ఉల్లి దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేత!
ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకునే అవకాశం
ధరల అదుపు కోసమే నిర్ణయం
గెజిట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఉల్లి దిగుమతులపై గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా దిగుమతి చేసుకునే వెసులుబాటే కాకుండా, ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రస్తుత నిబంధనలను సవరించింది. అయితే రాష్ట్రాల పరిధిలో చేసుకునే దిగుమతులకు సంబంధించి దిగుమతిదారు ఎప్పటికప్పుడు ఎంత స్టాకు దిగుమతి చేసుకుంటున్నది ప్రభుత్వానికి ముందుగానే చెప్పాలని సూచించింది. ఈ మేరకు నిత్యావసర సరుకుల చట్టంలో చేసిన సవరణలను పొందుపరుస్తూ కేంద్రం గెజిట్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆహార పంటల సాగు తగ్గిన నేపథ్యంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఉల్లి సహా ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదలకు అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నెల 7న అన్ని రాష్ట్రాలతో ధరల తగ్గింపు చర్యలపై అభిప్రాయాలను తీసుకుంది. నిత్యావసర సరుకుల్లో దేని ధర అయినా అనూహ్యంగా పెరిగిన పక్షంలో ఇతర రాష్ట్రం నుంచి కానీ, దేశం వెలుపల నుంచి కానీ వాటిని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. దీనిపై కదిలిన కేంద్రం ఉల్లిపై గతంలో పరిమిత రవాణా, స్టాక్ నిల్వలు, లెసైన్సులపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జులై 3 నుంచి వచ్చే ఏడాది జులై 2 వరకు ఈ ఆంక్షల నిలుపుదల ఉంటుందని పేర్కొంటూ గెజిట్ విడుదల చేసింది.