పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం... | Rs.500, Rs.1000 notes Banned: shortage of smaller denomination in the market | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం...

Published Wed, Nov 9 2016 6:12 PM | Last Updated on Wed, Apr 3 2019 5:14 PM

పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం... - Sakshi

పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం...

హైదరాబాద్ : రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తొలిరోజు బుధవారం ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా సామాన్యులు, పేద వర్గాలు ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. మరోవైపు మార్కెట్ లో చిల్లర కొరత తీవ్రమైంది. 50 రూపాయల వస్తువేదైనా కొనుగోలు చేసి షాపు యజమానికి వంద రూపాయలు ఇస్తే తిరిగి చెల్లించడానికి చిల్లర లేదని చెబుతున్నారు.

మార్కెట్ లో ప్రతినిత్యం జరిగే లావాదేవీలన్నీ గందరగోళంగా మారాయి. ఎక్కడ చూసినా... ఏ చేయాలన్నా వంద రూపాయలు అంతకన్నా తక్కువ డినామినేషన్ చెల్లించాల్సి రావడం, చాలా మంది వద్ద ఆ డినామినేషన్ లేకపోవడంతో క్రయవిక్రయ మార్కెట్ అంతా అతలాకుతలమైంది. అవసరాలు తీరక సామాన్యులు, వ్యాపారం జరక్క వ్యాపారస్తులు బోరుమన్నారు. వివిధ పనుల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారి సమస్య మరింత తీవ్రంగా ఉంది.

ప్రధానమంత్రి మంగళవారం రాత్రి చేసిన ప్రకటన ఈరోజు ఉదయం వరకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కూరగాయల మార్కెట్ లో ప్రతి ఒక్కరూ 500 నోటును ఇస్తుండటంతో కొందరు వ్యాపారస్తులు వాటిని అంగీకరించినప్పటికీ మిగిలిన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యారు. మరికొందరు ఆ నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. తద్వారా వారి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది.

సిటీ బస్సెక్కినా, ఊర్లకు వెళ్లడానికి బస్సెక్కినా, రైలెక్కినా, క్యాబ్ లో ప్రయాణం చేయాలన్నా, ఆటోలో వెళ్లాలన్నా... చిల్లర లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. చిల్లర లేని కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు సైతం ప్రయాణికులను ఎక్కించుకోలేక గిరాకీ వదులుకొనే పరిస్థితులు తలెత్తాయి. ఉబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసుల వారైతే 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కానందున క్యాబ్ ల్లో ప్రయాణించాలనుకునే వారు సరిపడా చిల్లర ఉంచుకోవాలని కస్టమర్లకు మెసేజ్ లు సైతం పంపించింది.

 

  • ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం రెండు రోజుల కిందట బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకురాగా, అందులో అన్నీ వెయ్యి, 500 రూపాయల నోట్లే ఉన్నాయి. తక్షణం ఉపయోగించాలంటే ఇప్పుడా డబ్బు ఏమాత్రం పనికి రావడం లేదు. పోనీ రెండు రోజుల తర్వాత తిరిగి ఆ డబ్బును బ్యాంకులో జమ చేసి మళ్లీ విత్ డ్రా చేద్దామంటే... పది వేలకు మించి తీసుకోవడానికి లేదని తెలిసి ఆ మధ్య తరగతి కుటుంబం ఇప్పుడేం చేయాలో తెలియక సతమతమవుతోంది.
     
  • ఒక వ్యక్తి తన ఇంటిని అమ్ముకోగా తొలివిడత చెల్లింపుగా రెండు రోజుల ముందే 20 లక్షల డబ్బు ఇచ్చారు. ఇప్పుడున్న నిబంధనల మేరకు రెండో విడత చెల్లింపు ఎప్పటివరకు చేస్తారో తెలియని పరిస్థితిని పక్కన పెడితే... అంత మొత్తం సొమ్మును బ్యాంకులో ఎలా జమ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఇతరత్రా పెద్దగా ఆదాయం లేకపోగా ఉన్న ఒక్క ఇంటిని విక్రయిస్తే వచ్చిన సొమ్ముకు ఎలా లెక్క చూపించాలో (మార్కెట్ ధరకు వాస్తవ విక్రయ ధరకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి) తెలియక తలపట్టుకున్నారు.
     
  • ఒక వ్యక్తి అత్యవసర మందులు కొనుగోలుకు మెడికల్ షాపులో వెయ్యి రూపాయల నోటు ఇవ్వగా రెండు వందల బిల్లు పోగా మిగిలిన చిల్లర లేదని, కావాలంటే చిట్టీ రాసిస్తాం... రెండు రోజుల తర్వాత తీసుకోవాలని చెప్పడంతో మందులు అత్యవసరం కాబట్టి చేసేదేమీ చిట్టీతో వెనుదిరిగాడు.
     
  • ఆస్పత్రిలో ఉన్న పేషంట్ కోసం బయటకెళ్లి బ్రెడ్ కొనుగోలు చేయాలన్నా చిల్లర లేక అనేక బాధలు పడుతున్నారు. సాధారణంగా ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారు మందులు వైద్యులకు చెల్లించడానికి ఈరోజుల్లో ఎవరైనా వేలల్లో డబ్బు తెచ్చుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల్లో వైద్యం కోసం వచ్చే వాళ్లు చిల్లర కొరత కారణంగా బ్రెడ్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా కొనుగోలు చేయలేక అనేక అవస్థలు పడుతున్నారు.
     
  • పెట్రోల్ బంకుల్లోనూ ఇదే పరిస్థితి. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లాంటి చిన్న వాహన దారులకు చిల్లర లేదన్న కారణంగా ఎక్కడ కూడా 500, 1000 నోట్లను అంగీకరించకపోవడం లేదు. కొన్ని చోట్ల బంకులను మూసివేశారు.
     
  • నేషనల్ హైవేస్ పైన టోల్ గేట్ల వద్ద 500, 1000 నోట్లను తీసుకోకపోవడంతో దాదాపు అన్ని హైవేస్ ల్లోనూ ట్రాఫిక్ స్థంభించిపోయింది. టోల్ గేట్ వారితో అనేక చోట్ల వాహనదారులు గొడవకు దిగారు. ముందు ఏం జరుగుతుందో తెలియక బారులు తీరిన వాహన శ్రేణుల్లో వెనకాల నిలిచిపోవిన వారు, ట్రాఫిక్ లో ఇరుక్కుని సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
     
  • మార్కెట్ లో లీటరు పాలు కొందామన్నా... కూరగాయలు కొనాలన్నా... ఒక పేస్ట్, పెన్ను, నోట్ బుక్... ఒకటేమిటి. ఏవీ కొనుగోలు చేయాలన్నా చేయలేకపోయారు. ఎక్కడైనా కొందరు వంద లేదా 50 రూపాయల నోట్లను చెల్లిస్తుంటే... వ్యాపారస్తులు చెల్లించాల్సిన చోట చెల్లించడం లేదు. మరో రెండు రోజులు ఎలా వెళ్లదీయడం అన్న కోణంలో చాలా మంది తమ వద్ద ఉన్న ముఖ్యంగా 50, 100 రూపాయల నోట్లను వినియోగంలో పెట్టకపోవడం, కొందరు వ్యాపారస్తులు వంద రూపాయల నోట్లను బ్లాక్ చేయడం కూడా చిల్లర కొరతకు కారణమవుతుందని తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement