వణికిస్తున్న ఉల్లి
తగ్గిన సాగు విస్తీర్ణం..
మార్కెట్లకు నిలిచిన ఉల్లి సరఫరా..
మండిపోతున్న ధరలు
ఉల్లి.. ఇప్పుడు ఈ మాట వింటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు! ఉల్లిని కోస్తే వచ్చే కన్నీళ్లు కాస్త పేరు వింటేనే వచ్చే పరిస్థితి నెలకొంది. ‘రేటు’ పోటుతో వంటింట్లో ‘ఉల్లి’ బాంబులు పేలుతుండడంతో సామాన్యుల నుంచి స్థితిమంతుల దాకా జేజారవుతున్నారు. రెండు నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇదే పరిస్థితి. రెండు రాష్ట్రాల్లో మార్కెటింగ్ శాఖలు రంగంలోకి దిగి ధరలకు కళ్లెం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో కొండెక్కిన ఉల్లి ధరలను దించేందుకు అటు కేంద్రం కూడా పాకిస్తాన్, చైనా, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వాలను, జనాన్ని అతలాకుతలం చేస్తున్న ఉల్లి లొల్లిపై ఈ వారం ఫోకస్..
- కల్వల మల్లికార్జున్‌రెడ్డి
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ఉల్లి దిగుమతులపైనే అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడతాయి. దీంతో ఉల్లి ధరల పెరుగుదల సాధారణంగా ప్రతీ ఏటా మే నెలలో ప్రారంభమై సెప్టెంబర్ నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. 2014 ఏప్రిల్, మే నెలలో హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.7 కాగా, జూలై నుంచి అక్టోబర్ మధ్య రూ.22కు చేరుకోవడమే ఇందుకు ఉదాహరణ. మార్కెట్లోకి డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉంటే ధరలు అదుపులో ఉంటాయి. అయితే ఉల్లి సరఫరా తగ్గి, ధరలు పెరగడం ప్రారంభం కాగానే దళారీలు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని తమకు అనువుగా మార్చుకుంటున్నారు.
తెలంగాణలో దిగుబడి తక్కువే..
ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ఉత్పత్తి, వినియోగంలో చైనాది అగ్రస్థానం కాగా.. భారత్‌ది రెండో స్థానం. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, హర్యాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉల్లి పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 11.80 లక్ష ల హెక్టార్లు కాగా.. సగటు దిగుబడి 189.24 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 30 శాతం దిగుబడి కేవలం మహారాష్ట్ర నుంచే వస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రబీ సీజన్లో ఉల్లి సాగు ఎక్కువ. 2014-15లో తెలంగాణలో 15 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 4.9 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్‌లో హెక్టారుకు సగటున 25 టన్నుల దిగుబడి వస్తుండగా తెలంగాణలో ఇది 18 టన్నులు మాత్రమే!
రంగంలోకి మార్కెటింగ్ శాఖ
ఉల్లి ధరలు ఇప్పట్లో దిగివచ్చే పరిస్థితి లేకపోవ డంతో తెలంగాణ మార్కెటింగ్ శాఖ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. నాసిక్ (మహారాష్ట్ర), కర్నూలు, మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్ల నుంచి ఉల్లి సేకరణకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ నుంచి నిధులు వెచ్చించి ఉల్లి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ సబ్సిడీ ధరలపై విక్రయించేందుకు ఉల్లి విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సేకరణ ధరతో నిమిత్తం లేకుండా కిలో రూ.20 చొప్పున ఒక్కో కుటుంబానికి రెండు కిలోలు పంపిణీ చేస్తున్నారు. సబ్సిడీ ఉల్లి నల్ల బజారుకు తరలకుండా మార్కెటింగ్ విభాగం అదనపు డైరక్టర్ నేతృత్వంలో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు.
2008 నుంచి పెరిగిపోతున్నాయ్
డిమాండ్, సరఫరాలో అంతరం వల్ల 2008 నుంచి ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోని రైతు బజార్లలో 2008లో కిలో ఉల్లి ధర గరిష్టంగా రూ.8 కాగా.. 2009లో రూ.10, 2013 (సెప్టెంబర్)లో రూ.50 పలికింది. రైతు బజార్లకు వచ్చే ఉల్లి సరఫరా కూడా ఏటేటా తగ్గుతూ పోతోంది.
ఉద్యానవన శాఖ అప్రమత్తం
ఉల్లి ధరలను స్థిరీకరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికపై తెలంగాణలోని ఉద్యానవన శాఖ దృష్టి సారించింది. 2014-15లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఉద్యాన వన శాఖ 50 శాతం సబ్సిడీపై 17,439 కిలోల ఉల్లి విత్తనాలు రైతులకు అంద జేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు 75 శాతం సబ్సిడీపై 14 వేల ఎకరాలకు సరిపడేలా ఉల్లి విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా తక్కువ గోదాముల నిర్మాణం, ఉల్లికి కనీస మద్దతు ధర నిర్ణయించడం, పంట సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఎందుకు ఈ పరిస్థితి?
ఈ ఏడాది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, దళారీలు ధరల పెరుగుదలను ఊహించి ఉల్లిని నిల్వ చేశారు. దీంతో మార్కెట్లకు ఉల్లి సరఫరా తగ్గి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోనే ఉల్లి లావాదేవీలు అత్యధికంగా జరిగే లాసల్గావ్ (మహారాష్ట్ర) వ్యవసాయ మార్కెట్లో జూలై ఆరంభంలో కిలో ఉల్లి హోల్‌సేల్ ధర రూ.19 ఉండగా.. ప్రస్తుతం రూ.38కి చేరింది. తెలంగాణలోని రిటైల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర ఆగస్టు మొదటి వారానికి రూ.40కి చేరింది. గ్రేడ్ వన్ రకం ఉల్లి కిలో రూ.55పైనే పలుకుతోంది.
పరిష్కారం ఏమిటి..?
ఏటా సెప్టెంబర్ నుంచి ఉల్లి నిల్వలు మార్కెట్లకు వస్తుంటాయి. అయితే అవి మార్కెట్లోకి రావడానికి 4 నుంచి 6 వారాల ముందు నుంచే ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు సాధారణ స్థాయిలో ఉండే ఏప్రిల్, మే నెలల్లో మహారాష్ట్రతో పాటు రైతుల నుంచి నేరుగా ఉల్లి సేకరించి నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు. నాణ్యత కలిగిన ఉల్లిని సుమారు ఆరు నెలల పాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కనీసం ఎనిమిది వారాలకు సరిపడే ఉల్లి నిల్వలను ‘బఫర్ స్టాక్’ చేయడం ద్వారా ధరలను నియంత్రించవచ్చనే సూచనలు ప్రభుత్వానికి అందాయి. సేకరించిన ఉల్లిని గోదాముల్లో నిల్వ చేయాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ భావిస్తోంది.
5 వేల టన్నుల ఉల్లి కావాలి
ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఐదు వేల టన్నుల ఉల్లి అవసరం ఉంది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు 2 వేల టన్నులు, జిల్లాలకు 3 వేల టన్నులు చొప్పున సేకరించాలని నిర్ణయించాం. ఉల్లి సేకరణకు అవసరమైన రూ.18.31 కోట్లలో 50 శాతం వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతా నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇటీవల కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్‌కు లేఖ రాశాం.
- మంత్రి హరీశ్‌రావు
ఏపీలో సబ్సిడీ ద్వారా 4,700 టన్నుల ఉల్లి పంపిణీ
బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోయినందున సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత నెల 29వ తేదీ నుంచి రైతు బజార్లలో కిలో రూ.20లకే విక్రయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డెరైక్టర్ రాంగోపాల్ తెలిపారు. తద్వారా చౌక ధరలకు ఉల్లిని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,700 టన్నుల ఉల్లిని సేకరించి సబ్సిడీపై విక్రయించామని తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సేకరిస్తున్న ఉల్లి ఇప్పటి వరకు సరాసరి కిలో రూ.30 మేరకు కొనుగోలు చేశామన్నారు. 4,700 టన్నుల ఉల్లి కూడా కర్నూలు జిల్లా నుంచి సేకరించామని పేర్కొన్నారు.
నాణ్యత లేని ఉల్లి పంపిణీ..
ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా అందిస్తున్న ఉల్లిపాయలు కంటితుడుపు చర్యగానే మిగిలింది. ప్రభుత్వం అందిస్తున్న ఉల్లిపాయలు మరీ నాసిరకంగా ఉంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో సబ్సిడీపై వీటిని విక్రయిస్తున్నారు. కుళ్లిన ఉల్లిపాయలు, తక్కువ తూకాలతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉల్లి కొరత తీవ్రంగా ఉంది. పలుచోట్ల పట్టణ ప్రాంతాల్లోనే ఉల్లిపాయలు సబ్సిడీతో అందించడంతో గ్రామీణ ప్రాంతవాసులు మండిపడుతున్నారు.
ఏపీలో డిమాండ్ 3.6 లక్షల టన్నులు
మహారాష్ట్ర ఉల్లిపాయలు నవంబర్ వరకు మార్కెట్‌కు వచ్చే అవకాశం లేకపోవడంతో మ రో మూడు నెలల పాటు ఉల్లి కన్నీళ్లు తప్పకపోవచ్చు!
డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మరో 25 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఉల్లిని ఉద్యానవన పంటగా గుర్తించి రాష్ట్రంలోని 9 జిల్లాలను అనువైన ప్రాంతాలుగా గుర్తించి విరివిగా ఉత్పత్తిని పెంచాలని ప్రణాళికను సిద్దం చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరం ఉండగా 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. లోటును భర్తీ చేసేందుకు మహారాష్ట్ర నుంచి లక్ష టన్నుల వరకు సేకరించి గోడౌన్లలో నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
కర్నూలులో సగానికి తగ్గిన సాగు
కర్నూలు జిల్లాలో ఉల్లి సాధారణ సాగు దాదాపు 19 వేల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 14,883 హెక్టార్లలో సాగయింది. గత ఏడాది దాదాపు 28 వేల హెక్టార్లలో సాగు కాగా, ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల 50 శాతానికి పడిపోయింది. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాభావం నెలకొనడంతో పంట దిగుబడులు బాగా తగ్గిపోయాయి. సగటున ఎకరాకు 35 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది.
ఎకరాకు పెట్టుబడి 25 వేల నుంచి 30 వేల వరకు వ్యయమవుతోంది. ప్రస్తుతం అంతంతమాత్రం దిగుబడులు రావడం వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు 6 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల వరకు ఉల్లి వస్తుండగా.. ప్రస్తుతం 4 వేల నుంచి 5 వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. మరో 3 వేల క్వింటాళ్ల వరకు తాడేపల్లిగూడెంకు పోతోంది. ప్రస్తుతం క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,100 వరకు లభిస్తోంది. ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో 4,700 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి వివిధ జిల్లాలకు తరలించారు.