ► నీళ్లు లేక నెర్రలు చాచే ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటోంది. ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్టు రాయలసీమ పచ్చని సీమగా కన్పిస్తోంది. ఆక్వా ప్రభావంతో ఓ వైపు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో రబీ సాగు తగ్గుతుండగా, రాయలసీమ జిల్లాల్లో గత రెండేళ్లుగా రబీ సాగు అనూహ్యంగా పెరుగుతోంది. ► వ్యవసాయం పండుగలా మార్చేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సమృద్ధిగా సాగు నీరివ్వడంతో ఈ ప్రాంతంలో లక్ష్యానికి మించి రబీ సాగవుతోంది. ► వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రబీ సాధారణ విస్తీర్ణం 16.99 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 17.75 లక్షల ఎకరాలు దాటింది. అత్యధికంగా అనంతపురంలో 4 లక్షల ఎకరాలు, చిత్తూరులో 2.10 లక్షలు, కర్నూలులో 7.65 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు దాటింది. ► వరి విషయానికి వస్తే ఈ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,991 ఎకరాలు కాగా, ఈ ఏడాది 2,64,531 ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా చిత్తూరులో 1,29,477 ఎకరాలు, కర్నూలులో 80,339 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 35,795 ఎకరాలు, అనంతపురంలో 18,920 ఎకరాల్లో సాగైంది. ఈ జిల్లాల్లో అపరాలు సాధారణ విస్తీర్ణం 9,57,314 ఎకరాలు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 10,09,462 ఎకరాల్లో సాగయ్యాయి. చరిత్రలో ఈ స్థాయిలో రాయలసీమ జిల్లాల్లో రబీ సాగవ్వలేదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో రబీ సాగు రబీ సాగు దాదాపు చివరి దశకు వచ్చింది. గతేడాది 54.14 లక్షల ఎకరాలు సాగవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే 55.63 లక్షల ఎకరాలు దాటింది. వేసవి పంట కింద నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాల వరకు వరి, గోదావరి జిల్లాల్లో మరో 1.50 లక్షల ఎకరాల వరకు అపరాలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఇదే ఊపు కొనసాగితే 60 లక్షల ఎకరాలు దాటొచ్చు. – హెచ్ అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ రెట్టించిన ఉత్సాహం.. ఖరీఫ్ చివరిలో ‘నివార్’ దెబ్బ తీయడంతో కాస్త ఇబ్బంది పడిన రైతన్నలు రబీ సాగును కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. ఖరీఫ్‌లో మాదిరిగానే రబీ సాగు ఆరంభంలోనూ వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సొమ్ము అందింది. దీనికి తోడు పూర్తి స్థాయిలో అక్కరకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, కావాల్సిన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. పైగా రికార్డు స్థాయిలో రుణాలందడంతో సాగు వేళ అన్నదాతలకు ఏ దశలోనూ ఇబ్బంది లేకుండా పోయింది. వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సమృద్ధిగా సాగు నీరివ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో రైతన్నలు రికార్డు స్థాయిలో రబీ పంటలు సాగు చేస్తున్నారు. -
రబీకి రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే రబీ సాగు కోసం వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ నీటి పారుదల సదుపాయాలు సహా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 22,77,407 హెక్టార్లలో రబీ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ చెప్పారు. ఇందులో ఆహార పంటల సాగు 19,91,326 హెక్టార్లుగా ఉండనుంది. పెరిగిన అంచనాలు: గత ఏడాది కనీసం 25 లక్షల హెక్టార్లలో రబీ సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. 22 లక్షల హెక్టార్లకు మించలేదు. ఈ ఏడాది రబీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. ఈ పరిస్థితుల్లో సాగుపై అంచనాలు పెరిగాయి. ఈసారి అన్ని రిజర్వాయర్ల కింద పెద్దఎత్తున వరి సాగు చేయవచ్చని భావిస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ కుడి కాల్వకు నాలుగేళ్ల తరువాత పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తుండటంతో దాని పరిధిలోని 11 లక్షల ఎకరాలు పూర్తిగా సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కుడి కాల్వ కింద గల ప్రధాన కాలువలన్నిటికీ నీరు వదిలారు. రైతులు నార్లు కూడా పోసుకున్నారు. వచ్చే నెల రెండు వారం నుంచే నాట్లు పడనున్నాయి. విత్తన ప్రణాళిక ఖరారు ఖరీఫ్ అనుభవాలను దృష్టిలో వ్యవసాయాధికారులు వచ్చే రబీకి ముందే విత్తన ప్రణాళిక ఖరారు చేశారు. ఆయా జిల్లాలకు అవసరమైన విత్తనాలను ముందే పంపించారు. 14,180 క్వింటాళ్ల వరి, 29,438 క్వింటాళ్ల వేరుశనగ, 36,250 క్వింటాళ్ల పప్పు శనగ, 9,545 క్వింటాళ్ల మినుము, 3,550 క్వింటాళ్ల పెసలు, 140 క్వింటాళ్ల కందులు, 6,940 క్వింటాళ్ల మొక్కజొన్న, 150 క్వింటాళ్ల జొన్న విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు 647 క్వింటాళ్ల రాగులు, 450 క్వింటాళ్ల నువ్వులు, 105 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు, 732 క్వింటాళ్ల ఉలవలు, 2,225 క్వింటాళ్ల రాజ్మా, 600 క్వింటాళ్ల ధనియాలు, పిల్లిపెసర, జనుము తదితర విత్తనాలను కూడా సిద్ధం చేశారు. వీటిని అర్హులైన రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తారు. -
తిండి గింజలకు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు విస్తీర్ణం నిరాశాజనకంగా ఉంది. జనవరి వచ్చినా పంటల సాగు విస్తీర్ణం పెరగలేదు. కేవలం మూడో వంతు విస్తీర్ణంలోనే సాగయ్యాయి. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, రబీ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 10.77 లక్షల (32%) ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. అందులో ఆహార పంటల సాధారణ సాగు విస్తీర్ణం 26.12 లక్షల ఎకరాలు కాగా, కేవలం 7.32 లక్షల (28%) ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆహార ధాన్యాల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.92 లక్షల (11%) ఎకరాల్లోనే సాగు కావడం గమనార్హం. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.25 లక్షల (54%) ఎకరాల్లో సాగైంది. ఇక నూనె గింజల సాగులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.32 లక్షల (65%) ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా వరి నాట్లు పుంజుకోకపోవడంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగునీటి వనరులు లేనిచోట వరికి బదులు ప్రత్యామ్నాయ వర్షాధార పంటలు వేయాలని రైతులకు సూచించింది. అందుకు సంబంధించిన విత్తనాలను సిద్ధం చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. 18 జిల్లాల్లో వర్షాభావం... ఇక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొని ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. దీంతో రబీ పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకిందని వ్యవసాయశాఖ తెలిపింది. నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల వ్యవసాయాధికారులను ఆదేశించింది. -
సాగు భారమే
నిజాంసాగర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత రబీ పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు విపరీత ంగా పెరిగాయి. వర్షాకాలం చివరి వరకు కురిసిన వానలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాలలో పుష్కలంగా నీరు చేరింది. ఖరీఫ్ కన్నా రబీ సాగు విస్తీర్ణం పెరుగుతున్నా, పెట్టుబడులూ రెట్టింపుగానే ఉన్నాయని రైతులు వాపోతు న్నారు. ముఖ్యంగా వరి సాగును ఎంచుకున్న రైతులు పెట్టుబడులకు తిప్పలు పడుతున్నారు. విత్తన ఎంపిక మొదలు నారుమడి నుంచి పంట నూర్పిడి వరకు పొలాలను రైతులు కంటికి రెప్పలా చూసుకోవాల్సి వస్తోంది. ముడి చమురు ధరలు పెరగడంతో మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆ ప్రభావం రైతులపైనా పడింది. ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ కూలీల ధరలు రెట్టింపయ్యాయి. కాంప్లెక్స్, యూరియా ధరలు పెరిగాయి. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు చేసిన మహిళా కూలీలకు రూ. 100 నుంచి రూ.110 చెల్లించారు. ఈ రబీ సాగులో కూలీలకు రూ. 130 నుంచి రూ. 150 వర కు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొం టున్నారు. అంతేకాకుండా ఎకరం పొలా న్ని దమ్ముచేసే ట్రాక్టర్‌కు ఖరీఫ్‌లో రూ. 1300 చెల్లించగా ప్రసుత్తం రబీలో రూ. 1600 వరకు ట్రాక్టర్ల యజమానులు పెం చారు. ఇలా ఈ రబీ సీజన్లో పంటల సాగు ధరలు పెరగడంతో సన్నకారు రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఎకరం పొలానికి రైతులు రూ. 20 వేలకు పైగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఆరు నెలలకు చేతికొచ్చే పంటలకు రేయిం బవళ్లు కష్టపడినా రూ. 30 వేలకు మించి దిగుబడి రావడం లేదంటున్నారు. ‘మద్దతు’ కరువు వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతు లు వాపోతున్నారు. వరి ధాన్యానికి క్విం టాలుకు రూ. 1,500 నుంచి రూ. 1,800 మద్దతు ధరను చెల్లించాలని రైతులు కోరుతున్నారు.