సాక్షి, అమరావతి: రబీ కోతలు జోరుగా సాగుతున్న తరుణంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను కొంత ఇబ్బందికి గురిచేశాయి. వీటి ప్రభావంతో చేలమీద ఉన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ దిగుబడులకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వర్షాలు, ఈదురుగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,243.6 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో అత్యధికంగా 4,488.4 ఎకరాల్లో వరి, 2,416.1 ఎకరాల్లో మొక్కజొన్న, 87.5 ఎకరాల్లో పత్తి, 61.3 ఎకరాల్లో మినుము, 58.8 ఎకరాల్లో బాజ్రా, 55.1 ఎకరాల్లో పెసలు, 32 ఎకరాల్లో నువ్వులు, 25 ఎకరాల్లో కొర్రలు, 12.4 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 7 ఎకరాల్లో రాగులు పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పశ్చిమగోదావరిలో 3,111.3 ఎకరాలు, వైఎస్సార్‌లో 1,517.5, విజయనగరంలో 878, శ్రీకాకుళంలో 693.6, నెల్లూరులో 380, కర్నూలులో 305, అనంతపురంలో 248.7, ప్రకాశంలో 102, విశాఖలో 7.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ సాక్షికి తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుది నివేదిక తయారు చేస్తామని చెప్పారు.
రెండురోజులు మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. మరట్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీరప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ద్రోణి వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment