- భారీగా పెరిగిన కూరగాయల ధరలు
- హోల్‌సేల్ ధరకు రెట్టింపుగా రిటైల్‌లో..
సాక్షి, ముంబై: నగరంలోని కూరగాయల ధరలు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్ రేటుకు రిటైల్ మార్కెట్ రేటుకు చాలా వ్యత్యాసం ఉంటోందని చెబుతున్నారు. ఆదివారం రిటైల్ మార్కెట్‌లో కిలో మిరప ధర రూ. 100- 120 పలకగా.. హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.70 మాత్రమే ఉంది. బీన్స్ , పచ్చి బఠాణీ ధరలు కూడా ఇలాగే ఉన్నాయి. ఏపీఎంసీ హోల్‌సేల్ మార్కెట్‌లో పచ్చి బఠాణీ కి.లో ధర రూ.50 పలకగా, బీన్స్ కి.లో రూ. 60 వరకు ధర పలకగా.. రిటైల్‌లో రూ.100 దాటాయి.
అయితే దీనిపై కూరగాయల వ్యాపారులు వేరే విధంగా స్పందిస్తున్నారు. రిటైల్ ధరలు హోల్‌సేల్ ధరలకు రెట్టింపుగానే ఉంటాయని పేర్కొంటున్నారు. ‘మామూలుగానే రిటైల్ ధరలు హోల్‌సేల్ ధరల కంటే రెట్టింపుగా ఉంటాయి. అకాల వర్షాలు, కూరగాయల సరఫరా తగ్గిపోవడం, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, గుంటూరు, హవేరి నుంచి కూరగాయల సరఫరా గణనీయంగా తగ్గడంతో ముంబై మార్కెట్‌లో కూరగాయల డిమాండ్ పెరిగింది’ అని హోల్ సేల్ వ్యాపారి బాలాసాహెబ్ బోండ్లే తెలిపారు. ప్రస్తుతం రాయ్‌పూర్ నుంచి వచ్చే పచ్చిమిరప ఎక్కువ ధర పలుకుతోందని, డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. పచ్చిబఠాణీ, కాలీఫ్లవర్, బీన్స్, వంకాయలకు అన్‌సీజన్ కావడంతో ధరలు పెరిగాయని వ్యాపారి మోహిత్ యాదవ్ పేర్కొన్నారు. టమోటా, క్యాబేజీ, కీరదోస ధరలు నిలకడగానే ఉన్నాయి.
మార్కెట్‌లో ‘రిటైల్’ మోసం
Published Mon, May 4 2015 11:07 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement