ధర దగా!
- మండుతున్న కూరగాయల ధరలు
- రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40-50
- యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ
- వినియోగదారులు విలవిల
సాక్షి, సిటీబ్యూరో: ఇన్నాళ్లూ ఎండల తీవ్రతకుఅల్లాడిన నగర జనం... ఇప్పుడు కూరగాయల ధరల మంటలతో విలవిలలాడుతున్నారు. రుతు పవనాల రాకతో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినా.... కూరగాయల ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని... నగరానికి సరఫరా తగ్గిందన్న కారణాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు ఒక్కసారిగా కూరగాయల ధరలు పెంచేశారు.
ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా రూ.40-50 ధర పలుకుతున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన టమోటా, మిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు సామాన్యుడికి అందనంత పైకి ఎగబాకాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాప్సికం, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్‌ల ధరలు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నాయి. వీటి ధర కిలో రూ.50-80 ఉంటోంది. ఇక పచ్చిమిర్చి, బెండ, గోకర, వంకాయ, చిక్కుళ్లు వంటివి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.40-50 పలుకుతున్నాయి. ఫ్రెంచ్ బీన్స్,క్యాప్సికం, చిక్కుడు ధరలను మినహాయిస్తే.... అన్ని వర్గాల వారు వినియోగించే టమోటా, వంకాయ, కాకర, క్యాబేజీ, బీర, బెండ, దొండ, క్యారెట్, చిక్కుడు, గోకర వంటి ధరలు హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.20 నుంచి రూ.30 మధ్యలోనే ఉన్నాయి.
అవి రిటైల్ వ్యాపారుల చేతిలోకి వచ్చేసరికి అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్లో మిర్చి ధర కేజీ రూ.30 పలుకగా...బహిరంగ మార్కెట్లో రూ.45- 50కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా ఇలానే ఉన్నాయి. నిజానికి హోల్‌సేల్ మార్కెట్లో కంటే 30 శాతం అదనంగా రైతు బజార్లలో ధరను నిర్ణయిస్తారు. వాటిలో పచ్చిమిర్చి, బెండ, బీర, చిక్కుడు, గోకర, కాకర తదితర కూరగాయల ధరలు రూ.23-33 మధ్యలో ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధర రూ.40-50 వంతున వసూలు చేస్తున్నారు. తోపుడుబండ్ల వారైతే... ఇంటిముంగిటకే తెచ్చామంటూ మరో రూ.2 అదనంగా వడ్డిస్తున్నారు. వారం క్రితంతో పోలిస్తే ఇప్పుడు ధరలు రూ.2నుంచి రూ.14 వరకు పెరిగాయి.
తగ్గిన సరఫరా...
నగర అవసరాలకు నిత్యం 45-50 వేల క్వింటాళ్ల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 30-35 శాతం సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరల నియంత్రణకు రైతుబజార్లలో సబ్సిడీపై టమోటా విక్రయాలను ప్రారంభించిన అధికారులు తగినంత సరుకును సేకరించలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం అన్ సీజన్ కావడం వల్ల కొన్ని రకాల కూరగాయలు కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఆగ్రా ప్రాంతాల నుంచే గాక, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో సహజంగానే వాటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయంటున్నారు. వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, వానలు తగ్గితే రెండు రోజుల్లో ధరలు దిగివస్తాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు నమ్మబలుకుతున్నాయి.